రాయలసీమ అభివృద్దికి రాజధాని అవసరమా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో ప్రకటించడంతో ఆ అంశంపై గత మూడు నెలలుగా సాగుతున్న సస్పెన్స్ డ్రామాకు తెర పడింది. కానీ రాయలసీమ ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేఖంగా ఉద్యమబాట పట్టడం చాలా ఆందోళన కలిగిస్తోంది.   మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి గురయిన రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదు. కనుక కనీసం ఇప్పుడయినా రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే వారి కోరికకు విరుద్దంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడంతో అక్కడి ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేదన కలగడం సహజమే. అందుకే వారు ఉద్యమబాట పట్టారు. అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి వారి కష్టాలు, సమస్యలు, అవసరాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన కేవలం రాజధాని ప్రకటనతో సరిపెట్టేయకుండా దానితో బాటు రాయలసీమ సత్వర అభివృద్ధికి తన కార్యప్రణాళికను కూడా ప్రకటించారు.   అయితే ఇంతవరకు రాష్ట్రాన్ని ఏలిన రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండి ఉంటే నేడు ప్రజలలో ఈ ఆందోళన ఉండేది కాదు. కానీ రాష్ట్ర విభజనను కలలో కూడా ఊహించని కారణంగా చంద్రబాబుతో సహా ముఖ్యమంత్రులు అందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు. తత్ఫలితంగా రాయలసీమ వెనుకబడిపోయింది. అంతేకాదు రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధిని పణంగా పెట్టి మరీ కష్టపడి అభివృద్ధి చేసుకొన్న హైదరబాదును పోగొట్టుకోవలసి వచ్చింది.   రాష్ట్రవిభజన నేర్పిన ఈ గుణపాటంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో 13జిల్లాలు సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. కానీ అభివృద్ధి మళ్ళీ కేవలం కాగితాలకే పరిమితమయితే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయవలసిందే.   అందువలన ప్రభుత్వం ప్రకటించిన తన అభివృద్ధి ప్రణాళికను అమలుచేసేందుకు రాయలసీమ ప్రజలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం మంచిది. రాష్ట్ర విభజన సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు ఆడిన నాటకాలు ప్రజలందరూ స్వయంగా చూసారు. వారిని ప్రజలు కటినంగా శిక్షించారు కూడా. కనుక మళ్ళీ అటువంటి స్వార్ధ రాజకీయ నాయకులను నమ్మి ఉద్యమాలు మొదలుపెట్టడం వలన కేవలం వారు మాత్రమే రాజకీయంగా లబ్ది పొందుతారు తప్ప రాయలసీమకు మేలు జరుగదు. కనుక రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ ప్రజలు ఇప్పుడు రాజధాని కోసం పట్టుబట్టడం కంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందేవరకు కూడా తమ ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మంచి పద్దతని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం కూడా అంగీకరించింది గనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు వీలయినంత త్వరగా పనులు మొదలుపెడితే ఆ రెండు ప్రాంతాల ప్రజలలో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.  

అందుకే విజయవాడ వద్ద రాజధాని!

   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకొంటోందనే విషయాన్ని ఈరోజు శాసనసభలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నందున ఆ ప్రకటన కేవలం లాంచనమేనని భావించవచ్చును.   విజయవాడ వద్దే రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చెపుతున్న కారణాలు, అదేవిధంగా అక్కడ రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాల, రాయలసీమ ప్రజల, నిపుణుల కమిటీ అభ్యంతరాలు, సమస్యలు, అవరోధాల గురించి కూడా అందరికీ తెలుసు. కనుక ఇక వాటిపై చర్చ ఇప్పుడు అనవసరం. అయితే ఈ అంశంపై ఇంతకాలం ఈ అంశంపై మాట్లాడేందుకు వెనుకాడిన ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని ఇంత దైర్యంగా ప్రకటించాలనుకోవడానికి కారణమేమిటనే సందేహం ఎవరికయినా కలుగక మానదు. అందుకు చాలా బలమయిన కారణమే ఉంది. రాజధాని ఏర్పాటుకు ప్రధాన అవరోధంగా నిలుస్తున్న భూసమస్యకు రాష్ట్ర రెవెన్యూ శాఖ పరిష్కారం చూపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దైర్యంగా తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దం అవుతోంది.   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (వి.జి.టి.యం.) ప్రాంతాలలో అటవీశాఖకు చెందిన దాదాపు 45,000 ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. నున్న-నైనవరం-పాతపాడు ప్రాంతాలలో 13,488ఎకరాలు, ఇబ్రహీం పట్నం వద్ద 16,305 ఎకరాలు, కంచికర్ల సమీపంలో 10,500 ఎకరాలు, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలో 14,768ఎకరాల్ ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు నిర్దారించారు. అయితే వాటిలో చాలా భాగం ఆక్రమణకు గురయిందని కూడా కనుగొన్నారు. ఆ భూములను కనుక తిరిగి స్వాధీనం చేసుకోగలిగినట్లయితే, భూములు కొనుగోలుకు ప్రభుత్వం ఇక డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. బహుశః ఈ కారణంగానే ప్రభుత్వం వి.జి.టి.యం. ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుకు సిద్దమవుతోందని భావించవచ్చును. కానీ ఇది కొత్త ప్రశ్నలకు తావిస్తోంది.   రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఆక్రమణలకు గురయిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం లేదా సంబంధిత శాఖలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇన్ని వేల ఎకరాలను ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తే రాజధాని నిర్మాణం పనులు మొదలుపెట్టడం సాధ్యమేనా? రాజధానికి ముహూర్తం పెట్టేసుకొని ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తే ప్రజలు, ప్రతిపక్షాలు ఆక్షేపించారా? అనే ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏమయినప్పటికీ .జి.టి.యం. ప్రాంతంలో ఏకంగా 45,000 ఎకరాల ప్రభుత్వభూమి ఉండటం నిజమయితే అంతకంటే మంచి వార్త మరొకటి ఉండదని చెప్పవచ్చును.

దేశానికి మంచి రోజులు వస్తునట్లేనా?

    మోడీ ప్రభుత్వానికి ఆగస్ట్ 28తో వంద రోజులు పూర్తయింది. కనుక, ఆయన ప్రభుత్వ పనితీరు, పాలనపై వివిధ సంస్థలు దేశ వ్యాప్తంగా జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ప్రజలు మోడీ చాలా సమర్ధంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడితే, మరి కొందరు ప్రజలను ఆకట్టుకోనేందుకే అతిగా దూకుడు ప్రదర్శిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసారు. అదేవిధంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ప్రభుత్వంలో చలనం కనబడుతోందని కొంత మంది ప్రజలు అభిప్రాయపడగా, అది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మోడీ చేస్తున్న గారడీ మాత్రమేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేసారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం పట్ల కూడా ప్రజల నుండి ఇటువంటి మిశ్రమ స్పందనే వ్యక్తం అయింది. ఏమయినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం అంటే కేవలం నరేంద్రమోడీ మాత్రమేననే విషయంలో ప్రజలలో పెద్దగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అంటే మోడీ ప్రభుత్వంలో మిగిలిన మంత్రులందరికీ ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ, విధాన నిర్ణయాలలో వారి పాత్ర నామమాత్రమేనని ప్రజలు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది.   ఇదివరకు దేశాన్ని పాలించిన డా.మన్మోహన్ సింగ్ పరిపాలనను పూర్తిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతిలో పెట్టేసి తను పేరుకి ప్రధానిగా మిగిలిపోయి తీవ్ర అప్రతిష్ట మూట గట్టుకొంటే, నరేంద్ర మోడీ అందుకు పూర్తి భిన్నంగా మంత్రులను, చివరికి బీజేపీ పార్టీని కూడా పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొని తనే పూర్తిగా అధికారం చెలాయిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని చాలా ముందే ఊహించారు. కొందరు మోడీది నిరంకుశవాదం అని భావిస్తే, దాదాపు 125కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద దేశానికి అటువంటి సమర్దుడయిన ప్రధానమంత్రి ఉండటం చాలా అవసరమేనని మరికొందరు భావిస్తున్నారు. ఏమయినప్పటికీ, మోడీ పాలనలో దేశం సర్వతోముఖాభివృద్ధి జరిగినట్లయితే ఆయనది అతివాదమా లేక నిరంకుశవాదమా? అనే విషయం ప్రతిపక్ష పార్టీలు తప్ప ప్రజలు పట్టించుకోకపోవచ్చును.   అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ తమ పరిపాలన అద్భుతంగానే సాగుతోందని, అంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిపోతోందనే చెప్పుకొంటాయి. కనుక మోడీ ప్రభుత్వం కూడా ఆవిధంగానే చెప్పుకోవడం సహజమే. దేశంలో మొట్ట మొదటి సారిగా బుల్లెట్ రైళ్ళు ప్రవేశపెట్టాలనే ఆలోచన, గంగా నది ప్రక్షాళన, నదుల అనుసంధానం, దేశ వ్యాప్తంగా కొత్తగా ఐఐటీలు, వంద స్మార్ట్ సిటీల ఏర్పాటు వంటి ఆలోచనలన్నీ ఇదివరకెన్నడూ ప్రజలు ఊహించలేదు కనుక అవి అభివృద్ధి సంకేతాలని ప్రజలు, మోడీ ప్రభుత్వం కూడా భావించవచ్చును. కానీ మోడీ ఎన్నికల ప్రచార సమయంలో పదేపదే చెప్పినట్లు దేశానికి నిజంగానే మంచి రోజులు మొదలయ్యాయా లేదా అనేది సామాన్య ప్రజలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు దృవీకరించవలసి ఉంటుంది.   మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టి కేవలం 100 రోజులే అయినప్పటికీ, ఆయన ప్రభుత్వంలో, వివిధ వ్యవస్థలలో ఉన్న లోపాలను చక్కదిద్దేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే తక్షణమే వాటి ఫలితాలు కనబడకపోయినా, క్రమంగా పరిస్థితులలో మార్పు కనబడవచ్చునని ఆశించవచ్చును. మోడీ ప్రభుత్వం అధికారం చెప్పట్టినప్పుడు 53.4 శాతం ఉన్న జీడీపీ 53.7 శాతానికి పెరిగిందని ఆర్ధిక నిపుణులే ప్రకటించారు. అయితే కేవలం ఆ గణాంకాలతో సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కనుక బహుశః వారిని ఆకట్టుకొని ప్రసన్నం చేసుకోనేందుకే ‘ప్రధానమంత్రి ధనజన యోజన’ వంటి ప్రజాకర్షక పధకాలను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనివార్యమయి ఉండవచ్చును. కానీ గత మూడు నెలలలో రైల్వే చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల వంటి అంశాలు మాత్రమే సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి కనుక, వారిలో మోడీ పాలన పట్ల కొంత అసంతృప్తి ఉండటం సహజమే. ఒకవేళ మోడీ ప్రభుత్వం చేప్పట్టిన చర్యల వలన ధరలు కూడా అదుపులోకి వచ్చినట్లయితే, వారూ సంతోషించవచ్చును.       ఏమయినప్పటికీ గత యూపీయే పాలనతో పోలిస్తే మోడీ ప్రభుత్వం చాలా చురుకుగా, సమర్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది, కనుక మోడీ చెప్పినట్లు దేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిద్దాము. రాకపోతే కాంగ్రెస్ ఉండనే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారనున్న రాజధాని అంశం

  ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నప్పుడు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణా కమిటీ కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఇచ్చిన నివేదిక చివరికి చెత్తబుట్ట పాలయింది. పోనీ సొమ్ము పోయిన సమస్యలు పరిష్కారం అయ్యాయా అంటే అదీ లేదు. రాష్ట్రవిభజనకు ముందు, తరువాత కూడా అవే సమస్యలు తప్పడం లేదు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేసిన యూపీయే ప్రభుత్వం, రాజధాని కోసం కూడా మరో కమిటీ వేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా సమస్యను పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేదిగా ఉంది. అది మంచి సలహాలే ఇచ్చి ఉండవచ్చుగాక కానీ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మద్యనే రాజధాని నిర్మించాలని భావిస్తునందున, కోట్లు ఖర్చుపెట్టి తయారు చేసిన ఈ కమిటీ నివేదికను కూడా చెత్తబుట్టలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న ఈ విషయంపై సుదీర్గంగా చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం, తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, విజయవాడ-గుంటూరు మద్య భూసేకరణకు ఆ జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని వేయడంతో ఇది నిర్ధారణ అయింది. అంటే మళ్ళీ కోట్ల రూపాయలు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే అయిందని అర్ధమవుతోంది. అందువల్ల బహుశః ఇప్పడు కూడా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం ఆయే అవకాశాలు కనబడుతున్నాయి.   ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నివేదికను పక్కనపడేసి, విజయవాడ వద్దనే రాజధాని నిర్మించాలనే తన నిర్ణయాన్ని అమలుచేయడానికి సిద్దపడినట్లయితే, రాయలసీమలో మళ్ళీ ఆందోళనలు మొదలవడం తధ్యం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇబ్బంది పెట్టాలా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు ఇదే అదునుగా ఈ సున్నితమయిన అంశంపై కూడా రాజకీయాలు చేయకామానవు. ఏ పార్టీ అధికారం చేప్పట్టినా తనకు మంచిదనిపించిన నిర్ణయమే తీసుకోవాలనుకొంటుంది తప్ప ప్రతిపక్షాలు చేసే రాజకీయాలకు బయపడి ఏదోఒక నిర్ణయం తీసుకోబోదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో తెరాస పార్టీలు కూడా అదేపని చేస్తున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. కానీ గతంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా యూపీయే ప్రభుత్వం మొండిగా రాష్ట్ర విభజన చేసిందని ఆరోపించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితినే ఎదుర్కోనబోతున్నారు గనుక సున్నితమయిన ఈ వ్యవహారాన్ని అంతే నేర్పుగా వ్యవహరించి పరిష్కరించవలసి ఉంటుంది. లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యే ప్రమాదం ఉంది.   రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూసేకరణ కోసం ఏవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించిందో, అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, యంపీలతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని అత్యవసరంగా ఏర్పాటు చేసి రాజధాని కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరిపి వారికి పూర్తి భరోసా కల్పించగలిగినట్లయితే సమస్యలు పూర్తిగా ముదరకుండా నివారించవచ్చును. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమేమి చేయబోతోందో గట్టిగా ప్రచారం చేయడం, దానిని వీలయినంత త్వరగా కార్యరూపంలో పెట్టడం కూడా మంచి ఫలితాలు ఈయవచ్చును. అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవడమె అన్నివిధాల ఉత్తమం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఏవీ చేప్పట్టకుండా మొండిగా ముందుకు సాగినట్లయితే మళ్ళీ అవే పరిస్థితులు పునరావృతం కాక తప్పదు.   ఇదివరకు సున్నితమయిన రాష్ట్ర విభజన అంశం కేంద్రం చేతిలో ఉన్నప్పుడు దానిని సరిగ్గా పరిష్కరించలేదని చంద్రబాబు ఆరోపించేవారు. ఇప్పుడు అటువంటి సున్నితమయిన రాజధాని  అంశాన్ని ఆయనే స్వయంగా పరిష్కరించవలసి ఉంది. ఇది ఆయన సమర్ధతకు అగ్నిపరీక్ష వంటిదేనని చెప్పవచ్చును. కనుక దీనిని అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన ఏవిధంగా పరిష్కరించి చూపుతారో వేచి చూడాలి.

బాపు బొమ్మల కొలువు ముగిసింది

గీతకి, రాతకి, బొమ్మకీ, సినిమాకి నిండయిన తెలుగుదనం అద్ది, తెలుగు సంస్క్రతి సంప్రదాయాల రంగుహంగులద్ది ఒక అపురూపమయిన రూపమిచ్చిన బాపు ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం చెన్నైలో మల్హర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. బాపూ గీత, బాపు అక్షరం, బాపు బొమ్మ బాపు చిత్రం ఇలా ప్రతీదానిపై ఆయన ముద్ర స్పష్టంగా కనబడుతుంది. ఆ ముద్రలో నిండుగా కనబడే ఆహ్లాదకరమయిన తెలుగుదనం చూసి పరవశించని తెలుగు వ్యక్తి ఉండరు. బాపు గొప్పదనం గురించి వర్ణించబోవడం కొండను అద్దంలో చూపే ప్రయత్నమే అవుతుంది.   బాపు సినీ రంగంలో ప్రవేశించడం ఆయన అదృష్టం అనడం కంటే తెలుగు ప్రజల అదృష్టమని చెప్పడమే బావ్యంగా ఉంటుంది. ఆయన తొలి సినిమా ‘సాక్షి’ తాష్కంట్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడటం ఆయన అపూర్వ ప్రతిభకు తొలి గుర్తింపుగా చెప్పవచ్చును. ఆయన సృష్టించిన సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, సీతా స్వయంవరం, మనవూరి పాండవులు, గోరంత దీపం, అందాల రాముడు, వంశ వృక్షం, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం సినిమాలు ఆయనకు, అందులో పనిచేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు కల్పించాయి.   ఆయన కుంచె నుండి జాలువారిన బొమ్మలు అచ్చ తెలుగుదనానికి ప్రతిరూపాలుగా నిలిచి పోతాయి. ‘బాపు బొమ్మలా అందంగా...’ ‘అందమయిన బాపు బొమ్మలా....’ అనే చిర పరిచితమయిన వర్ణనలు బాపు బొమ్మ ప్రామాణికతను తెలియజేస్తోంది. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపింపజేసిన బాపు తను వచ్చినపని అయిపోయినట్లు తన బొమ్మల కొలువు కట్టిపెట్టేసి కానరాని లోకాలకు తరలిపోయిన తన ఆప్తమిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణను వెతుకొంటూ వెళ్ళిపోయారు.

ఏ.పీ. రాజధానిపై తుది నివేదిక-వివరాలు

  శివరామ కృష్ణన్ కమిటీ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై సమర్పించిన నివేదిక గురించి మీడియాలో వచ్చిన వార్తల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అసహనం వ్యక్తం చేసినప్పటికీ, నిన్న ఆ కమిటీ కేంద్రానికి సమర్పించిన తుది నివేదికలో ఇంచుమించు మీడియా పేర్కొన్న విషయాలే ఉండటంతో మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని స్పష్టమయింది. నిన్న ఆ కమిటీ కేంద్రానికి 187 పేజీలు గల తన తుది నివేదిక సమర్పించింది. దానిని నేడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. సెప్టెంబర్ 1న సమావేశమవుతున్న రాష్ట్ర మంత్రివర్గం ఆ నివేదికపై చర్చించి తన నిర్ణయం ప్రకటిస్తుంది.                                                         కమిటీ తన తుది నివేదికలో పేర్కొన్నవిషయాలు విజయవాడ-గుంటూరు ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఎంతమాత్రం అనువయినది కాదని స్పష్టం చేసింది. సారవంతమయిన పంట భూములపై రాజధాని నగరం నిర్మించడం ఎంత మాత్రం తగదని, దాని వలన దీర్ఘ కాలంలో ఆర్ధిక, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదీగాక ప్రస్తుతం అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నందున భూసేకరణ కూడా ప్రభుత్వానికి చాలా ఆర్ధిక భారంగా మారుతుందని, ఒక్క భూసేకరణకే రెండు నుండి మూడు సం.లు పట్టవచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం, ప్రజలు భాగస్వామ్యం (పీపీపీ)పద్దతిలో 40:60 నిష్పత్తిలో భూసేకరణ, రాజధాని అభివృద్ధి ఆలోచన కూడా మంచిది కాదని కమిటీ స్పష్టం చేసింది. అదేవిధంగా వి.జి.టి.యం. చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను కూడా కమిటీ వ్యతిరేఖించింది. దాని వలన ఆ ప్రాంతంలో ఉన్న సారవంతమయిన పంట భూములు నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.   అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల ప్రభుత్వ భవనాలు, భూమిలో రాష్ట్ర సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, మంగళగిరిలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల అధికార నివాసాలు ఏర్పాటుకు అనువయిన ప్రాంతాలని సూచించింది. అదేవిధంగా పులిచింతల, ముసునూరు, అమరావతి ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నందున అక్కడ ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవవచ్చని సూచించింది.   రాజధానిలోనే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఉండాలని ఏమీ లేదని, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలో అవ్వన్నీ వేర్వేరు జిల్లాలలో ఏర్పాటు చేసిన విషయాన్ని కమిటీ ఉదాహరణగా పేర్కొంది.   అందువల్ల విశాఖలో హైకోర్టు మరియు ఐటీ పరిశ్రమల ప్రభుత్వ కార్యాలయాలు, రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు,  ప్రకాశం జిల్లాలో వ్యవసాయ శాఖల కార్యాలయాలు, నెల్లూరులో ఆరోగ్య మరియు నీటి పారుదల శాఖ కార్యాలయాలు, కడపలో సంక్షేమ శాఖ కార్యాలయాలు, అనంతపురంలో విద్యా శాఖల కార్యాలయాలు, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలో మౌలిక వసతుల శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా, వేగంగా అభివృద్ధి చెందుతాయని కమిటీ సూచించింది.   గతంలో పరిపాలన, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు అన్నీ హైదరాబాదుకే పరిమితం చేయడం వలన వచ్చిన సమస్యలను పేర్కొని, మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జిల్లాలకు సమానంగా అభివృద్ధి వ్యాపింపజేయాలని సూచించింది.   తీవ్ర ఆర్ధికలోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రానికి వెంటనే ప్రత్యేకహోదా కూడా ఇవ్వాలని కమిటీ తన నివేదికలో గట్టిగా సిఫార్సు చేసింది.   రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేటికీ విజయవాడ-గుంటూరు మధ్యనే పూర్తి హంగులతో రాజధాని నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నట్లు మంత్రుల మాటలను బట్టి అర్ధమవుతోంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో భూసేకరణ కార్యక్రమం కూడా మొదలుపెట్టినట్లు తాజా సమాచారం.  

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయాలొద్దు

  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని ఏర్పాటుకు అవసరమయిన సూచనలు చేసేందుకు నియమింపబడిన శివరామ కృష్ణన్ కమిటీ నిన్న కేంద్ర హోం శాఖకు తన నివేదికను సమర్పించింది. కమిటీ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలు, సూచనలు:   1. వినుకొండ-మార్టూరు రాజధానికి అనువయిన ప్రాంతం. 2. విశాఖలో ఐటీ హబ్ మరియు హైకోర్టు ఏర్పాటు (అనంతపురం లేదా కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు) 3. రాయలసీమలో ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ఏర్పాటు. 4.శ్రీకాళహస్తిలో రైల్వే జోన్ ఏర్పాటు. 5. రాజధాని పరిపాలనా కేంద్రంగా ఉండాలి కనుక అక్కడే శాసనసభ, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం వగైరాలు ఏర్పాటు.5. ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసుకోవాలి. 6. స్మార్ట్ సిటీ లేదా సూపర్ సిటీ ఏర్పాటు అనవసరం. 7. రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే నాలుగు భాగాలుగా చేసుకుని పరిపాలనను, పరిశ్రమల ఏర్పాటును వికేంద్రీకరించినట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి.   అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేస్తామని చెపుతూ కమిటీ సభ్యులను ప్రభావితం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని ఈ నివేదిక నిరూపించింది.   విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం రాజధానికి ఏ మాత్రం అనువయినది కాదని, ఒకవేళ అక్కడే రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఆర్ధిక, సామాజిక, పర్యావరణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో వినుకొండ-ప్రకాశం జిల్లాలో మార్టూరు మధ్య ప్రాంతం రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువయిన ప్రాంతమని తేల్చి చెప్పింది. మొదటి నుండి విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధానిని ఏర్పాటు చేస్తామని గట్టిగా చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.   అభివృద్ధిని వికేంద్రీకరించాలనే కమిటీ సలహాపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ లేకపోయినప్పటికీ, రాజధాని విషయంలో కమిటీ సలహాపై అప్పుడే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి అనుకూల, ప్రతికూల వాదనలు, దానిపై వాడివేడి చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఇదివరకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు, తమ అభిప్రాయాన్ని బహుశః ఆయనకు అప్పుడే తెలియజేసి ఉండి ఉండవచ్చును. కానీ ఆయన ప్రజాభీష్టం మేరకే రాజధాని ఏర్పాటవుతుందని, రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి అని చెప్పడం చూస్తే బహుశః ఆయన విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నందునే ఆవిధంగా చెపుతున్నారని అనుకోవలసి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పంతానికి, ప్రతిష్టకు పోకుండా ఆలోచించినట్లయితే, నిపుణుల కమిటీ సూచించిన ప్రాంతం కూడా అన్ని విధాల అనువుగా ఉంది, ఇంచుమించు రాష్ట్రానికి మధ్యలోనే ఉంది కనుక అక్కడే రాజధాని ఏర్పాటుకు అంగీకరించినట్లయితే అనేక తీవ్ర సమస్యలను నివారించుకోవచ్చును.   ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సలహాను పెడచెవిన పెట్టి రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలోనే నిర్మించాలని సిద్దపడితే బహుశః అధికార పార్టీ నేతలందరూ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తప్పుపడుతూ విజయవాడకు అనుకూలంగా తమ వాదనలు గట్టిగా వినిపించవచ్చును. అవసరమయితే తమ వాదనకు అనుకూలంగా గట్టిగా వాదించేందుకు నిపుణులను రంగంలోకి దింపవచ్చును. అప్పుడు ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఊరుకోవు కనుక ఈ అంశంపై కూడా రాజకీయాలు మొదలుపెడితే, ఇది కూడా రాష్ట్ర విభజన అంశం లాగే వివాదాస్పదంగా మరి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. అప్పుడు కమిటీ చెపుతున్న సమస్యలే కాకుండా అనేక కొత్త సమస్యలు కూడా ప్రభుత్వం తలకు చుట్టుకోవడం ఖాయం. కనుక, ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయడం కంటే, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కమిటీ చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించడం మంచిది. ఒకవేళ దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే ప్రభుత్వమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమయిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం మంచిది. కానీ ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేసినట్లయితే ఊహించని అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఇది మరింత జటిలమయిన సమస్యగా మారే ప్రమాదం ఉంది కనుక చేతులు కాల్చుకోకుండా ముందే జాగ్రత్త పడటం మేలు. రాష్ట్ర విభజన రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితిని, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని స్వార్ధ రాజకీయ నాయకుల మాటలకు లొంగకుండా ఈ విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం.

తెలంగాణా తెదేపా నేతల భవిష్యత్?

  ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమిని గెలిపించేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా కృషిచేసారు. కానీ బలమయిన తెలంగాణా సెంటిమెంటు ముందు ఎన్డీయే కూటమి నిలవలేక ఓడిపోయింది. కానీ ఆంద్రప్రదేశ్ లో వారి కూటమి ఘన విజయం సాధించడంతో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆప్పటి నుండి ఆయన రాష్ట్ర పాలన, దాని సమస్యల పరిష్కారం, తెలంగాణా ప్రభుత్వంతో వివిధ అంశాలపై యుద్ధం చేయడంలో క్షణం తీరికలేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికలలో ఓటమితో డీలా పడిపోయిన తన పార్టీ తెలంగాణా నేతలు, కార్యకర్తలకు ఆయన దైర్యం చెపుతూ ఇకపై తాను తెలంగాణా తెదేపా శాఖపై, తెలంగాణా రాజకీయాలపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టి, అక్కడ కూడా పార్టీని మరింత పటిష్టం చేసి, వచ్చే ఎన్నికలలో పార్టీ తప్పకుండా గెలిచేలా చేస్తానని కొద్ది రోజుల క్రితం తెలిపారు. తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకే ఆయన ఇంకా హైదరాబాదును అంటిపెట్టుకొని ఉన్నారని కొందరు పార్టీ నేతలు చెపుతున్నారు. అంతే కాదు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇకపై తరచుగా తాను తెలంగాణాలో కూడా పర్యటిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారనే విషయం అందరికీ కనబడుతూనే ఉంది.   ఏ రాజకీయ నాయకుడయినా తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే కోరుకొంటాడు. కనీసం దానిపై ఎంతో కొంత స్పష్టత అయినా ఉండాలని కోరుకొంటాడు. అటువంటప్పుడు తెలంగాణా తెదేపా నేతలు కూడా ఆవిధంగానే కోరుకోవడం సహజమే. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెదేపా నేతలు, ఇప్పుడు మళ్ళీ మరో ఐదేళ్ళ వరకు వేచి చూడక తప్పడం లేదు. అయినా అప్పటి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ వైపు దృష్టి సారించలేని పరిస్థితిలో ఉండటంతో వారిలో క్రమంగా నిరాశ నిస్పృహలు కలగడం సహజమే. అయితే ప్రస్తుతం వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవారు కాని, కనీసం ఆ విషయం గురించి సానుభూతితో చర్చించేవారు కానీ లేకపోవడంతో వారు తీవ్ర అభద్రతా భావానికి గురవడం సహజమే. బహుశః ఈ పరిస్థితులే పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని అధికార తెరాస పార్టీ వైపు ఆకర్షింపబడేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఆయన ఖమ్మం జిల్లాలో మరో నేత నామా నాగేశ్వరావుతో ఏర్పడిన విభేదాల కారణంగానే పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారని చెప్పుకొంటున్నా, వాస్తవానికి తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనే భయంతోనే ఆయన తెరాస వైపు ఆకర్షితులవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అందుకు ఉదాహరణగా తెరాసలో చేరేందుకు క్యూ కడుతున్న వైకాపా నేతలను చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇక తెలంగాణాలో పోటీ చేసే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు అక్కడి పార్టీ నేతల రాజకీయ భవిష్యత్ అంతా శూన్యమే. కనుక వారు తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలో పార్టీని కాపాడుకొంటూ, ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంది.   పార్టీలో ముఖ్యమయిన తెలంగాణా నేతలు కొందరికి మోడీ మంత్రివర్గంలో పదవులు, కేంద్రం చేతిలో ఉండే కొన్ని నామినేటడ్ పదవులలో నియామకాలు చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అది చాల మంచి ఆలోచనే కానీ తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకు ఆ ప్రయత్నాలు ఏ మాత్రం సరిపోవు. చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రద్ధ తీసుకొని పార్టీ నేతలు, కార్యకర్తలకు వారి రాజకీయ భవిష్యత్తుపై నమ్మకం కలిగించే విధంగా ప్రణాళికలు, కార్యక్రమాలు తయారు చేయవలసి ఉంటుంది. వీలయినంత తరచుగా పార్టీ తెలంగాణా నేతలతో, కార్యకర్తలతో సమావేశామవుతూ, వారిని ఉత్సాహపరుస్తూ మార్గదర్శనం చేయవలసి ఉంటుంది. లేకుంటే మిగిలిన నేతలు వారి అనుచరులు కూడా తుమ్మలను అనుసరిస్తూ అధికార తెరాసవైపు నడిచే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బొగ్గు కుంభకోణాలకు నిండు నూరేళ్ళ ఆయుష్షు

  పదేళ్ళ యూపీయే అవినీతి పాలనకు అద్దం పట్టే అనేక కుంభకోణాలలో కోల్ గెట్ (బొగ్గు కుంభకోణం) కూడా ఒకటి. అయితే దీనికి 20 ఏళ్ల ఘన చరిత్ర ఉందని నిన్న సుప్రీం కోర్టు తేటతెల్లం చేసింది. అప్పటి నుండి దేశాన్ని ఏలిన అన్ని ప్రభుత్వాలకు ఈ బొగ్గు మసి అంటిందనే విషయాన్ని కూడా కోర్టు దృవీకరించింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రాణాధారమైన బొగ్గు గనుల కేటాయింపులలో 1993నుండి అవకతవకలు, నియమ నిబంధనల ఉల్లంఘనలు, అవినీతి యదేచ్చగా సాగుతోందని కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు గనుల కేటాయింపులను ఖరారు చేసే స్క్రీనింగ్ కమిటీ ఏనాడూ కూడా పారదర్శకంగా పని చేయలేదని కూడా స్పష్టం చేసింది.   ప్రభుత్వాలను రాజకీయ పార్టీలు నడిపిస్తుంటే, వాటిని రాజకీయ నాయకులు, వారిని బడా పారిశ్రామిక వేత్తలు నడిపిస్తున్నారనే విషయం ఎవరికీ తెలియనిది కాదు. కనుక ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు మధ్య ఉండాల్సిన సన్నటి గీతను రాజకీయ నాయకులు చెరిపేసిన తరువాత ప్రభుత్వాలపై బడా పారిశ్రామికవేత్తల పెత్తనం క్రమంగా పెరిగిపోయినందునే ఇటువంటి అక్రమాలు యదేచ్చగా సాగిపోతున్నాయి.   అటువంటి అక్రమార్కులను, వారికి తోడ్పడుతున్న ప్రభుత్వాలను దారిన పెట్టాల్సిన కోర్టులు కూడా ఇన్నేళ్ళుగా ఈ మసి తమకు అంటకుండా కళ్ళకు గంతలు కట్టుకొని చూసీ చూడనట్లు ఉండిపోవడానికి కారణం మన న్యాయవ్యవస్థపై కూడా చాలా రాజకీయ ఒత్తిళ్ళు ఉండటమేనని చెప్పక తప్పదు. హైకోర్టు జడ్జీల నియామకాల విషయంలో సుప్రీం కోర్టు కొలేజియం వ్యవస్థపై కూడా రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గిందని ప్రెస్ ట్రస్ట్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆరోపించడం, దానిపై స్పందించిన మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టు కొలేజియం వ్యవస్థ సమూల ప్రక్షాళనకు రెండు కొత్త చట్టాలను పార్లమెంటు చేత ఆమోదింపజేయడం మన న్యాయవ్యవస్థలో లోపాలను కళ్ళకు కట్టి చూపుతోంది. కానీ యావత్ దేశ ప్రజలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుప్రీం కోర్టే చొరవ తీసుకొని పూనుకోవడంతో ఈ అవినీతి గనుల వ్యవహారం బయటపడింది.   సుప్రీం కోర్టు ఈ బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టి తన పని అయిపోయినట్లు చేతులు దులుపుకోకుండా, 1993 నుండి వివిధ పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు ఇంతవరకు జరిగిన ప్రతీ అక్రమ కేటాయింపులను క్షుణ్ణంగా పరిశీలించి, వారి వలన దేశానికి జరిగిన నష్టం కనుగొనేందుకు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కూడిన ఒక విచారణ కమిటీని నియమించాలని భావిస్తోంది.   బొగ్గు గనుల కేటాయింపులో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా సుప్రీం కోర్టే దృవీకరించింది. కనుక ఇక ఆ అవినీతికి పాల్పడిన వారందరిపై కటిన చర్యలు తప్పవని, వారు గనుల నుండి బొక్కేసిన దేశ సంపదను అణాపైసలతో సహా కక్కించబడుతుందని ఎవరయినా అనుకొంటే అది అమాయకత్వమే అవుతుంది. ఇటువంటి అవినీతి భాగోతాలను ఏ విధంగా అటకెక్కించాలో ప్రభుత్వాలను నడుపుతున్న మన రాజకీయ నాయకులకు, వారిని వెనక నుండి నడిపించే బడా బాబులకు బాగా తెలుసు. పశువుల దాణా కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఓబులాపురం గనులను అక్రమంగా త్రవ్వుకొన్న యెడ్యూరప్ప, బళ్ళారి గనుల అక్రమార్కుడు గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారు అనేకమంది సంకీర్ణ ప్రభుత్వాల పుణ్యామాని ఎటువంటి శిక్ష అనుభవించకుండా, ఎటువంటి నష్ట పరిహారం చెల్లించకుండా, నేడు హాయిగా వ్యాపారాలు చేసుకొంటూ మళ్ళీ రాజకీయాలలో కూడా చక్రం తిప్పడం చూస్తుంటే, ఈ వ్యవహారం కూడా ఇలాగే కొన్నేళ్ళు సాగి చివరికి ఈ కేసులు కూడా కూడా ఇతర కేసుల లాగే ఏదోరోజున అటకెక్కడమో లేక ఏదోరోజు నిందితులు చనిపోయాక వారిపై కేసులు మూసివేయడమో జరిగే అవకాశం ఉంది. అందువలన ఈ బొగ్గు కుంభకోణానికి కూడా ఇతర కుంభకోణాలలగే నిండు నూరేళ్ళ ఆయుష్షు అని దీవించక తప్పదు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేబోతున్న డిగ్గీ రాజావారు

  ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ చేతికి అప్పగించేసిన ఘనుడు దిగ్విజయ్ సింగ్. స్వంత రాష్ట్రమయిన మధ్యప్రదేశ్ లో పార్టీకి మంగళం పాడేసిన తరువాత, ఆయనకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు అప్పగించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా చేయలేని రాష్ట్ర విభజన పనిని ఆయన బాధ్యతలు చేప్పట్టిన మూడు నెలలలోనే చకచకా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసారు. ఆ కారణంగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. తెలుగుదేశం, తెరాస పార్టీలకు అధికారం బదలాయింపు కూడా చాలా సాఫీగా జరిగిపోయింది. ఆ విధంగా తనకు అప్పజెప్పిన పనిని చాలా దిగ్విజయంగా ముగించుకొని తన పేరును సార్ధకం చేసుకొన్నారు దిగ్విజయ్ సింగువారు.   ఆనాటి నుండి మళ్ళీ ఇంతవరకు రెండు రాష్ట్రాల గడపలు తొక్కని ఆయన, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉండటం చూసి, దానికి పునర్వైభవం సాధించే పనిలో హైదరాబాద్ తరలి వచ్చారు. నిన్న శేరిగూడలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన తెలంగాణా కాంగ్రెస్ మేధోమధనం సదస్సులో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన కారణంగానే పార్టీ రెండు చోట్ల ఘోరంగా దెబ్బతిందనే నిజాన్ని మరోమారు అందరికీ గుర్తుచేశారు.   రాష్ట్ర విభజనకు అంగీకరించిన రాష్ట్ర రాజకీయ పార్టీలు తమకు హ్యాండివ్వడం వలననే ఆంద్రాలో ఓడిపోయామని, కానీ ఎంతో సాహసించి తెలంగాణా ఇచ్చినప్పటికీ తెలంగాణా లో కూడా ఓడిపోయామని బాధపడ్డారు. ఇంత హడావుడిగా రాష్ట్రవిభజన చేయవద్దని, చేసినట్లయితే పార్టీ రెండు రాష్ట్రాలలో భూస్థాపితం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు చాలా గట్టిగా చెప్పినపుడు దిగ్గీ రాజావారు బోసి నవ్వులు, ముసిముసి నవ్వులు నవ్వారు. కానీ ఇపుడు ఆయన చెప్పినట్లే అంతా జరిగిందని అంగీకరించక తప్పలేదు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు కృషి చేస్తే, రాష్ట్రవిభజన చేసి కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాలలో దుంప నాశనం చేసిన ఘనుడు దిగ్విజయ్ సింగ్.   జరిగిందేదో జరిగిపోయింది కనుక ఇక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసి, పార్టీకి పునర్వైభవం సాధించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కానీ ఆయన ప్రవచనాలు పూర్తికాక ముందే పార్టీ కార్యకర్తలు కొందరు సభలో నినాదాలు చేయడం విశేషం. వారినందరినీ తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం మరో గొప్ప విశేషం. మెదక్ ఉప ఎన్నికలో ఒంటరిగా పోటీ చేద్దామని, త్వరలో జరుగబోయే జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు కూడా అందరూ సిద్దం కావాలని ఆయన కోరారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే దానిని మళ్ళీ గెలిపించలేకపోయిన ఆయన, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ముందు గట్టిగా నిలబడలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం గురించి మాట్లాడే ముందు, పార్టీని, దాని పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోకుండా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పదవి నుండి తప్పించి ఆ కుర్చీలో కూర్చొనేందుకు కుమ్ములాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలను దారిన పెట్టగలిగితే బాగుంటుందేమో?

మెగాస్టార్ ఇంటర్వ్యూ: మనస్సాక్షికీ దట్టంగా మేకప్!!

 సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, తనకున్న ప్రజాధారణతో ముఖ్యమంత్రి అవుదామనే కోరికతో మేకప్ తుడుచేసుకొని రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ ఆయనకు ఆశాభంగం అయింది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా దానిని కాంగ్రెస్ చేతిలో పెట్టడం వలన కేంద్రమంత్రి అవగలిగారు. కానీ రాష్ట్ర విభజన కారణంగా అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఆయనకు రాజకీయాలలో మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చును. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ, సినీ, కుటుంబ జీవిత విషయాల గురించి మాట్లాడారు.   ప్రజలు, అభిమానులు, తోటి కళాకారులు ఒత్తిడి మేరకు తను మళ్ళీ సినీ రంగంలో అడుగుపెడుతున్నాని, తన 150వ సినిమా త్వరలోనే ప్రారంభిస్తానని తెలిపారు. అయితే నిజానికి ఆయన రాజకీయ భవిష్యత్ అంతా అందకారంగా కనిపిస్తుండటంతోనే, కాంగ్రెస్ కండువాను తీసి పక్కనబెట్టి, మళ్ళీ మొహానికి రంగులు వేసుకొనేందుకు తయారవుతున్నారని అందరికీ తెలుసు.   ఆయన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించేందుకు పార్టీ ఎన్నికల ప్రచార రధసారధిగా భాద్యతలు స్వీకరించినపుడు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తుడిచి పెట్టేసేందుకు జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడు చిరంజీవి తమ అభిమానులను జనసేన వైపు వెళ్ళకుండా కట్టడిచేసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అంతేకాక తన మరో సోదరుడు నాగబాబు, మరియు కొడుకు రామ్ చరణ్ తేజ్ ల ద్వారా మెగాభిమానులను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీ పెట్టడాన్ని తను ఎన్నడూ వ్యతిరేఖించలేదని, చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.   ఆయన ఎన్నికల ప్రచారంలో “కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టడం ప్రపంచంలో ఏ శక్తి వల్లా కాదని, కాంగ్రెస్ పార్టీని డ్డీకొన్నవారే కాలగర్భంలో కలిపోతారని ” దృడంగా చెప్పారు. ప్రజలపై తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంతమాత్రమేనని దానివల్ల కాంగ్రెస్ కి వచ్చే నష్టమూ ఏమీ లేదని కూడా మరీ వాదించారు. చివరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా తరువాత కూడా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందని అంగీకరించలేదు. కానీ ఆయన నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ప్రజాధారణ ఉందని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక బలమయిన కారణమేనని అంగీకరించారు.   తను గెలిపించాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీని తమ్ముడు రాష్ట్రం నుండే కాక దేశం నుండి కూడా సమూలంగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తుంటే, తమ్ముడు జనసేన పార్టీని పెట్టడం తనకు వ్యతిరేఖంగా కాక మద్దతుగానే పెట్టినట్లు భావిస్తున్నానని చెప్పడం మరో పెద్ద జోక్.   కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలుగుతునంత కాలం ఎన్నడూ తమ్ముడు ప్రస్తావన చేయని చిరంజీవి, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన తరువాత తమ రక్త సంబంధాన్ని వేరు చేసే శక్తి రాజకీయాలకు లేవని చెప్పుకోవడం హాస్యాస్పదం. తను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిలా సేవలు చేస్తే, తమ్ముడు తన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ పెట్టుకొంటుంటే దానిని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి, ఇప్పుడు తాను ఎన్నడూ వ్యతిరేఖించలేదని, తమ దారులు వేరయినా ఇద్దరి ఆశయం ప్రజలకు సేవ చేయడమేనని చిరంజీవి చెప్పడం చూస్తే ఆ అన్నదమ్ముల వ్యక్తిత్వాలలో, మనస్తత్వాలలో ఎంత వైరుద్యం ఉందో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.   చిరంజీవి కేవలం ముఖ్యమంత్రి అవుదామనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలలోకి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రజల తరపున పోరాడేందుకు మాత్రమే వచ్చానని చెప్పడమే కాక, ప్రజాభిప్రాయలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చాలా శ్రమించారు.   రాష్ట్ర విభజన తరువాత అత్యంత దయనీయంగా మారిన రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దేందుకు రాజ్యసభ సభ్యుడిగా యధాశాక్తిన కృషిచేయవలసిన చిరంజీవి, తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడుతుండటంతో మళ్ళీ సినిమాలలో నటించేందుకు సిద్దమయిపోవడం చూస్తే, రాష్ట్రం పట్ల, అందులో ప్రజల పట్ల ఆయన నిబద్దత ఎటువంటిదో అర్ధమవుతుంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన జైరామ్ రమేష్, మన రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపిక అయినందున, ఆయన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంతో పోరాడుతుంటే, మన రాష్ట్రానికి చెందిన చిరంజీవి సినిమాలలో నటించేందుకు సిద్దమయిపోవడం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ కూడారాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నప్పటికీ, ఆయన ఏనాడూ అన్నలాగా ఏ పదవులు ఆశించలేదు. అనుభవించడంలేదు. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి తన పూర్తి సమయాన్ని ప్రజాసమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించకుండా రాజకీయాలలో చేరిన తరువాత మసకబారిన తన పేరు ప్రతిష్టలను పునరుద్దరించుకోవడానికి మళ్ళీ సినిమాలలో నటించడానికి సిద్దమవుతున్నారు. నిబద్దత లేని ఇటువంటి పార్ట్ టైం రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటే మాత్రం ఏమి లాభం? ఏమయినప్పటికీ చిరంజీవి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో సగటు రాజకీయ నాయకుడిలాగే మాట్లాడారు. కానీ అది ఆయన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపించినట్లుంది.

పవన్ కళ్యాణ్ కి అమిత్ షా చేసిన ప్రతిపాదన ఏమిటో?

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి వచ్చిన తరువాత అమిత్ షా తనకు ఒక ప్రతిపాదన చేసారని అని చెప్పారు. కానీ ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనన్నారు. సహజంగానే ఆ ప్రతిపాదన ఏమిటనే ఆలోచన అందరికీ కలుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చినందున, ఇకపై కూడా రెండు పార్టీలు రెండు రాష్ట్రాలలో కలిసి పనిచేయాలని అనుకోవచ్చు. కానీ బీజేపీ వంటి జాతీయ పార్టీ, ఇంకా పార్టీ నిర్మాణం కూడా జరగని జనసేనతో కలిసిపనిచేయాలని తహతహలాడుతోందని ఎవరూ భావించరు. బీజేపీకి ఆంధ్రాలో బలం లేకపోవచ్చును కానీ తెలంగాణాలో మాత్రం ఎంతో కొంత బలం ఉంది. అందుకే అక్కడ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని అమిత్ షా కోరుకొంటున్నారు. తెరాస, తెదేపా, బీజేపీలు బలంగా ఉన్నతెలంగాణాలో జనసేన పార్టీ నిలద్రోక్కుకోవడం కష్టమే. అక్కడి ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తక్కువే. అందువలన తెలంగాణాలో జనసేనతో చేతులు కలిపినంత మాత్రాన్న బీజేపీకి పెద్దగ ఒరిగేదీమే ఉండబోదని అర్ధమవుతోంది.   ఇక ఆంధ్రాలో బీజేపీ అంత బలంగా లేదు. పవన్ కళ్యాణ్ కి అక్కడ ప్రజలలో మంచి ఆదరణ ఉన్నప్పటికీ, ఆయన పార్టీని నిర్మాణం చేసుకొని వచ్చే ఎన్నికలలోగా తన శక్తిని నిరూపించుకోవలసి ఉంటుంది. ఇంత చేసినా, జనసేన పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు కేవలం ప్రశ్నించడం కోసమేనని పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నపుడు, అధికారం, పదవులపై ఆశలున్న రాజకీయ నేతలు ఎవరూ కూడా ఆ పార్టీలో చేరే ఆలోచన చేయబోరని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకవేళ జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలబెట్టినా వారు ఇప్పటిలాగే ఏదో ఒక పార్టీకి అనుబంధ పార్టీగా మద్దతు ఇచ్చేందుకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. చిరంజీవి తను ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక ఆశయంతో ప్రజారాజ్యం పెట్టినా భంగపడక తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ తనకు అధికారమే వద్దంటూ పార్టీ పెడితే, ఇక దానిని ప్రజలు, రాజకీయ నేతలు ఆదరిస్తారని గ్యారంటీ లేదు.   ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అవి పూర్తయ్యేలోగా చాలా చేదు నిజాలు, అనుభవాలు చూసారు. ఇక అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకొని మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయడానికి సిద్దమవడం కూడా పవన్ చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమో, వేరే పార్టీని అధికారంలోకి తేవడం కోసమో అయితే పవన్ కళ్యాణ్ తన ఉజ్వలమయిన సినీ జీవితాన్ని పణంగా పెట్టి మరీ జనసేన పార్టీని స్థాపించి దానిని ప్రయాసపడి నిర్వహించడం కూడా అనవసరమే. అంతకంటే ఆయన బీజేపీలో చేరడమే ఉత్తమం. తద్వారా ఆయన తన సినీ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తూనే బీజేపీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చును. బహుశః అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ కు ఇదే ప్రతిపాదన చేసి ఉండవచ్చునేమో?

భ్రమల్లో జీవిస్తూ...భ్రమల్లో పార్టీని నడిపిస్తున్న సోనియా

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధి తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై కర్రపెత్తనం చేస్తూ దేశంలో అన్ని వ్యవస్థలను, స్వంత పార్టీని కూడా భ్రష్టు పట్టించారు. కనీసం లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితి కలిగినందుకు ఆమె బాధపడ్డారో లేదో తెలియదు. కానీ చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీ తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు ఆమె భరోసా ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. అధికారంలో చేతిలో ఉన్నపుడే పార్టీని తిరిగి గెలిపించుకోలేని ఆమె, కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దుస్థితిలో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో పార్టీని ఏవిధంగా గెలిపించగలనని భావిస్తున్నారో ఆమెకే తెలియాలి.   మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికలలో గెలిచారని, గెలిచిన తరువాత ఏమి చేయాలో పాలుపోక దేశ ప్రజలను ఇంకా మభ్య పెడుతూనే ఉన్నారని ఆరోపించారు. ఆయన యూపీఏ పధకాలను, కార్యక్రమాలను అన్నిటినీ కాపీ కొడుతూ అవి తన స్వంత పధకాలుగా చెప్పుకొంటున్నారని ఆమె ఎద్దేవా చేసారు.   ఆమె చేసిన ఈ రెండు ఆరోపణలను నిశితంగా పరిశీలించినట్లయితే, ఆమెకు దేశ ప్రజల విజ్ఞతపట్ల వారెన్నుకొన్న ప్రభుత్వం పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్ధమవుతుంది. ప్రజలకు మంచి చెడ్డా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలూ లేవని, ఎవరు మాయమాటలు చెపితే వారిని గుడ్డిగా నమ్మేసి ఓటేసేస్తారని ఆమె భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక మోడీ ప్రభుత్వం పనిచేయకుండా ప్రజలకు రంగుల కలలు చూపిస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. కానీ అదే సమయంలో యూపీఏ పధకాలను, కార్యక్రమాలను ఎన్డీయే స్టాంపు వేసుకొని అమలు చేస్తోందని ఆమే స్వయంగా దృవీకరిస్తున్నారు. కాంగ్రెస్ పాలన నచ్చకనే ప్రజలు ప్రజలు ఆ పార్టీని ఇంటికి సాగనంపారు. అటువంటప్పుడు మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ చేసిన పొరపాట్లనే ఎందుకు అమలుచేస్తుంది? అని ఆలోచిస్తే ఆమె వాదనలో పసలేదని అర్ధమవుతుంది.   మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నాటి నుండి అన్ని వ్యవస్థలలో సమూలంగా మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తుండటం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. బ్రిటిష్ కాలంనాటి ప్రణాళికా సంఘాన్ని, ఆర్.టీ.ఓ. వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానంలో వర్తమాన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతోంది. గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా అనుసరిస్తున్న విదేశాంగ విధానాలను కూడా మోడీ ప్రభుత్వం పక్కనబెట్టి, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగేలా సరికొత్త విధానాలను క్రమంగా అమలులోకి తెస్తోంది. ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టే సమయంలో పాకిస్తాన్ కు స్నేహ హస్తం అందించిన నరేంద్ర మోడీ, ఆ తరువాత పాకిస్తాన్ హద్దులు మీరడంతో ఆ దేశానికి ఘాటయిన హెచ్చరికలు జారీ చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.   ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వం చాలా దృడమయిన, కటినమయిన నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగయిదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నిద్రావస్తలో జోగుతున్న ప్రభుత్వ వ్యవస్థలు, మోడీ అధికారం చెప్పట్టాక పనిచేయడం మొదలుపెట్టాయి. కానీ సోనియాగాంధీ మాత్రం ఇవేమీ గమనించనట్లు వచ్చే ఎన్నికలలో తాము గెలుస్తామనే భ్రమలలోనే జీవిస్తూ, తమ పార్టీ నేతలని, కార్యకర్తలనీ కూడా అదే భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిధంగా భ్రమల్లో జీవించడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆనందం కలుగుతోందంటే ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది? ఈ ఐదేళ్ళ కాలంలో మోడీ దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఈ భ్రమలలోనే జీవించడం అలవాటు చేసుకోవలసి ఉంటుందేమో?

సర్వే సమగ్రంగానే జరిగిందనుకోవచ్చా?

  తెలంగాణా ప్రభుత్వం నిన్న నిర్వహించిన సర్వే పట్ల ప్రజలు చాలా సానుకూలంగా స్పందించిన మాట వాస్తవం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా సంతోషించారు. ప్రజల సహకారంతో సర్వే విజయవంతం అయిందని ఆయన ప్రకటించారు కూడా. కానీ హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు సర్వే అధికారులు రాలేదని, వచ్చినా పూర్తి వివరాలు నమోదు చేసుకోకుండా ‘మమ’ అనిపించేసారని పిర్యాదులు వినబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఈ సర్వేలో నమోదు చేయించుకొంటే, ప్రభుత్వం నుండి తమకు ఏదో ఒకవిధంగా సహాయం లభిస్తుందనే ఆశతో పనులకు వెళ్ళకుండా రోజంతా సర్వే అధికారుల కోసం పడిగాపులు కాసినా ఫలితం లేకుండాపోయింది. రాజధాని నగరంలో నిరుపేదలు నివాసముండే అడ్డగుట్ట, రసూల్ పుర, బోలక్ పూర్, బంజారా బస్తీ, బీ.జే.ఆర్. నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలకు సర్వే అధికారులు రాకపోవడంతో, అక్కడి ప్రజలు తమ గోడు ఎవరితో మొర పెట్టుకొవాలో తెలియని పరిస్థితి.   ఇక మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే సైనిక్ పురి, రామంతాపూర్, ఉప్పల్, హిమాయత్ నగర్, హైదర్ గూడ, యల్.బీ. నగర్, మల్కజ్ గిరి, శేరిలింగంపల్లి, మెట్టుగూడ, కుకట్ పల్లి, బోయిన్ పల్లి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి.   ఇక ఈ సర్వే కోసం రాష్ట్రా వ్యాప్తంగా శలవు ప్రకటించడంతో ఆర్.టీ.సీ. బస్సులు, ఆటోలు, మినీ వ్యానులు కూడా తిరగకపోవడంతో, అత్యవసర పనుల మీద నగరానికి వచ్చిన వారు, తీవ్ర అనారోగ్యానికి గురయి ఆసుపత్రులకు వెళ్ళవలసిన వారు, విదేశాలతో నిత్యం లావాదేవీలు జరిపే బీపీఓ సంస్థల ఉద్యోగులు నానా ఇక్కట్లు పడ్డారు. కరీంనగర్ జిల్లా మాదవ్ పూర్ మండలానికి చెందిన వెంకటేష్ దంపతులు, నిన్న సర్వే కారణంగా నగరంలో బస్సులు, ఆటోలు తిరగక పోవడంతో నీలోఫర్ ఆసుపత్రిలో మరణించిన తమ చిన్నారి పసిపాప శవాన్ని ఒళ్ళో పెట్టుకొని, అంత బాధలోనూ రోజంతా ఆసుపత్రి గేటు వద్దే కూర్చోక తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఎవరికీ తెలియదు.   ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ “ఇంతవరకు హైదరాబాదులో కేవలం 15.12 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయనే భ్రమలో ఉన్నాము. కానీ ఈ సర్వే తరువాత 20 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తెలుసుకోగలిగాము,” అని అన్నారు. అయితే సర్వే అధికారులు చాలా ప్రాంతాలకు వెళ్లనందున కేసీఆర్ చెపుతున్నదాని కంటే ఇంకా చాలా ఎక్కువ కుటుంబాలే హైదరాబాదులో నివసిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.   ఈ సమగ్ర సర్వే ద్వారా తెలంగాణాలో నివసిస్తున్న ప్రజలందరి వివరాలు పూర్తిగా సేకరించాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇంత భారీ సర్వే నిర్వహించడానికి ముందు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు, కసరత్తు చేయకపోవడం వలన అది ఆశించిన ఫలితం పూర్తిగా దక్కలేదనే చెప్పవచ్చును. కానీ లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ప్రభుత్వం ఒక్కరోజులోనే సర్వే నిర్వహించడం వలన దాని ప్రయోజనం పూర్తిగా నెరవేరలేదు.   కానీ దీనివలన వాస్తవానికి-ప్రభుత్వ లెక్కలకీ మధ్య చాలా తేడా ఉందనే సంగతి మాత్రం ప్రభుత్వానికి అర్ధమయింది. కనుక ఇకపై తదనుగుణంగా ప్రణాళికలు రచించుకోగలదు. కానీ అంతకంటే ముందు ప్రభుత్వం మరోమారు తన లెక్కలను సరి చూసుకోవలసి ఉంటుంది.

