సమైక్యవాదమే కిరణ్ పార్టీకి ప్రతిబందకం కానుందా?
కిరణ్ కుమార్ రెడ్డి తన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ని నిన్నరాజమండ్రీలో అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆయన తన పార్టీని సమైక్యవాదం పునాది మీద నిర్మించుకోవడంతో ఆయన ప్రసంగమంతా ఆ ప్రకారమే సాగవలసి వచ్చింది. సాధారణంగా ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్నసమయంలో ఆ పార్టీ అధినేత తన పార్టీ లక్ష్యాలను, అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఏమి చేయాలనుకొంటున్నదీ వివరిస్తారు. కానీ, కిరణ్ సమైక్య సెంటిమెంటును ఉపయోగించుకోవాలనే తపనలో అవేవీ తన ప్రసంగంలో వివరించలేకపోయారు. పైగా ఆంధ్ర, తెలంగాణాలుగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయన తనకు 25మంది యంపీలను ఇస్తే, ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పడం హాస్యస్పదం, ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.
పదవులు, అధికారం కోసం పార్టీ పెట్టలేదని చెపుతూనే పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన 25మంది యంపీలను ఇవ్వమని కోరడం, తన పార్టీనే ఎన్నికలలో గెలిపించమని కోరడం హాస్యాస్పదం. ఆయన తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతోందో వివరించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా, ఎవరి సహకారంతో అభివృద్ధి చేస్తారో తెలిపి ఉంటే బాగుండేది. కానీ, ఆయన అధికారంలోకి రావడానికి సమైక్యవాదాన్ని పెట్టుబడిగా పెడుతున్నందున, ఇటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తే కధలో రసాభంగం అవుతుంది.
ఆయన ఈ సమయంలో సమైక్యవాదంతో పార్టీని పెట్టినందున, రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా విభజనను అంగీకరించలేని పరిస్థితిని, విభజన తరువాత ఏర్పడుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితిని ఆయనే చేజేతులా సృష్టించుకొన్నారని చెప్పవచ్చును. సరిగ్గా ఎన్నికల సమయంలో బరిలోకి దిగుతున్న ఆయనకు ఇదే అంశం పెద్ద అడ్డంకిగా మారవచ్చును. ఎందుకంటే ఆయన ప్రత్యర్ధులు అందరూ రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణం గురించి కధలు కధలుగా వర్ణిస్తూ ప్రజలను ఆకట్టుకొంటుంటే, కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రతీ సభలో తన సమైక్యవాదం, తను చేసిన త్యాగాలు, సాధించిన ఘనకార్యాల గణాంకాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఆ విషయాలను ప్రస్తావించలేకపోతే, ఆయన ఎంత గొంతు చించుకొన్న ప్రజలను ఆకట్టుకోలేరు. ఒకవేళ తన ఘన కార్యాల గురించి నోరారా చెప్పుకొందామని ఆశపడినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా తన ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల పేర్లు తగిలించేసినందున, అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతాయి, తప్ప ఆయన వాటి గురించి గట్టిగా చెప్పుకోలేరు.
ఇక తన ప్రసంగంలో రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని నిశితంగా విమర్శించిన ఆయన సోనియా, రాహుల్ గాంధీల గురించి పల్లెత్తు మాటనలేదు. పైగా తెదేపా,వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించడం వలన ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వచ్చినట్లే అనిపించింది. రాష్ట్ర విభజన చేసిన సోనియా గాంధీని పెద్దమ్మ అని ఆయన అనడం ఆమెను విమర్శిస్తున్నట్లు కాక గౌరవిస్తున్నట్లే ఉంది.
రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్విఘ్నంగా జరిగేందుకు తనవంతు సహాకారం అందించిన తరువాతనే ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటవచ్చారనే ఆరోపణలకు ఆయన తన ప్రసంగంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి పుట్టుకొచ్చిన ఆయన, ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికల తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోదని గట్టిగా చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయకపోవడంతో ఆయన పట్ల ప్రజలలో ఉన్న అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. అదేవిధంగా ఎన్నికల ముందు, తరువాత తమ పార్టీ కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీతో చేతులు కలుపుతుందనే విషయాన్ని కూడా ప్రస్తావించకుండా దాటవేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి తన సమైక్యవాదంతో ప్రజల మనసులు, తద్వారా వారి ఓట్లు కొల్లగొట్టుకొందామని ప్రయత్నించి చివరికి దానికే బందీ అయిపోయి దానివాలనే నష్టపోయేలా ఉన్నారు.