చంద్రబాబు అభివృద్ధికి, కేసీఆర్ గిల్లికజ్జాలకి ప్రాధాన్యం
posted on May 23, 2014 9:04AM
త్వరలో తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేసీఆర్ నేటికీ ఆంధ్ర ప్రజల పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తుండటం చాలా దురదృష్టకరం. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాటం మొదలుపెట్టినపుడు, ఆయన తెలంగాణా ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు వారిలో ఈ విద్వేష భావనలను వ్యాపింపజేశారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన కల నెరవేరుతున్నప్పటికీ ఆయన ఆంద్ర ప్రజలు, పాలకులపై విషం కక్కుతూనే ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలే అందుకు ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి వంటి ఒక గౌరవ ప్రధమయిన, అత్యున్నతమయిన పదవిని చెప్పట్టబోతున్న కేసీఆర్, ప్రభుత్వోద్యోగుల విషయంలో అంత హేళనగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్వయంగా తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నపుడు, ఈ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకొనే అవకాశం ఉంది. అవసరమయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కూడా. కానీ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాక నేటికీ ఒక ఉద్యమ నేతలాగే మాట్లాడుతూ, తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలలో అభద్రతాభావం కలిగిస్తున్నారు.
ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్, చంద్రబాబుల వైఖరిలో తేడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నచంద్రబాబు, కేసీఆర్ కి స్నేహ హస్తం అందిస్తే, ఆయన నుండి ఇంతవరకు కనీస స్పందన కూడా లేదు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తో బాటు తెలంగాణా అభివృద్ధికి కూడా తను యధాశక్తిన సహకరిస్తానని, కేసీఆర్ తో కలిసిపనిచేస్తానని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు చొరవ చూపుతానని చెపుతుంటే, కేసీఆర్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు మాట్లాడుతున్నారు.
తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణాలో ఒక్క ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను కూడా అడుగు పెట్టనీయమని కేసీఆర్ చెప్పడం అవివేకమే. చంద్రబాబు ఇంకా అధికారం చేప్పటక ముందే దేశవిదేశాలలోని పారిశ్రామికవేత్తలను, సాఫ్ట్ వేర్ కంపెనీలను, వ్యాపార సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించి వారిచే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కంపెనీలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేందుకు అప్పుడే గట్టిగా ప్రయత్నాలు మొదలుపెడితే, కేసీఆర్ మాత్రం ఇంకా గిల్లికజ్జాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గత పదేళ్లుగా ఆయన చేసిన తెలంగాణా ఉద్యమాలతో తెలంగాణా అస్తవ్యస్తమయింది. ఉద్యమాల కారణంగా వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నాయి. ఇక హైదరాబాదులో స్థిరపడిన సినీ పరిశ్రమ, ప్రైవేట్ విద్యాసంస్థలు తీవ్ర అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అటువంటప్పుడు కేసీఆర్ వారందరికీ దైర్యం కలిగేవిధంగా మాట్లాడకపోగా వారి భయాలను మరింత పెరిగేలా మాట్లాడుతున్నారు.
అనేక ఆర్ధిక సమస్యలకు తోడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవలసిన దుస్థితిలో ఉన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా సానుకూల వాతావరణం కనబడుతోందంటే అందుకు కారణం చంద్రబాబు సమర్ధతపై ప్రజలకున్న నమ్మకమేనని చెప్పవచ్చును. కానీ అన్నివిధాల అభివృద్ధి చెంది ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణాలో ఒక అనిశ్చిత, అభద్రతా వాతావరణం కనబడుతోంది అంటే అందుకు కేసీఆర్ వైఖరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరివల్ల తెలంగాణాకు, ప్రజలకు కూడా ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదు.