ఉందిలే మంచి కాలం ముందు ముందునా...
posted on May 30, 2014 @ 11:29PM
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు చెపుతున్న మాటలు వింటుంటే, రానున్న ఐదేళ్ళలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని హంగులను ఏర్పరచుకొని, ఆర్ధికంగా నిలదొక్కుకొని దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడగలదనే నమ్మకం కలుగుతోంది. విజయవాడ-గుంటూరు నగరాలను మెట్రో నగరాలుగా తీర్చిదిద్దడం, వైజాగ్-విజయవాడ-గుంటూరు నగరాల మధ్య మెట్రో రైలు ఏర్పాటు, కడపలో ఉక్కు కర్మాగారం, విజయవాడ, విశాఖలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలో ఐఐటీ, యన్.ఐ.టీ. తదితర ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, వైజాగ్ లో ప్రత్యేక హైకోర్టు, రాష్ట్రానికి కొత్త రైల్వే జోను, వెనుకబడిన ఉత్తరాంధ్రా, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వంటివి అనేకం తమ ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమకూర్చబోతోందని ఆయన హామీ ఇస్తున్నారు. అయితే ఈ హామీలు ఎంతవరకు అమలు చేసి చూపిస్తారో రానున్న ఐదేళ్ళలోనే తేలిపోతుంది.
ఒకవేళ తెదేపా, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని, దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపినట్లయితే, వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు వారికే పట్టం కడతారు. దేశంలో ప్రజలందరూ సత్వర అభివృద్ధిని కోరుకొంటున్నారు. ఇకనయినా తమ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశిస్తున్నారు. అందుకే మోడీ, చంద్రబాబుల మాటలను విశ్వసించి వారికి పట్టం కట్టారు. అందువల్ల వారిరువురూ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని వాటికి అనుగుణంగా పనిచేయవలసి ఉంది. ప్రస్తుతం వారిరువురూ కూడా ఆవిధంగానే ముందుకు కదులుతున్నారు.
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత తన మంత్రి వర్గ సభ్యులకు 100రోజుల అజెండా ఇచ్చి, అందుకు అనుగుణంగా పనిచేయవలసినదిగా ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకు మంత్రుల పనితీరును, ప్రగతిని స్వయంగా తాను పరిశీలిస్తానని ముందే హెచ్చరించారు. అంతేకాక వారికి పది మార్గదర్శకాలు కూడా జారీ చేసారు. ఇక చంద్రబాబు కూడా ఇంకా ముఖ్యమంత్రి బాధ్యతలు చెప్పట్టక మునుపే పని మొదలు పెట్టేసారు. అందుకు ఆయనను అభినందించవలసిందే. శుక్రవారం ఆయన డిల్లీ వెళ్లి అనేకమంది కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి వారి సహాయ సహకారాలు అర్దించారు. దానికి వారు కూడా సానుకూలంగానే స్పందించారు.
గత పదేళ్లుగా కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంత చొరవ తీసుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్రాభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించింది. కానీ ఇప్పుడు కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ వాటి మధ్య చక్కటి అవగాహన, సహకార ధోరణి, సంకల్పదీక్ష స్పష్టంగా కనబడుతున్నాయి. బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మళ్ళీ మంచి రోజులు వచ్చాయనే నమ్మకం కలుగుతోంది.