కాంగ్రెస్ కొంపముంచనున్న సోనియా పుత్రవాత్సల్యం
posted on May 9, 2014 @ 10:04AM
ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలకు అగ్నిపరీక్షగా నిలిచాయి. ఒకవేళ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ గనుక అధికారం దక్కించుకోగలిగితే, ఇక రాహుల్ గాంధీ ఇక తన జీవితంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. 15ఏళ్ల క్రితం గుజరాత్ రాష్ట్రంలో మోడీ అధికారం కైవసం చేసుకొన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆయనను ఓడించలేకపోయింది. పైగా ఆయనే ఇప్పుడు కేంద్రంలో పాగా వేసేందుకు సిద్దమవుతున్నారు. ఒకవేళ ఆయన ప్రధాని కుర్చీలో స్థిరపడి దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టించగలిగితే, ఇక రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు అంధకారమే. ఈ విషమ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మున్ముందు రాహుల్ ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సెటిల్ అయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకోకుండా ఉండేందుకు, అదీ కుదరకపోతే కనీసం నరేంద్ర మోడీ ప్రధాని కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేయగలిగినంతా చేయడం తధ్యం.
సోనియాగాంధీకి తన కొడుకు అసమర్ధత గురించి తెలిసి ఉన్నప్పటికీ, తల్లి ప్రేమ ఆమె కళ్ళకు గంతలుగా మారాయి. గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి పునాది వంటిదని ఆమెకు కూడా తెలిసి ఉన్నప్పటికీ అపారమయిన పుత్రవాత్సల్యంతో రాహుల్ గాంధీ అనే చాలా బలహీనమయిన పునాదిపై కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేసారు. తత్ఫలితంగా అతని రాజకీయ జీవితాన్ని, దానితో బాటు కాంగ్రెస్ పార్టీని, దానిపై ఆధారపడిన వేలాది కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోబోతున్నారు. ఒకవేళ సోనియాగాంధీ తన పుత్రవాత్సల్యాన్ని అధిగమించి, ప్రియాంకా గాంధీని గనుక అతని స్థానంలో నిలబెట్టి ఉండి ఉంటే నేడు కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదేమో!
కానీ ఆమె తన అసమర్దుడయిన కొడుకుకే మొగ్గు చూపి అతనిని ప్రదానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి, అనేక నీచరాజకీయాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, జగన్, కేసీఆర్ లతో రహస్య ఒప్పందాలు, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్ నాశనం చేయడం, ఇందుకు కొన్ని ఉదాహరణలు. బహుశః ఇతర రాష్ట్రాలలో కూడా ఇంతకు ఏమాత్రం తీసిపోని కపట రాజకీయాలు చేసే ఉండవచ్చును.
గత పదేళ్ళ కాంగ్రెస్ అసమర్ధ పాలనలో జరిగిన అవినీతికి తోడు ఈ నీచరాజకీయాలను కూడా చూస్తున్న ప్రజలు ఆపార్టీ పట్ల చాలా విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. నిత్యం నీతి సూక్తులు వల్లించే యువరాజావారు కూడా తమ కాంగ్రెస్ పార్టీ ఇంత అవినీతికి పాల్పడుతున్నా, అసమర్ధ పాలన చేస్తున్నా, నీచ రాజకీయాలు చేస్తున్నా కూడా మౌనం వహించి తాను కూడా సగటు కాంగ్రెస్ నేత మాత్రమేనని చాటుకొన్నారు. అందుకు ఆయన ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. సోనియాగాంధీ కన్నప్రేమకి ఆమె కొడుకు రాజకీయ భవిష్యత్తే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా బలయిపోబోతోంది.