కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆత్మహత్యకి కారణాలెన్నో
posted on May 16, 2014 @ 10:48PM
కర్ణుడి చావుకి వేయి కారణాలు, వేయి శాపాలు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కూడా అన్నీ కారాణాలు, శాపాలు (ప్రజల ఉసురు) ఉన్నాయని చెప్పవచ్చును. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కళ్ళు బైర్లు కమ్మేలా దేశప్రజలు తిరుగులేని తీర్పునిచ్చి తగిన గుణపాటం చెప్పారు. గత పదేళ్ళ పాలనలో కాంగ్రెస్ అవినీతి గురించి ప్రతిపక్షాలు, కోర్టులు,మీడియా ఎంత మొత్తుకొన్నా అందరినీ బేఖాతరు చేస్తూ రాజరిక పాలన సాగించి ప్రజాగ్రహానికి గురయింది. అందుకే కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకున్న కోట్లాది భారతీయులు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ చరిత్రలో ఇందిరా గాంధీ హయం తరువాత ఇంత ఘోర పరాభావం ఎన్నడూ ఎదురవలేదు.
కాంగ్రెస్ అసమర్ధ పాలనకు తోడు అంతులేని అవినీతి, ఎవరినీ లెక్క చేయని నిర్లక్ష్యధోరణి ప్రజలలో ఆ పార్టీని అసహ్యించుకొనేలా చేసాయి. ఇవి సరిపోవన్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతకానితనం గురించి ఎన్నికల సమయంలో పుంఖానుపుంఖాలుగా విశ్లేషణలు, పుస్తకాలు వెలువడ్డాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా విడదీసి ఎన్నికల ముందు మరో ఘోర తప్పిదం చేసింది. ఆ ప్రభావం కేవలం ఆంధ్రాకే పరిమితమవలేదు. యావత్ దేశ ప్రజలు కాంగ్రెస్ అనుసరించిన పద్దతిని చూసి తీవ్రంగా అసహ్యించుకోవడం మొదలుపెట్టారు.
అయినప్పటికీ సోనియాగాంధీ మేల్కొనకపోగా అసమర్దుడయిన తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని దేశ ప్రజల నెత్తిన పెట్టాలని చూసింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అన్ని విధాల సమర్ధుడు, మంచి పరిపాలనా దక్షుడయిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలో దిగడంతో, కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్న దేశ ప్రజలకు మోడీ రూపంలో ప్రత్యామ్నాయం కనబడింది.
నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడినప్పటి నుండి ఎదురయిన అన్ని అడ్డంకులను ఒకటొకటిగా అధిగమిస్తూ దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ, తనను తాను పరిచయం చేసుకొంటూ ప్రజలలో తనపట్ల అపోహలు తొలగించి, వారిలో మళ్ళీ నమ్మకం కలిగించగలిగారు. క్రమంగా మోడీకి ఆదరణ పెరుగుతున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీ అతనిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడంతో, ప్రజలలో మరింత పలుచన అయింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకపోయినప్పటికీ, కాంగ్రెస్ గెలిస్తే అతనే ప్రధాని కుర్చీలో కూర్చోవడం తధ్యం గనుక, ప్రజలు అతనిని మోడీతో బేరీజు వేసి చూసుకోవడంతో, అతని అసమర్ధత మరింత స్పష్టంగా కనబడింది.
ప్రధాని మొదలు ఒక సామాన్య కాంగ్రెస్ నేతవరకు అందరూ కూడా రాహుల్ గాంధీకి ఎర్ర తివాచీ పరిచి దాసోహమంటూ అతని వెనుక నడిచేందుకు సిద్దపడినప్పటికీ రాహుల్ గాంధీ ఆ సువర్ణావకాశాన్నిఉపయోగించుకోలేక చతికిలబడితే, నరేంద్ర మోడీకి స్వంత పార్టీ నుండే కాదు దేశంలో అనేక వర్గాల ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటూ, తన తెలివి తేటలతో, నాయకత్వ లక్షణాలతో వాటినన్నీ అధిగమించి చివరికి తన కల నెరవేర్చుకోవడమే కాక, తనకీ ఈ అద్భుతమయిన అవకాశం కలిగించిన తన బీజేపీకి మళ్ళీ పదేళ్ళ తరువాత అధికారం కట్టబెట్టి ఋణం తీర్చుకొన్నారు.
రాహుల్ గాంధీ పదేళ్ల పుష్కలమయిన సమయం దొరికినప్పటికీ తన చేతకానితనంతో దానిని సద్వినియోగించుకోలేని అసమర్ధుడుగా మిగిలిపోతే, కేవలం ఆరేడు నెలల కాలంలోనే నరేంద్ర మోడీ అనేక అగ్ని పరీక్షలు అన్ని దైర్యంగా ఎదుర్కొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొని మరీ ప్రజల ఆశీర్వాదం పొందారు. దేశ ప్రజల విజ్ఞతకు పరీక్షగా వచ్చిన ఈ ఎన్నికలలో భారతీయులందరూ నూటికి నూరు శాతం ఉతీర్ణులయ్యారని ఒప్పుకోవలసిందే.