మార్పు అసాధ్యమని తేల్చి చెప్పిన కాంగ్రెస్
posted on May 20, 2014 8:35AM
ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో ఏకధాటిగా ఓడిపోతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలలో కూడా ఘోరపరాజయం పాలయి పార్టీ చరిత్రలో మరో సరికొత్త రికార్డు సృష్టించుకొంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, చివరికి అసెంబ్లీలో అడుగుపెట్టలేని దుస్థితికి చేరుకొంది. ఇక జాతీయ స్థాయిలో కనీసం యాబై సీట్లు కూడా సాధించలేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా దక్కించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మరో ఘోర అవమానం.
ఎనబై యంపీ సీట్లున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలలో మాత్రమే గెలవగలిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల పరువుకు సంబంధించిన విషయం కనుక, తమకు కంచుకోటవంటి రాయ్ బరేలీ, అమేథీ నుండి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడినందునే ఆ రెండు స్థానాల నుండి వారు గెలవగలిగారు.
ఈ ఎన్నికలలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయి, ఇప్పుడు ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ పార్టీ కుచించుకు పోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సోనియా, రాహుల్ గాంధీలిరువురూ ఈ ఓటమికి తమదే బాధ్యత అని ప్రకటించుకొన్నారు. ఆ తరువాత ఈ ఓటమికి కారణాలను కనుగొనేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న సమావేశమయింది.
ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్ గాంధీలు రాజీనామాలకు సిద్దపడటం, బయట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడం, ఊహించినట్లే కాంగ్రెస్ నేతలు వారి రాజీనామాలను ముక్తకంటంతో తిరస్కరించడం వంటి తంతులన్నీ చకచకా జరిగిపోయాయి. వివిధ రాష్ట్రాలలో పార్టీ ఓటమికి కారణమయిన పీసీసీ అధ్యక్షులను బాధ్యులను చేసి పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు మాత్రం ఆ సూత్రం వర్తించదని తేల్చి చెప్పారు. పార్టీకి ఈ గతి పట్టించిన వారిరువురే పార్టీని ఒడ్డున పడేయమని కోరుతూ కాంగ్రెస్ నేతలందరూ చేతులు జోడించి అభ్యర్ధించి మరీ వారిని ఒప్పించుకోగలిగారు. వారి రాజీనామాల వలన ఒరిగేదేమీ లేకపోయినా పార్టీకి మరింత నష్టం జరుగుతుందని ప్రధానమంత్రితో సహా అందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో అధిష్టాన దేవతలిరువురూ వారిపై దయతో తమ రాజీనామా ఆలోచనని విరమించుకొన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసేందుకు పెద్ద పనేమీ కూడా లేదు గనుక ఓటమికి కారణాలను ఆన్వేషించేందుకు, బహుశః నేడో రేపో మళ్ళీ ఆ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే ఒక అరడజను కమిటీలు వేసి, పార్టీలో అటు వారిని ఇటు, ఇటువారిని అటు మార్చేసి ప్రక్షాళణా కార్యక్రమం కూడా పూర్తి చేసేయవచ్చును. ఎన్నికలలో ఓడిపోయిన ప్రతీసారి కూడా ఆత్మవిమర్శ చేసుకొంటామని చెప్పుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మార్చుకొన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ కలిసి, అతి త్వరలోనే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం వంటి ఈ ఎన్నికల వైరాగ్యం నుండి కూడా బయటపడి మళ్ళీ యధావిధిగా సోనియా, రాహుల్ గాంధీల భజనలో తరించిపోవడం తధ్యం. అంతిమంగా తేలేదేమిటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఏపంధాలో నడుస్తోందో ఆవిధంగా నడిస్తేనే దానికి మనుగడ ఉంటుంది తప్ప, ఆ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తే ఈవిధంగానే కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ నేతలు మరోమారు ఋజువు చేయబోతున్నారు.