నిత్యానంద ఆన్ లైన్ లీలలు

    నిత్యానంద ఎక్కుడున్నాడో తెలీదు. ఎలా ఉన్నాడో తెలీదు.. పోలీసులు కాషాయం కట్టుకున్న ఆ కొంటె కృష్ణుణ్ణి పట్టుకోవడానికి నానా తిప్పలూ పడుతున్నారు. కానీ.. నిత్యానంద ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న స్వామివారు మళ్లీ ప్రపంచానికి ప్రకటితమయ్యేవరకూ దందా ఎందుకు బంద్ చేసుకోవాలనుకున్నారో ఏమో.. భక్తుల్ని ఆన్ లైన్ లోనే కరుణిస్తూ వరాల్ని కురిపిస్తున్నారు.   హైదరాబాద్ శివారులో ఉన్న నిత్యానంద ఆశ్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విచిత్రం బైటపడింది. వరసగా లైన్లో వెళ్లి వెయ్యి రూపాయల ఫీజు సమర్పించుకుని టీవీ ఎదురుగా కూర్చుంటే నిత్యానంద దర్శనం దొరుకుతుంది. ముందుగా ఎంపిక చేసుకున్న సమస్యని అడిగితే ఆయనకు తోచిన సమాధానం చెబుతారు. అంతే అక్కడితో వంతు పూర్తై మరొకరికి ఛాన్స్ వస్తుంది.   మామూలుగా నిత్యానంద దర్శనం ఇంటర్ నెట్ లోకూడా దొరుకుతోంది.. కానీ.. ఆ దర్శనంలో కేవలం నిత్యానందని భక్తులు చూసే వీలుమాత్రం ఉంది. అదే ఆశ్రమానికి వెళ్లి ఆన్ లైన్ దర్శనం పొందితే ఆయనతో మాట్లాడే వీలుకూడా ఉంటుంది. పైగా సమస్యని నేరుగా విన్నవించుకునే అవకాశం కూడా..   ఈ విషయంగురించి తెలుసుకున్నవాళ్లు అంతా బాగానే ఉంది గానీ.. స్వామివారి పక్కన రంజిత స్వామిని కూడా ఉంటే అదీ.. ఇద్దరూ రాసలీలలు చూపిస్తే వెయ్యేంటి పదివేలైనా పెట్టడానికి రెడీ అంటున్నారట.

పెడద్రోవ పడుతున్న టెక్నికల్ నాలెడ్జ్

    వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో మరోసారి హైటెక్ కాపీయింగ్ బట్టబయలైంది. వైద్యవిద్య సంస్థల్లో చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కూ దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఇందులో సీటు కోసం పోటీ పడతారు. పీజీఐలోని వివిధ విభాగాల్లో పేజీ వైద్యకోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కూ పాల్పడుతూ చండీగఢ్ లో పలు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వైద్య విద్యార్ధినులు పట్టుబడ్డారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పీజీఐఎంఈఆర్ లో ఎండీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో కాపీ జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని సీబీఐ డిఐజీ మహేష్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడి నాలుగు పరీక్షా కేంద్రాల్లో బ్లూటూత్ సహా అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్ధినులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఓ విద్యార్ధిని చెవిలో సూక్ష్మ పరికరాన్ని అమర్చుకొందని, ఆమెకు శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాల్సి ఉందని వివరించారు. ఇందుకు పీజీఐఎంఈఆర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. నిందుతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కుంభకోణానికి సంబందించి హైదరాబాద్, పాట్నా నగరాలలో పలువురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.      యువత ఇలాంటి పెడ దోరణలకు అలవాటు పడకుండా వాళ్ళని మంచి మార్గంలో మళ్ళించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు తెలుగువన్.కాం "ఓక మంచి మాట" పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నడుపుతోంది. కౌన్సుల్లింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ వంగావరపు రవికుమార్ ఆధ్వర్యంలో "టోరి"లో యువతకు సలహాలు సూచనలు ఇస్తూ మార్గ నిర్దేశం చేసే కార్య క్రమాన్ని ప్రసారం చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమాన్నికి ఆదరణ లబిస్తుంది.                                                                    

    సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఉన్నపళంగా అమలుచేస్తే అది అందమైన ధనిక మహిళలకు ఉపయోగపడుతుంది తప్ప అందంగా లేని గ్రామీణ మహిళలకు ఉపయోగం లేదంటూ అడ్డంగా మాట్లాడి ఇరుక్కున్నారు.   ములాయం చేసిన వ్యాఖ్యలపై మహిళాలోకం గళమెత్తింది. తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతోంది. యూపీలోని బారాబంకీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ములాయం ఉద్దేశం ఏదైనా నేరుగా ఆయన గ్రామీణ మహిళల్ని అనాకారులన్నట్టేనంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆడాళ్లంటే అంత చులకనా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.     గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ములాయం ఇలాగే అడ్డంగా మాట్లాడి మహిళాలోకం నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు ఎదుర్కున్నారు. బిల్లుని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిస్తే పార్లమెంట్ లో యూత్ ఈల వేస్తారంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయ్. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత ములాయం మరోసారి అలాంటి మాటలే మాట్లాడి మహిళాలోకం ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు.

