భారీ అంచనాల నడుమ మోడీ పట్టాభిషేకం
posted on May 26, 2014 9:29AM
ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. పదేళ్ళ కాంగ్రెస్ అసమర్ధ, అవినీతిమయపాలనతో విసిగిపోయిన ప్రజలు, కేవలం ఆయనపై నమ్మకంతోనే బీజేపీకి పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. యావత్ దేశ ప్రజలందరూ ఆయనపై కోటి ఆశలు పెట్టుకొన్నారు. ఒక సాధారణ ‘ఛాయ్ వాలా’ 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి పధంలో ఏవిధంగా ముందుకు నడిపించబోతున్నాడా? అని యావత్ ప్రపంచమూ ఆసక్తిగా చూస్తోంది.
ఇవన్నీ ఆయనపై తీవ్ర ఒత్తిడి కలిగించే అంశాలే. సచిన్ టెండూల్కర్ బ్యాటింగుకి దిగినప్పుడు, ఎవరయినా ఒక ప్రముఖ హీరో నటించిన సినిమా విడుదలవుతున్నపుడు ఏవిధంగా భారీ అంచానాలు ఉంటాయో, అంతకంటే కొన్ని వేల రెట్లు భారీ అంచనాలు దేశ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న నరేంద్ర మోడీపై ఉన్నాయి.
ఎన్నికలలో బీజేపీకి విజయావకాశాలు పెరగడంతోనే దేశంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో గుర్రాల్లా పరుగులు తీయడం మొదలు పెట్టాయి. నేడు మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టబోతుండటంతో షేర్ మార్కెట్ మరింత చురుకుగా కదులుతోంది. రూపాయి విలువ బలపడింది. బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. దేశంలో సత్వర పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్య, విద్యుత్, రవాణా వంటి కొన్ని రంగాలపై తాను ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించడంతో, దేశంలో దాదాపు అన్ని వ్యవస్థలు ఏదో రూపంలో వాటితో అనుసంధానమయ్యున్నందున, దేశంలో చాలా అశావాహక, సానుకూల వాతావరణం ఏర్పడి ఉంది. అందుకే స్టాక్ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన తరువాత ఆ కుర్చీలో కూర్చొని దేశాన్నిపాలించాలని కలలుగన్నరాహుల్ గాంధీ ఇరువురూ కూడా దేశంలో అన్ని సమస్యలను రాత్రికి రాత్రే తీర్చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏమీ లేదని అని చాలా నిరాశాజనకంగా మాట్లాడేవారు. మోడీ కూడా రాత్రికి రాత్రే దేశంలో సమస్యలన్నీ పరిష్కరించేస్తానని ఏనాడు చెప్పలేదు. కానీ ఆయన వారిరువురిలా ఏనాడు కూడా నిరాశ, నిస్పృహలతో మాట్లాడలేదు.
దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, తాను తప్పకుండా దేశాన్ని మళ్ళీ గాడిన పెడతానని, దేశానికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు పూర్తి భరోసా ఇస్తున్నారు. ఆ సానుకూల, ఆశవాహక దృక్పధమే ప్రజలలో ఆయనపై నమ్మకం కలిగేలా చేసింది. దేశాన్ని నడిపించే వ్యక్తి ఆ దైర్యం, ఆత్మవిశ్వాసం కనబరిస్తే, దేశ ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు కూడా ప్రభుత్వంపై గురి కుదురుతుంది. అది అనేక క్లిష్ట సమస్యలను అవలీలగా పరిష్కరించేందుకు దోహదపడుతుంది.
ఒక బీద కుటుంబం నుండి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీకి దేశ ప్రజల కష్టసుఖాలు, వారి సమస్యలు, అవసరాలు, ఆకాంక్షలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. తనపై దేశప్రజలు కోటి ఆశలు పెట్టుకొన్నారనే సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించి, తన దీక్షాదక్షతలను చాటుకొన్న ఆయన దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పధంలో నడిపిస్తారని ఆశించడం అత్యాస కాదు.