ఖాళీ ఖజానాతో లక్ష కోట్ల బడ్జెట్ సాధ్యమేనా?

  ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సుమారు రూ. 1.10 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదని చెపుతున్నపుడు, మరి ఇంత భారీ బడ్జెటు రూపొందించడమేమిటనే ధర్మసందేహం చాలా మందికి కలగవచ్చును. నిజమే! ఖజానా కాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వివిధ పద్దుల క్రింద వివిధ పనులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్లు కేటాయింపులు ఏవిధంగా చేస్తుందనే సందేహం కలగవచ్చును.   ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెటుకు సరిపడేంత ఆదాయం వస్తుందనే అంచనాలు, నమ్మకం ప్రభుత్వానికి ఉన్నందునే అంత భారీ బడ్జెట్ ప్రకటించడానికి సాహసించేలా చేసాయని చెప్పవచ్చును. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర పరిస్థితి ఏమిటని అందరూ చాలా ఆందోళన చెందినప్పటికీ, పరిస్థితులు ఊహించినంత దారుణంగా మాత్రం లేకపోవడం ఆంద్రప్రదేశ్ ప్రజల అదృష్టం.   ఇన్నేళ్ళుగా హైదరాబాద్ ప్రధానకేంద్రంగా చేసుకొని వ్యాపారలావాదేవీలు నిర్వహించిన అనేక వ్యాపార సంస్థలు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తరలివచ్చి, రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖకే తమ వ్యాపారలావదేవీలపై పన్నులు చెల్లిస్తుండటంతో, విభజన తరువాత 13 జిల్లాల్లో ఆ శాఖ ఆదాయం సుమారు రూ.40వేల కోట్లు పైబడే ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు అంచనావేశారు.   ఇక వాణిజ్యపన్నుల తరువాత, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు సమకూర్చేవి ఎక్సైజ్‌, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖలే. ప్రభుత్వ విధానాలు ఏవిధంగా ఉన్నప్పటికీ, నిత్యం బంగారు గుడ్లు పెట్టే బాతుల వంటివి ఈ రెండు శాఖలు. ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ మధ్యప్రియులు మందు ముట్టకుండా ఉండలేరు. అలాగే ఇళ్ళు, స్థలాల క్రయ విక్రయాలు ఎన్నడూ ఆగేవీ కావు. కనుక ఈ రెండు శాఖల నుండి నిత్యం డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడుతూనే ఉంటుంది. ఎక్సైజ్‌ శాఖ నుండి కనీసం రూ.10వేల కోట్లు, రిజిస్ర్టేషన్ల శాఖ నుండి మరో రూ.10-15,000 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.   రాష్ట్ర రాజధాని నిర్మాణం, వివిధ జిల్లాలు, నగరాలు, పట్టణాలలో పరిశ్రమలు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది గనుక ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో భూముల ధరలు భారీగా పెరగవచ్చును. ఇది సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా కష్టం కలిగిస్తున్నప్పటికీ, దాని వలన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది.   అదేవిధంగా ఇకపై రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది గనుక కొత్తగా అనేక వ్యాపార సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది గనుక వాటి ద్వారా కూడా ప్రభుత్వానికి భారీ ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రవాణా వంటి అనేక ఇతర శాఖల నుండి కూడా ప్రభుత్వానికి ఆదాయం బాగానే ఉంటుంది. ఈ అంచానాల ఆధారంగానే ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్ రూపొందించే సాహసం చేస్తోందని భావించవచ్చును.   షరా మామూలుగానే దానిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించవచ్చు గాక. కానీ ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇటువంటి భారీ బడ్జెటును ప్రవేశపెట్టడం మున్ముందు పరిస్థితులు చాలా ఆశాజనకంగా ఉంటాయని చాటి చెపుతున్నట్లుంది. ఇది చాలా మంచి పరిణామమని చెప్పక తప్పదు. ఎందువలన అంటే లోటు బడ్జెటును చూపిస్తూ ప్రభుత్వం చేతులెత్తేయకుండా, పూర్తి సానుకూల దృక్పధంతో, భవిష్యత్ పట్ల రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చాలా దైర్యంగా భారీ బడ్జెటును ప్రవేశపెడుతోంది. అది చాలా అభినందనీయం. అయితే ప్రభుత్వం దానిని అంతే ఆత్మవిశ్వాసంతో, నిబద్దతతో ఆచరణలో పెట్టి చూపినప్పుడే దానికి విలువ ఉంటుంది.

‘సర్వే’ జనాః సుఖినోభవంతు

  ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా సర్వే జరుగబోతోంది. దానిపై ప్రజలలో, రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఈ సర్వేతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సర్వే కేవలం బోగస్ లబ్దిదారులను ఏరివేసి, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను చేరవేయడానికేనని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా చెపుతున్నప్పటికీ, తెదేపా నేత రేవంత్ రెడ్డి బయటపెట్టిన కేసీఆర్ ఇటీవల అధికారుల సమావేశంలో మాట్లాడిన ఒక సంభాషణల ఆడియో టేపు ఆంధ్రప్రజలలో కలకలం సృష్టిస్తోంది. వారిలో మరింత అభద్రతాభావం కలిగిస్తోంది.   తెలంగాణా ప్రజలకు మేలు చేయడానికి నిర్వహిస్తున్న ఈ సర్వే పట్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ దానిలో స్థానికత అంశం గురించి ఉన్న ప్రశ్నలు తమనే లక్ష్యంగా చేసుకొన్నవని ఆంద్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈరోజు కాకపోతే రేపయినా ఈ సర్వే కారణంగా తాము ఏదో రూపంగా వివక్ష ఎదుర్కోక తప్పదని, తెలంగాణాలో స్థిరపడినందుకు గాను భారీ మూల్యం చెల్లించకతప్పదని వారు గట్టిగా నమ్ముతున్నందునే వారు ఈ సర్వేపట్ల విముఖత చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఆంధ్రా నుండి వచ్చి తెలంగాణాలో పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు వగైరా నెలకొల్పినవారు, ప్రైవేట్ సంస్థలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ఉన్నత వర్గాల వారు తాము ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులు, వృధాప్య పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు వంటివేవీ కోరకపోయినా తమపై బలవంతంగా ఈ సర్వేను ఎందుకు రుద్దుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ సర్వే భవిష్యత్తులో తమపై, తమ సంస్థలపై ప్రభావం చూపబోతోందనే ఆందోళన ఉన్నత వర్గాలలో సైతం వ్యక్తం అవుతున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణా ప్రభుత్వం మీడియా ద్వారా వారి సందేహాలను తీర్చేందుకు చాలా కృషి చేసినా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తమపట్ల ప్రదర్శిస్తున్న విద్వేష వైఖరి కారణంగా ఆంద్ర ప్రజలలో ఆయన సర్వే గురించి చెపుతున్న మాటలను నమ్మడం లేదు. అందువలన ఈ సర్వేపై వారిలో అనుమానాలు పోలేదు.   కానీ వారి వాదనలను, భయాలను, అనుమానాలను అర్ధం లేనివని కొట్టిపారేస్తున్నారు తెలంగాణాకు చెందిన రాజకీయ నేతలు, విశ్లేషకులు. తెలంగాణా ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను అనుభవిస్తూ, వాటిని అందిస్తున్న ప్రభుత్వానికి సహకరించబోమని చెప్పడం ఏవిధంగా సమర్ధనీయమని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడినప్పటికీ వారందరూ నేటికీ తాము తెలంగాణాకు చెందినవారముకామనే భావన వారిలో ఉన్నందునే ఈ సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచి ఆలోచన కాదని, అందువల్ల తెలంగాణాలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు జరిగే సర్వేలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణాకు చెందిన రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. అప్పుడే ప్రభుత్వం కూడా ప్రజావసరాలకు, వారి సామాజిక స్థితిగతులకు అనువయిన ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించగలదని సూచిస్తున్నారు.   ఇక తెలంగాణా ప్రజలు, రాజకీయ నేతలు ఈ సర్వేను పూర్తిగా సమర్ధిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన అనేక హామీలను, సంక్షేమ పధకాలను ఒకటొకటిగా అమలుచేస్తుండటంతో, వారికి ప్రభుత్వంపై దానిని నడిపిస్తున్న కేసీఆర్ పై క్రమంగా నమ్మకం ఏర్పడుతోంది. ఈ సర్వేలో తమ పేరు నమోదు చేయించుకొనగలిగితే ప్రభుత్వం నుండి ఏదో ఒక రూపంలో తమకు లబ్ది చేకూరుతుందని వారు దృడంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ప్రకటించిన ఈ సర్వేలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తెలంగాణా ప్రజలు స్వస్థలాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.   ఈ విధంగా చివరికి సర్వేపై కూడా పూర్తి విరుద్దమయిన ఆలోచనలు, అభిప్రాయలు అందరిలో నెలకొని ఉన్నాయి. అందువల్ల ఈ సర్వేలో ఎంతమంది పాల్గొంటారు? ఈ సర్వే విజయవంతం అవుతుందా లేదా? అయితే అది ఆంద్ర, తెలంగాణా ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపబోతోంది? దీనివలన ఎవరు లబ్ది పొందబోతున్నారు? ఎవరు నష్టపోబోతున్నారు? వంటి ధర్మ సందేహాలన్నిటికీ త్వరలోనే జవాబులు దొరకవచ్చును.