కేజ్రీవాల్ తర్వాతి టార్గెట్ ఎవరు?

    సామాజిక కార్యకర్తగా పోరాటం మొదలుపెట్టి సొంత పార్టీ పెట్టి ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ ని పాతా కొత్తా తేడా లేకుండా ఏకి పారేస్తున్న కేజ్రీవాల్ ఇప్పుడు దేశంలోని ప్రథాన పార్టీలు, నేతలకి కొరకరాని కొయ్యగా మారారు. కేజ్రీవాల్ నోరు తెరుస్తున్నాడంటే రాజకీయ నేతలకు వణుకుపుడుతోంది.   సమాచార చట్టం ఆధారంగా పక్కా వివరాలు సేకరించి పెట్టుకున్నాకే, అన్ని ఆధారాలతో కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలమీద విరుచుకుపడుతున్నారు. ఆటుమొన్న సల్మాన్ ఖుర్షీద్, మొన్న రాబర్ట్ వాద్రా, నిన్న గడ్కరీ.. మరి ఇవాళ ఎవరి వంతో..?   కేజ్రీవాల్ నోరు తెరిస్తే ఎప్పుడు ఏ పేరు కంపైపోతుందోనని జనం తెగ టెన్షన్ పడి చస్తున్నారు. ఏకడమంటూ మొదలుపెడితే చివరికంటా నిలబడాలనేది కేజ్రీవాల్ స్ట్రేటజీగా కనిపిస్తోంది. అందుకే.. అంబానీ లాంటి కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకు పోయారంటూ ప్రథాని మన్మోహన్ మీదకూడా కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు.     కేజ్రీవాల్ దగ్గర ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయనీ, అందుకే ఆయన అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారనీ ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్ కూడా ప్రకటించాక జనంలో పిచ్చగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలపై నిష్ఫాక్షికంగా విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గుతేలతాయని సింగ్ అంటున్నారు.   కాంగ్రెస్ నేతల్ని ఇన్నాళ్లూ దగాకోరులుగా చిత్రీకరిస్తూ తాము సుద్దపూసలమన్నట్టు ఫోజు పెట్టిన భారతీయ జనతా పార్టీ నేతలుకూడా ఇప్పుడు గడ్కరీపై కేజ్రీచేసిన ఆరోపణలతో తోకలు ముడిచారు. పూర్తి సుగర్స్  సంస్థలో పెట్టిన పెట్టుబడులన్నీ పూర్తిగా బినామీలేనన్న సంగతి దేశం మొత్తానికీ తెలిసిపోవడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి.

హైదరాబాద్ లో మేల్ ప్రాస్టిట్యూట్ దందా

  హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం రాకెట్ మూడు పూలూ ఆరుకాయలుగా సాగుతోంది. డబ్బుపారేసి సుఖాన్ని కొనుక్కునే పురుష పుంగవుల స్థానంలో ఇప్పుడు మహిళలు కూడా పెరిగిపోయారు. అబ్బాయిలకు డబ్బులిచ్చి సుఖాన్ని కోరుకునే ఆడవాళ్ల సంఖ్య బాగా ఎక్కువై పోయింది. కాల్ బాయ్స్ సంస్కృతి రాజధానిలో విపరీతంగా పెరిగిపోతోంది.   గంటకో రేటు, పూటకో రేటు చొప్పున కాల్ బాయ్స్ చార్జ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కాల్ బాయ్స్ గా పనిచేస్తున్నవాళ్లలో ఎక్కువ శాతం మంది బాగా డబ్బున్నవాళ్ల పిల్లలే ఉండడం. సుఖానికి సుఖం, జల్సాలు చేసుకోవడానికి డబ్బుకూడా వస్తాయన్న ఆశతో కుర్రాళ్లు ఈ విష సంస్కృతికి అలవాటుపడుతున్నారు.   విషయం ఎక్కడా బైటికి పొక్కకుండా సీక్రెట్ గా ఉంచుతాడన్న నమ్మకాన్ని కలిగించగలిగిన కాల్ బాయ్స్ కి కాసులపంట పండుతోందని విచారణలో తేలింది. ఇంటర్ నెట్ లో సోషల్ సైట్స్, ఫ్రెండ్ నెట్ వర్క్ ల ఆధారంగా మేల్ ప్రాస్టిట్యూషన్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది.

