ముళ్ళ కిరీటం ధరించనున్న కేసీఆర్, చంద్రబాబు
posted on May 27, 2014 @ 10:29AM
ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో అధికారం దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల యుద్దంలో విజేతలుగా నిలిచిన తెరాస, తెదేపాలు త్వరలో అధికారం చెప్పట్టబోతున్నాయి. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంతత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే వారిరువురు ఇంతగా పోరాడి గెలుచుకొన్న ఆ అధికారం వారికి పూలబాట మాత్రం కాదు. రాష్ట్రవిభజనతో ఊహించని అనేక సమస్యలు ఎదుర్కోబోతున్న వారిరువురికీ ముఖ్యమంత్రి పదవులు ముళ్ళ కిరీటం వంటివే. అయితే అది ధరించాలని వారే కొరుకొన్నారు గనుక, దానిని వారు చిరునవ్వుతో భరించవలసి ఉంటుంది.
మొదటగా జూన్ 2న కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయబోతున్నారు. 15మందితో ఏర్పాటుచేయబోయే ఆయన మంత్రివర్గంలో ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, తెరాస నేత ఈటెల రాజేందర్ తదితరులు ముఖ్యమయిన మంత్రిపదవులు పొందబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభుత్వ బాధ్యతలు చేప్పట్టిన తరువాత మళ్ళీ కొన్ని వారాలు లేదా నెలల తరువాత అవసరాన్ని బట్టి మరికొందరిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఆయన విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయానికి నీళ్ళు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలపై మొదట దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణాలో ప్రైవేట్ విద్యుత్ సంస్థలను అడుగు పెట్టనీయమని ఆయన ముందే ప్రకటించడం వలన, ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను స్థాపనకు క్రుశిచేయవలసి ఉంటుంది. అయితే అది అంత తేలికగా అయ్యే పని కాదు. దేశ ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చెప్పట్టిన నరేంద్ర మోడీ, దేశ ఆర్ధిక వ్యవస్థపై పూర్తి పట్టు సాధించే వరకు బహుశః పెద్ద పెద్ద ప్రాజెక్టులను మంజూరు చేయకపోవచ్చును. అందువల్ల కేసీఆర్ తప్పనిసరిగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పతి సంస్థలకు ఆహ్వానం పలకవలసి ఉంటుంది.
ఇక వ్యవసాయానికి నీళ్ళు అందించాలంటే దానికి భారీ ప్రణాళికలు అవసరం. అయినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నఅంశమే కనుక దీని అమలుకు కేసీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించవచ్చును. ప్రస్తుతం తెలంగాణకు ఆర్ధికంగా లోటు లేదు గనుక ఉద్యోగుల క్రమబద్దీకరణ, సంక్షేమ కార్యక్రమాలు వగైరా కూడా కేసీఆర్ మెల్లగా చేప్పట్టవచ్చును.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూన్ 8 ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఆయన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారనే విషయం ఇంకా బయటకు పొక్కనివ్వలేదు. ఆయన కూడా మొదట చిన్న 15-20 మంది సభ్యులతో కూడిన చిన్న మంత్రివర్గంతోనే బాధ్యతలు చేప్పట్టి, ఆ తరువాత క్రమంగా విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు చాలా క్లిష్ట పరిస్తితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్దికసమస్యలకు తోడు, ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీలు, వివిధ సంక్షేమ పధకాల అమలు, కొత్త రాజధాని నిర్మాణం, హైదరాబాదు-గుంటూరు మధ్య తిరుగుతూ పరిపాలన సాగించవలసి రావడం వంటి అనేక సమస్యలున్నాయి.
వీటన్నిటినీ అమలు చేయాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం ఉంది. అందుకే ఆయన వారంలో ఒకరోజు డిల్లీ కూడా వెళ్లేందుకు యోచిస్తున్నారు. అయితే కేంద్రం నుండి నిధుల విడుదలలో జాప్యం అనివార్యం గనుక అంతవరకు ఆయన ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం గట్టిగా చేయవలసి ఉంటుంది. కానీ అందుకోసం ప్రజల మీద కొత్త పన్నులు వడ్డించే ఆలోచన చేస్తే మాత్రం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కాంగ్రెస్, వైకాపాలకు అదొక ఆయుధంగా మారుతుంది. అందువల్ల చంద్రబాబు ఆర్ధికలోటుని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవలసి ఉంటుంది. ఆ పనిని ఆయన ఎంత త్వరగా, సమర్ధంగా చేయగలరనేదే ఆయన కార్యదక్షతకు పరీక్షగా భావించవచ్చును.