తెలంగాణకు సేవ చేసిన సీమాంధ్రులు వద్దు, ఆదివాసీలు ముద్దు?
posted on May 29, 2014 @ 9:07PM
ఈరోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తిచేత మెడ పట్టించుకొని గెంటించుకొనే పరిస్థితి వస్తుందని ఊహించని అనేకమంది సీమాంధ్ర ప్రజలు, దశాబ్దాలుగా హైదరాబాద్ నే తమ స్వస్థలంగా భావిస్తూ, ఆంద్ర, తెలంగాణా అనే తారతమ్యం తెలుసుకోకుండానే వాటి అభివృద్ధికి తమ జీవితాలను ధారపోసారు. వారిలో కొందరు కొన్ని నెలలలో, మరి కొందరు రెండు మూడు సం.లలో పదవీ విరమణ చేయనున్నారు. అనేకమందికి ఇంకా చాలా సర్వీసు మిగిలి ఉంది.
రాష్ట్రవిభజనలో భాగంగా వారిలో కొందరు ఆంధ్రప్రదేశ్, మరికొందరు తెలంగాణా ప్రభుత్వాలకు కేటాయించబడ్డారు. వారందరూ తమ సేవలకు ప్రత్యేక గుర్తింపు కోరుకోవడం లేదు. కానీ సగౌరవంగా పదవీ విరమణ చేసి, ప్రశాంతంగా శేష జీవితం గడిచిపోతే చాలని కోరుకొంటున్నారు. వారందరూ గత మూడు నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ లో స్థిరపడినందున, వారి పిల్లలు కూడా తెలంగాణాలో పుట్టిపెరిగి, అక్కడే చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేసుకొంటూ తాము కూడా తెలంగాణా వాళ్ళమేనని భావిస్తారు తప్ప తాము ఆంధ్రావాళ్ళమని ఏనాడు అనుకోరు.
కానీ ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టనున్నకేసీఆర్, సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులకు ఆప్షన్లు ఉండవని, తెలంగాణా సచివాలయంలో ‘కల్తీకి’ అంగీకరించబోమని, వారు సచివాలయం గుమ్మంలో అడుగుపెట్టడానికి కూడా అంగీకరించమని హెచ్చరిస్తుంన్నారు. ఇప్పుడు కట్టుబట్టలతో తమను బయటకు పొమ్మని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెపుతుంటే తాము ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి.
తమ వాదనలో చాలా న్యాయం, ధర్మం ఉన్నాయని గట్టిగా వాదించే కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, పోలవరం ముంపు గ్రామాలకు మాత్రం ఇదే సూత్రం వర్తించదని అడ్డుగోలుగా వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సముద్రంలో వృధాగా పోతున్న నదీ జలాలను ఒడిసిపట్టి లక్షలాది ఎకరాలకు సాగు నీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించే పోలవరం ప్రాజక్టు నిర్మాణం కోసం, ఏడు మండలాలో గ్రామాలను ఆంధ్రాలో కలపడం, ఆ గ్రామాలలో నివసించే ఆదివాసీలను ఖాళీ చేయించడం చాలా అన్యాయమని, వారిని ఉన్నపళంగా ఊరువిడిచి పొమ్మంటే వారి పరిస్థితి ఏమిటని? కేసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణా బంద్ చేయించారు.
హైదరాబాద్ మరియు తెలంగాణా ప్రాంతాలలో మూడు నాలుగు దశాబ్దాలుగా స్థిరపడిన సీమాంధ్ర ప్రజలకు, పోలవరం ముంపు ప్రాంతాలలో స్థిరపడిన ఆదివాసీలకు కేసీఆర్ కుటుంబ సభ్యులు వేర్వేరు సిద్దాంతాలు సూత్రాలు అమలుచేయాలనుకోవడం చూస్తే వారికి సీమాంధ్ర ప్రజల పట్ల ఎంత విద్వేషం ఉందో స్పష్టం చేస్తోంది. నిజానికి కేసీఆర్ చేస్తున్న పోరాటం పోలవరం ముంపు గ్రామాలలో నివసించే ఆదివాసీల కోసమా? లేక తాము ద్వేషిస్తున్నఆంద్ర ప్రభుత్వం పైనా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ సభ్యులలో ఎవరూ కూడా ఆదివాసీలను ఆదుకొంటామని ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ వారి గ్రామాలన్నీ ఆంధ్రాలో కలపబడుతున్నందున, వారందరినీ తమ ప్రభుత్వం ఆదుకొంటుందని చంద్రబాబు ప్రకటించారు.