రెండుగా చీలిన తెలుగుజాతి
దాదాపు పదేళ్లుగా తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతుంటే, దానిని సత్వరమే పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కమిటీలతో కాలక్షేపం చేసిన కాంగ్రెస్ పార్టీ, సరిగ్గా ఎన్నికల ముందు ఈ అంశాన్ని పరిష్కరించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేసింది. చివరికి ఈరోజు రాజ్యసభలో బిల్లుకి తనదైన శైలిలో ఆమోదముద్ర వేయించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది. అయితే అందుకు తెలంగాణా ప్రజలు చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. వారు అనేక పోరాటాలు చేసి, అనేకమంది యువకులు బలిదానాలు చేసిన తరువాత కానీ తెలంగాణా ఏర్పాటు చేయాలనే తలంపు కాంగ్రెస్ పార్టీకి కలుగలేదు. ఏమయినప్పటికీ తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది గనుక ఇక ఇంతకాలంగా ఈ విభజన చిచ్చుతో తెలుగు ప్రజల మధ్య పతాక స్థాయికి చేరిన తీవ్ర విద్వేషాలు, విభేదాలు, అనుమానాలు, అసూయలకు ముగింపుపలికి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పూర్వ సత్సంభందాలు వీలయినంత త్వరగా పునరుద్దరించే విధంగా రాజకీయ నేతలు, పార్టీలే చొరవ తీసుకొని ప్రయత్నించవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోవచ్చును. కానీ, అది అపరిష్కృతంగా విడిచిపెట్టిన అనేక సమస్యలు మున్ముందు తలెత్తినప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు సామరస్యదోరణిలో వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. లేకపోతే ఈ వైషమ్యాలు శాశ్వితంగా నిలిచిపోయినట్లయితే అవి ఇరు ప్రాంతాల అభివృద్ధికి, శాంతికి ఆటంకంగా మారుతాయి.
ఇంతకాలంగా సీమాంధ్ర పాలకుల చెరలో మగ్గినందునే తెలంగాణాలో అభివృద్ధి జరుగలేదని వాదిస్తువచ్చిన తెలంగాణా నేతల చేతికే ఇప్పుడు పగ్గాలు వచ్చాయి గనుక, ఇకనయినా వారు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య, కరీంనగర్ బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితుల సమస్యలు, సిరిసిల్లా నేతన్నల సమస్యలు, తెలంగాణా రైతన్నల సమస్యలు, లక్షలాది యువత ఎదుర్కొంటున్న విద్యా, ఉపాది సమస్యలను చిత్తశుద్దితో తీర్చేప్రయత్నం చేసి తెలంగాణాను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకొందాము.
ఇక సీమాంధ్ర పునర్నిర్మాణం పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఈతరం ప్రజలు పూర్తిగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడగలరా? అని తలచుకొన్నపుడు ఎవరికయినా మనస్సు బాధతో కలుక్కుమంటుంది. కానీ, రాజకీయ పార్టీలు, వాటి నేతలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, పట్టుదలగా కృషిచేస్తే తప్పకుండా ఒక దశాబ్దకాలంలోనే మళ్ళీ పూర్తిగా అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు. అణుబాంబులు పడిన హిరోషిమా, నాగసాకీలే మళ్ళీ లేచి నిలబడగలిగినప్పుడు, అనేక సహజవనరులు, నదులు, సముద్రాలు, ఓడరేవులు, వాణిజ్య కేంద్రాలతో చాలా దృడంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబివృద్ధి సాధించి పూర్వ వైభవం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.
గత మూడు నాలుగు దశాబ్దాలుగా పాలకులందరూ కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాపానికి, ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. కనుక మళ్ళీ అటువంటి పొరపాటు పునారావృతం చేయకుండా రాష్ట్రంలో 13జిల్లాలు సరిసమానంగా అభివృద్ధి చెందేలా జాగ్రత్త పడాలి. తద్వారా అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందడమే కాకుండా, మళ్ళీ ఇటువంటి సమస్యలు పునరావుతం కాకుండా నివారించవచ్చును.
ఇంతకాలంగా అన్నదమ్ములవలె కలిసిమెలిసి జీవించిన తెలుగు ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టుకొని విడిపోవలసిరావడం చాలా బాధాకరంగా ఉన్నపటికీ, విడిపోతేనే సంతోషంగా ఉండగలమని తెలంగాణా ప్రజలు దృడంగా భావిస్తునందున, అందుకు అంగీకరించి వారందరికీ సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకొందాము. అదేవిధంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా అనతికాలంలోనే ఈ బాధ, భావోద్వేగాల నుండి బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణంలో తమతమ పాత్రలు పోషించి ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు పరుచుకోవాలని మనస్పూర్తిగా ఆశిద్దాము. సర్వేజన సుకినో భవంతు.