టీ-కాంగ్రెస్ పోస్టుమార్టం రిపోర్ట్
posted on May 18, 2014 7:20AM
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఇది ముందు నుండి అందరూ ఊహించిందే. కానీ, తెలంగాణా ఇచ్చినప్పటికీ అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోవడమే చాలా ఆశ్చర్యం కలిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తెరాస కంటే స్వల్ప ఆధిక్యత ప్రదర్శించడంతో కనీసం 40-50 అసెంబ్లీ స్థానలయినా దక్కుతాయనుకొంది. కానీ కనీసం గౌరవ ప్రధమయిన స్థానాలయినా పొందలేక చతికిలబడింది.
పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం సహించలేని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మధు యాష్కీ వంటివారు ఓటమికి అతనే పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాల్వాయి మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర విభజనకు కారకుడయిన దిగ్విజయ్ సింగ్ ను కూడా తప్పు పట్టారు. రాష్ట్ర విభజన ఖరారు అయినప్పటికీ తెలంగాణకు పీసీసీ ఏర్పాటులో జాప్యం చేయడం, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చిందనే విషయాన్ని బలంగా ప్రచారం చేసుకోకపోవడం, కేసీఆర్ ని తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు దూరంగా ఉంచడం ప్రధాన కారణాలని పాల్వాయి అభిప్రాయపడ్డారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమని చెప్పవచ్చును.
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడి కాంగ్రెస్ నేతలు టీ-కాంగ్రెస్ నేతల కంటే చాలా కలిసికట్టుగా ప్రచారం చేసారు. రాష్ట్ర విభజన పాపాన్ని అన్ని పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చాలా గట్టిగా చేసారు. బహుశః ఓటమి భయమే వారిని కలిసికట్టుగా పనిచేసేలా చేసింది. కానీ, విజయంపై చాలా ధీమాతో ఉన్న టీ-కాంగ్రెస్ నేతలందరూ ఎన్నికలు దగ్గిరపడే వరకు కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం, తమకు, తమ బందుకోటికి టికెట్స్ సాధించుకోవడం కోసం సిగపట్లతో కాలక్షేపం చేసారు. ఆ తంతు పూర్తయిన తరువాత కూడా వారు ప్రమాదాన్ని గుర్తించలేక వారిలో వారు కీచులాడుకొంటూ ఎన్నికలకు వెళ్లి భంగ పడ్డారు.
కానీ, తెరాస నేతలు, వారి అధ్యక్షుడు కేసీఆర్ మాత్రం రాష్ట్ర విభజన బిల్లుకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన మరుసటి రోజు నుండే ఆ ఘనత తమదేనని బలంగా ప్రచారం చేసుకొని ప్రజలను తమవైపు తిప్పుకోగలిగారు. ఆ దైర్యంతోనే కేసీఆర్ తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానని చెప్పగలిగారు. రాష్ట్ర విభజన తరువాత తెరాసను విలీనం లేదా దానితో పొత్తుల కోసం కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, కేసీఆర్ అంగీకరించకపోవడానికి కారణం ఆ ఆత్మవిశ్వాసమే.
పాల్వాయి చెప్పినట్లు కేసీఆర్ ని తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు దూరంగా ఉంచడం కూడా అందుకు మరో కారణమని అంగీకరించవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం తెరాసను విలీనం చేసుకోవాలనుకొన్నప్పుడు, అతనిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేసిఉన్నట్లయితే, తెరాసను విలీనం చేసి ఉండేవారేమో. కానీ కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ ఇరువురూ ఏనాడూ కూడా ఒకరినొకరు నమ్మలేదు. ఎవరి జాగ్రత్తలో వారుంటూ ఇరువురు పావులు కదిపారు. చివరికి ఈ రాజకీయ చదరంగంలో కేసీఆర్ నెగ్గారు.
కాంగ్రెస్ అధిష్టానం అతి తెలివికి తోడు, టీ-కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం, అతిశయం, పదవులు, టికెట్స్ కోసం కీచులాటలు, అనైక్యత అన్నీ వెరసి తెలంగాణాలో కాంగ్రెస్ కొంప ముంచింది. ఇప్పుడు ఇక చేసేపనేమీ కూడా లేదు గనుక టీ-కాంగ్రెస్ నేతలందరూ తీరికగా ఒకరినొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు.