పవన్ కళ్యాణ్ కి అందుకే అంత ప్రాధాన్యత ఇస్తున్నారా?
posted on May 22, 2014 @ 1:06PM
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ణి ఇటీవల ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించడంతో ఆయనకు బీజేపీ ఎంతటి ప్రాధాన్యం ఇస్తోందో అందరికీ అర్ధమయింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆయనకున్న అపారమయిన జనాధారణను చూసి నరేంద్ర మోడీ సైతం చాలా ఆశ్చర్యపోయారు. ఆయనను ప్రశంశలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రచారం వలన ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి ఓట్లశాతం మరింత పెరిగింది. అందుకే చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ణి కూడా కీలకమయిన ఎన్డీయే సమావేశానికి బీజేపీ ఆహ్వానించిందని ప్రజాభిప్రాయం.
ఈ సమావేశంలో బీజేపీ ఆయనకు కేంద్రమంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్దపడిందని, కానీ ఆయన నిరాకరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ దృవీకరించలేదు. అలాగని ఖండించలేదు కూడా. అంటే ఆయనకు బీజేపీ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చునని భావించవచ్చును. కానీ ఎన్డీయే సమావేశం నుండి బయటకు వచ్చిన తరువాత తాను ఎన్నికలలో ఎన్డీయే కూటమిని బలపరిచినప్పటికీ తప్పులు చేస్తే వారినీ తప్పకుండా నిలదీస్తానని చెప్పడం గమానార్హం. తాను మోడీ, బాబు ప్రమాణ స్వీకారోత్సవాలకి హాజరుకాలేనని కూడా చెప్పడం మరో విశేషం. వారి కోసం ఎన్నికల ప్రచారం చేసి, తీరా చేసి వారు బాధ్యతలు స్వీకరిస్తున్నపుడు వెళ్లనని చెప్పడం దేనికో తెలియదు.
ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ ముందే చెప్పినట్లుగా తెదేపా, తెరాస ప్రభుత్వాలను, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని మున్ముందు నిలదీయవచ్చును. వచ్చే ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్, అందుకోసం ఇప్పటి నుండే తన పార్టీని బలోపేతం చేసుకొంటానని ఇదివరకే చెప్పారు. బహుశః అందుకే ఆయన మంత్రి పదవులు వద్దనుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. అందుకే ఆయన తన సినిమాలను కూడా తగ్గించుకొంటానని చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.
అయితే పవన్ కళ్యాణ్ తను మద్దతు ఇచ్చిన పార్టీలను, వాటి ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజలలో నిలదీయడం మొదలుపెడితే అది తెదేపా-బీజేపీ ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు చేసిన అనేక ఎన్నికల హామీలను అమలుచేయమని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లయితే, ఆయన అభిమానులు, ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఆవిధంగా జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో మరింత ఆదరణ పెరుగవచ్చును. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నపవన్ కళ్యాణ్ణి, అలాగే దూరంగా ఉంచినట్లయితే, జనసేన పార్టీ క్రమంగా బలపడటమే కాకుండా, ఆయన నుండి మున్ముందు రెండు పార్టీలకు పెను సవాలు ఎదుర్కోక తప్పదు.
అయితే పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే, దానిని నడిపించడం మరో ఎత్తు. రెంటికీ కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. మరి తన జేబులో చిల్లి గవ్వ కూడా లేదని చెప్పుకొంటున్న పవన్ కళ్యాణ్, అది సంపాదించడానికి సినిమాలు కూడా చేయకుండా, రాజకీయ పార్టీని నడిపించగలరా? అనే ప్రశ్నను పక్కనబెడితే, పవన్ కళ్యాణ్ణి ఎన్డీయే కూటమి బయట ఉంచితే అతని వల్ల తెదేపా-బీజేపీ ప్రభుత్వాలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. బహుశః అందుకే ఆయనను కూడా ప్రభుత్వంలో పాలుపంచుకొనేలా చేయాలని తెదేపా-బీజేపీలు భావిస్తుండవచ్చును. కానీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ వాటితో కలిసి పనిచేసేందుకు నిరాకరించినట్లయితే, మున్ముందు ఆయన వల్ల ఆ రెండు పార్టీలకు సమస్యలు ఎదుర్కోకతప్పదని చెప్పవచ్చును.