అవును వారిద్దరూ ఇష్టపడ్డారు
posted on May 10, 2014 6:51AM
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్దపడిన రోజునే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దానివెనుక దాగి ఉన్నకుట్రను, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో చేసుకొన్న రహస్య ఒప్పందాలు గురించి ప్రజలకు చెప్పారు. ఆయన ఆరోపణలను అనేకమంది కాంగ్రెస్ నేతలు కూడా దృవీకరించారు. ఆ తరువాత తెదేపా-బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం ప్రస్తావించి జగన్, కేసీఆర్ లను ఎండగట్టారు. కానీ అప్పటికి ఇంకా ఎన్నికలు పూర్తి కానందున వారివురూ కూడా ఆ ఆరోపణలకు నేరుగా జవాబీయకుండా, విషయాన్ని పక్క దారి పట్టించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఎదురుదాడికి దిగారు. కానీ, ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయాయి గనుక ప్రజలు నవ్వితే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు వచ్చారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంటరారని వ్యక్తేమీ కాదని, ఆయనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, అదేవిధంగా తెలంగాణాలో అధికారంలోకి రాబోయే తాను అతనితో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణాలకు సమ న్యాయం జరగాలని తెలంగాణా ఏర్పాటుకు సానుకూలంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడుకి ఆయన పిల్లి శాపాలు పెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలలో కూడా ఇక తెదేపా కనబడకుండాపోతుందని, చంద్రబాబు నాయుడు అధ్యాయం ముగిసిందని కేసీఆర్ జోస్యం చెప్పారు.
ఆయన చంద్రబాబుని ఇంతగా ద్వేషించడానికి కారణం, ఆయన తెలంగాణాలో తనకు సవాలుగా మారడమే. జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు రావడానికి కారణం అతను తెలంగాణా నుండి బిచాణా ఎత్తేసి తెరాసకు అడ్డుతొలగడమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణాలో తన పార్టీని యధాతధంగా నిలుపుకొని, తెరాసకు పోటీ ఇచ్చినట్లయితే అప్పుడు అతను కూడా కేసీఆర్ శత్రువుల జాబితాలో ఉండేవారు. కానీ కాంగ్రెస్, కేసీఆర్, జగన్ లమధ్య కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం జగన్ రాత్రికి రాత్రి తెలంగాణా నుండి బిచాణా ఎత్తేసి కేసీఆర్ కు అడ్డుతొలగారు. కానీ తెరాస బలహీనంగా ఉన్న ప్రాంతాలలో సెటిలర్ల ఓట్ల కోసం తెదేపాతో పోటీ పడ్డారు. ఆంధ్రాలో కేవలం 25 యంపీ సీట్లే ఉన్నప్పటికీ, జగన్ సమైక్య ఉద్యమాలు చేస్తున్న సమయంలో తనకు 30 యంపీ సీట్లు కావాలని, వస్తాయని చెపుతున్నదీ అందుకే.
ఈవిధంగా కేసీఆర్, జగన్ ఒకరి పరిధిలోకి మరొకరు ప్రవేశించకుండా చాలా జాగ్రత్తపడుతూ ఇంతవరకు చాలా తెలివిగా కధ నడిపించారు. కేసీఆర్ విభజనవాది అయితే, జగన్ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది. వారిరువురు కూడా రాష్ట్ర విభజన కోరుకొన్నవారే. అందుకే ఏనాడు కూడా వారిరువురూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. ఇద్దరూ కలిసి తమకు తెర వెనుక నుండి మార్గదర్శనం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానంతో బద్దవైరం ఉన్నట్లు నటించారు. ఇక ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయాయి గనుక ఇక నిస్సిగ్గుగా తమ ముసుగులను తొలగించి ప్రజలకు తమ అసలు రూపాలు చూపిస్తున్నారు. ముగ్గురూ ఒకరికొకరు సహకరించుకొనేందుకు సిద్దపడుతున్నారు. బహుశః నేడో రేపో జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించవచ్చును. ఎన్నికలలో ఓట్లు సంపాదించుకొనేందుకు ఇంత కపటనాటకం ఆడి ప్రజలను మభ్యపెట్టిన వీరు నేటికీ నీతి సూక్తులు, నైతిక విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.