తెలంగాణా ప్రజల కలలు నెరవేరిన శుభవేళ...
posted on Jun 1, 2014 @ 12:14AM
ఈరోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించడంతో తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. వారి పోరాటాలకు, బలిదానాలకు, ఆశలకు ప్రతీకగా ఏర్పడుతున్న రాష్ట్రం ఇది. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలిసిన అనేక కారణాల వలన, అవి అర్ధాంతరంగా ముగిసిపోయాయి. కానీ, తెలంగాణా ప్రజలలో ఆ ఆకాంక్ష మాత్రం నివురు గప్పిన నిప్పులా మిగిలే ఉంది. దానిని గుర్తించిన కేసీఆర్ 2001 సం.లో తెరాసను స్థాపించి, మళ్ళీ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. అయితే అప్పుడెవరూ ఆయన ఇంతవరకు పోరాడగలరని కానీ, ఆయన తెలంగాణా సాధించగలరని గానీ నమ్మలేదు.
కానీ కేసీఆర్ తన పోరాటం ఆపకుండా కొనసాగించడంతో, క్రమంగా ఆయన నాయకత్వ లక్షణాలపై తెలంగాణా ప్రజలకు నమ్మకం కలగింది. దానితో ఆయన పోరాటాలు ప్రజా ఉద్యమ రూపం సంతరించుకొన్నాయి. కానీ, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవి కొంచెం చల్లబడిపోయినట్లు కనిపించినా, ఆయన మరణాంతరం మళ్ళీ తీవ్రతరం అయ్యాయి. కేసీఆర్ 2009లో ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో అవి పతాక స్థాయికి చేరుకొన్నాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది.
ఆ తరువాత నుండి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు ఆడిన రాజకీయ చదరంగాన్ని తెలుగు ప్రజలందరూ కనులారా చూసారు. చివరికి అత్యంత నాటకీయంగా 2014, ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది. దానితో తెలంగాణా ప్రజల పోరాటాలకు, బలిదానాలకు ఒక అర్ధం, పరమార్ధం ఏర్పడినట్లయింది. ఈరోజు అధికారికంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణా ప్రజలెన్నుకొన్న కొత్త ప్రభుత్వం కూడా ఈరోజే ఏర్పడుతోంది.
ఇంతవరకు పరాయిపాలనలో మగ్గుతున్నామనే భావనతో ఉన్న తెలంగాణా ప్రజలు, నేడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో స్వాతంత్ర్యం వచ్చినంత సంతోషంగా ఉన్నారు. ఇకపై తమకు అన్నీ మంచి రోజులేననే గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం ప్రజలందరిలో కనబడుతున్నాయి. అందుకే తెలంగాణా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంబరాలలో మునిగితేలుతున్నారు. వారి కళ్ళలో ఈ సంతోషం, హృదయాలలో ఆనందం కలకాలం నిలిపే బాధ్యత ఈరోజు తెలంగాణా మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పైనే ఉంది.
గత పదేళ్లుగా ఆయన తెలంగాణా సాధన కోసం చేసిన పోరాటాలు ఒక ఎత్తయితే, తనపై పూర్తి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, వారు తనపై పెట్టుకొన్న ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తెలంగాణాను త్వరితగతిన ప్రగతిపధంలో నడిపించడం మరో ఎత్తు. ఆయన ఇంతకాలంగా తెలంగాణా ప్రజల ఉద్యోగాలను, భూములను, నీళ్ళను అన్నిటినీ కూడా ఆంద్ర ప్రజలు, పాలకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు దోచుకోన్నారని, అందువల్ల ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే వారి జీవితాలు మళ్ళీ బాగుపడతాయని వాదిస్తూ, వారి నమ్మకాన్ని చూరగొని చివరికి తెలంగాణా సాధించగలిగారు. ముఖ్యమంత్రి కూడా అవగలిగారు. అందువల్ల ఇకపై దోపిడీకి ఆస్కారం లేని రాజ్యం ఏర్పడింది గనుక, ఇక తెలంగాణా ప్రజల కష్ట సుఖాలకు, మంచి చెడ్డలకు అన్నిటికీ పూర్తిగా తెలంగాణా పాలకులదే బాధ్యత అవుతుందనే విషయం సదా గుర్తుంచుకొని ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా పరిపాలించవలసి ఉంటుంది.
ఇంతవరకు రాష్ట్రా సాధన కోసం చేసిన పోరాటాలలో తెరాస నేతలు కనబరిచినటువంటి స్పూర్తినే ఇకపై తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపుతూ తెలంగాణాను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరుకొందాము.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేసిన అమరవీరులందరికీ తెలుగువన్ జోహారు పలుకుతోంది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన నేతలకి, తెలంగాణా ప్రజలందరికీ తెలుగువన్ శుభాబినందనలు తెలియజేస్తోంది.