ముఖ్యమంత్రుల సమావేశం ఉభయ రాష్ట్రాలకు శుభపరిణామం

  ఆంధ్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడక ముందు నుండే వాటి మధ్య మొదలయిన యుద్ధం, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కూడా కొనసాగుతూనే ఉంది. ఎంతో బాధ్యాతాయుతంగా మెలగవలసిన ప్రభుత్వాలు నిత్యం ప్రతీ చిన్న అంశంపై అతిగా స్పందిస్తూ ఘర్షణపడటాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఇక ఈ పరిస్థితిలో ఎన్నటికీ మార్పు రాబోదని అందరూ నిరాశ చెందుతున్న వేళ, గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యేలా చేయగలిగారు. ఆయన ప్రతిపాదనకు వారిరువురూ అంగీకరించడం, నిన్న సమావేశం అవడం ఒక మంచి పరిణామమని చెప్పవచ్చును.   అయితే మొదటి సమావేశంలోనే ఏవో అద్భుతం జరిగి, సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఆశించడం అత్యాసే అవుతుంది. కానీ ఇంతవరకు పరస్పరం కత్తులు దూసుకొంటున్న ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు తొలిసారిగా సమావేశమవడం, ఇరువురూ కూడా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనేందుకు సిద్దపడటం రెండు రాష్ట్రాలకు కూడా శుభపరిణామమేనని చెప్పవచ్చును. ఒకరిపై మరొకరు పిర్యాదులు చేసుకొంటూ కేంద్రం వద్ద, సుప్రీంకోర్టులో పంచాయితీలు పెట్టుకోకుండా, రాష్ట్ర స్థాయిలోనే వాటి పరిష్కారానికి ప్రయత్నిద్దామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా హర్షణీయం.   ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, నీరు, విద్యుత్ వంటి పంపకాలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకొని పరిష్కరించుకొందామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా తెలివయిన నిర్ణయం. ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, నీరు, విద్యుత్ వంటి పంపకాలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకొని పరిష్కరించుకొందామని ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించడం చాలా తెలివయిన నిర్ణయం. సానుకూల దిశలో పడిన తొలి అడుగు అని చెప్పవచ్చును. నిజానికి ఈ పని వారు అధికారం చేప్పట్టిన వెంటనే చేసి ఉండి ఉంటే, బహుశః నేడు ఈ సమావేశం కూడా అవసరమయి ఉండేది కాదేమో! కానీ ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న తెరాస, తెదేపా రాజకీయ నేతలుఈ విభజన సమస్యలకు రాజకీయాలు కూడా జోడిస్తున్నందునే అవి మరింత ముదిరిపోయాయి. ఆలస్యంగానయినా ఈ విషయాన్నీ ఇరువురు ముఖ్యమంత్రులు గుర్తించి, ఇకపై ఈ సమస్యల పరిష్కరించే బాధ్యతను ఇరు రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు అప్పగించి, వారు పరిష్కరించలేనప్పుడే తాము జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకోవడం చాలా మంచి నిర్ణయం.   గవర్నరు పుణ్యమాని ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొంత సయోధ్య కుదిరింది గనుక వారు చెప్పిన మాటకు కట్టుబడి అధికారులకే ఆ భాద్యత వదిలిపెట్టినట్లయితే, నిపుణులు మేధావులయిన అధికారులు చాలా సమస్యలను పరిష్కరించగలరు. ఉదాహరణకు ఇటీవల ఆంద్ర, తెలంగాణా నీటిపారుదల శాఖా కార్యదర్శులు చర్చించుకొని, ఆంద్ర రాష్ట్రం అధీనంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ నుండి దిగువన తెలంగాణకు చెందిన హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు నీళ్ళు విడుదలయ్యేలా చేసి విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేయగలిగారు. అదేవిధంగా ముఖ్యమంత్రులిరివురూ తమ నేతలు అధికారులపై అనవసరమయిన కర్ర పెత్తనం చేయకుండా నియంత్రించి, అధికారులకు కొంత స్వేచ్చ ఇచ్చినట్లయితే వారు ఇదేవిధంగా అనేక సమస్యలను పరిష్కరించగల సమర్ధులు.   ఇరువురు ముఖ్యమంత్రులు తమ సమావేశం సహృద్భావ వాతావరణంలో సానుకూలంగా జరిగిందని వేర్వేరుగా మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్పడం గమనిస్తే వారి సమావేశం ఫలవంతం అయిందని అర్ధమవుతోంది. రౌతును బట్టే గుర్రం నడుస్తుంది కనుక, ముఖ్యమంత్రులిరువురూ ఘర్షణ వైఖరి విడనాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే మొగ్గు చూపినట్లయితే, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా ఆ దిశలోనే నడిచే అవకాశం ఉంటుంది. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య పెరిగిన ఈ దూరం క్రమంగా తగ్గి, అభివృద్ధి పధం వైపు సాగేందుకు వీలు చిక్కుతుంది.

తాత్కాలిక రాజధానిపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్

    విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రభావం రాజధాని కోసం ఏర్పాటు చేయబడిన శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్న వనరులను గుర్తించి, తదనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకే తమ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందని దానికి నేతృత్వం వహిస్తున్న శివరామకృష్ణన్ ఇప్పటికే చాలాసార్లు తమను కలుస్తున్న ప్రజా ప్రతినిధులకు, ప్రజా సంఘాల నేతలకు చెప్పారు. అయితే రాజధానికి అనుకూలమయిన ప్రాంతాన్ని గుర్తించే బాధ్యత కూడా తమకు అప్పగించడం వలన, ప్రజలు తమ కమిటీని రాజధాని కోసమే ప్రత్యేకంగా ఏర్పరిచిన కమిటీ అని అపోహ చెందుతున్నారని శివరామకృష్ణన్ అన్నారు. తాము రాజధానికి తగిన ప్రాంతాన్ని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం వరకే తమ బాధ్యత అని, కానీ అంతిమ నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొంటుందని ఆయన విస్పష్టంగా చెప్పారు.   రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకొనబోతున్నప్పుడు, ఇక కమిటీపై ఒత్తిడి చేయవలసిన అవసరం దానికేముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని నిర్మిస్తానని పదేపదే చెపుతున్నపుడు, ఇక కమిటీపై కొత్తగా ఏమి ప్రభావం పడుతుంది? రాష్ట్రప్రభుత్వం చెపుతున్న ప్రకారమే అక్కడే ఇప్పుడు తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు సిద్దమవుతోంది. తరువాత అక్కడే శాశ్విత రాజధాని కూడా నిర్మిస్తామని చెపుతోంది. అటువంటపుడు కమిటీ ఇక కొత్తగా చెప్పేదేముంటుంది? రాజధాని విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ ఇవ్వబోయే నివేదికను చూసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోబోదని స్పష్టం అవుతోంది. మహా అయితే హైకోర్టు, కమిటీ సూచించిన విధంగా ప్రభుత్వ శాఖలను వేర్వేరు జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును.   రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం అనేక పొరపాట్లు చేసింది. నిజానికి ఈ కమిటీని రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకొన్న వెంటనే నియమించి, విభజనకు ముందే తన నివేదికను ఈయమని ఆదేశించి ఉండి ఉంటే నేడు ఇటువంటి సందిగ్దం నెలకొని ఉండేది కాదు. కానీ ఆ విధంగా చేసినట్లయితే, కమిటీ ఫలానా ప్రాంతాన్ని రాజధానిగా చేయమని సూచిస్తే దానిని అమలుచేసినా, చేయకపోయినా దాని వలన తమకు ఎన్నికలలో మరింత నష్టం జరగవచ్చనే దురాలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కమిటీని నియమించడంలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేసి తెలివిగా తప్పుకొంది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రాజధాని ఎక్కడో తెలియని దుస్థితి నెలకొంది.   అటువంటి అవమానకర పరిస్థితి నుండి బయటపడేందుకే రాష్ట్రప్రభుత్వం ఈ తాత్కాలిక రాజధానికి సిద్దమయితే, రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసి రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకొందామని అత్యాశకు పోతున్నారు. కానీ వారు ఎన్ని రాజకీయాలు చేసినప్పటికీ వారు రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని గ్రహించి, ఇకనయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మసులుకోవడం నేర్చుకొంటే ఏదోఒకరోజున ప్రజలు వారిని క్షమించవచ్చును.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తుందా?

  యూపీఏ ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారం చేప్పట్టి రెండున్నార నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ ఊసే లేదు. ప్రత్యేక హోదా లేకపోవడం వలన ఈ రెండున్నర నెలలలో అనేక పెద్ద పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేస్తోందో కూడా తెలియదు. ఈ విషయం గురించి ఎవరు ప్రస్తావించినా, ప్రస్తావించకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపికయిన కాంగ్రెస్ యంపీ జైరామ్ రమేష్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని తరచూ నిలదీస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ విషయంపై నిలదీసినపుడు ప్రణాళిక శాఖా మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ ఆయనకు బదులిస్తూ ప్రస్తుతం ఈ అంశం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం యొక్క పరిశీలనలో ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు వస్తే వాటిని పరిశీలించేందుకు సిద్దంగా ఉందని జవాబిచ్చారు.   అయితే అంతకంటే ముందు రాష్ట్రంలో గుర్తించిన ఆ రెండు ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇచ్చేందుకు అవసరమయిన తంతు మొదలుపెట్టలేదు. ఇదేవిషయాన్ని జైరామ్ రమేష్ మళ్ళీ ప్రస్తావిస్తూ అసలు కేంద్రప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా? ఉంటే ఎప్పుడు ఇస్తారు? అని నిలదీశారు. రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాక, కేంద్రప్రభుత్వానికి ఆయన ఒక లేఖ కూడా వ్రాసారు.   అడగందే అమ్మయినా అన్నం పెట్టదన్నట్లు, ఆంధ్రా యంపీలు కూడా ఆపాటి శ్రద్ధ చూపించి కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు. ప్రత్యేక హోదా రానట్లయితే తీవ్ర ఆర్ధిక సమస్యలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి పరిశ్రమలు కూడా ఇష్టపడవు. పరిశ్రమలు రాకపోతే అభివృద్ధి జరగదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని యంపీలకు కూడా తెలుసు. కనుక ఇకనయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా రాష్ట్ర యంపీలు అందరూ గట్టిగా కృషిచేయాలి.