అమెరికా కొత్త అధ్యక్షుడెవరు?

  అమెరికా అధ్యక్షుడిని ఎన్నికకు పోలింగ్ ఈ రోజు జరగబోతోంది. శ్వేత సౌధంలో ఎవరు పాగా వేస్తారన్న విషయం తేలిపోబోతోంది. ఒబామా, రోమ్నీ.. ఇద్దరూ పోటాపోటీగా గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. ఓటర్లని భారీ స్థాయిలో ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. యువతకి భారీగా ఉద్యోగాలిప్పిస్తానంటూ ఒబామా చేసిన ప్రామిస్.. ఆయనకు చాలా అనుకూలంగా మారింది. దీనివల్ల ఓటర్ల మద్దతు ఒబామాకి వెల్లువెత్తుతోంది.   బరాక్ ఒబామాకి బిల్ క్లింటన్ తోడుగా నిలిచి ప్రచారానికి మంచి ఊపు తెప్పించారు. రోమ్నీమాత్రం.. అమెరికా బాగుండాలంటే, నిజమైన మార్పు కావాలంటే నాకే ఓటేయండని అడుగుతున్నాడు. తాజా సర్వేల ప్రకారం రోమ్నీతో పోలిస్తే ఒబామాకే కాస్త మద్దతు ఎక్కువగా ఉంది కానీ.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇద్దరి మధ్యా హోరాహోరీ పోరు నడుస్తోంది.   శాండీ తుపాను ఓ రకంగా విలయాన్ని సృష్టించినా, మరో రకంగా ఒబామాకి మేలే చేసినట్టుకనిపిస్తోంది. తుపాను తర్వాత ఒబామా.. సహాయ చర్యల్ని చాలా సమర్ధంగా నిర్వహించారన్న మంచి పేరుకూడా వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశం కోసం ఆరుగురు భారతీయ సంతతికి చెందిన అభ్యర్ధులు పోటీపడుతున్నారు. వీళ్లలో ముగ్గురికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయ్.  

టెక్కీ నెరజాణ మాయాజాలం

బెంగళూరు శివారులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతదేహం దొరికింది. వంటి మీద గాయాలేం లేవు. పోలీసులు ఆత్మహత్యగా నమోదుచేసుకున్నారు. మృతుడి పేరు నితీష్.. వయసు 22 సంవత్సరాలు.. ఈ మధ్యే సౌమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. ఎక్కడో ఏదో కొట్టేస్తోందని పోలీసులకు అనుమానమొచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్నోడు ఆత్మహత్యెందుకు చేసుకుంటాడబ్బా అన్న అనుమానంతో తీగ లాగారు. మొత్తం విషయం బైటికొచ్చింది. ఏరికోరి ఫేస్ బుక్ లో ప్రేమాయణం నడిపించి చేసుకున్న ముద్దుల పెళ్లామే నితీష్ ప్రాణాలు చాకచక్యంగా తీసిందని తేలింది. పెళ్లైన కొత్తలోనే ఫేస్ బుక్ లో మాయ అనే మరో అమ్మాయితో నితీష్ కి పరిచయమయ్యింది. ఆమెని పిచ్చిపిచ్చిగా ప్రేమించేశాడు. అదెవత్తో దొరికితే నన్ను పట్టించుకోవడంలేదంటూ సౌమ్య నిలదీయడం మొదలుపెట్టింది. రెండు పక్కల్నుంచీ టార్చర్.. నితీష్ కి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది. ఓ రోజు.. నిన్ను కలవాలంటూ  సౌమ్య దగ్గర్నుంచి కాల్ వచ్చింది. వెతుక్కుంటూ సిటీ శివారుకెళ్లిన నితీష్ మళ్లీ తిరిగి రాలేదు.     మాయ సంగతి ఏం చేశావంటూ నిలదీసి, బీపీ పెంచిన సౌమ్య ఓ వోడ్కా బాటిల్ ని చేతికిచ్చింది. గడగడా తాగేసి పడిపోయాడు. ఎందుకంటే వోడ్కా సీసాలో ఉన్న విషం నితీష్ ప్రాణాలు తీసింది. సైకాలజీలో పీజీ చేసిన సౌమ్య మాయచేసి వోడ్కాలో సైనైడ్ కలిపి.. నితీష్ ప్రాణాలు తీసింది. కారణం.. పరాయి మగాడితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడమే.. నితీష్ తో పెళ్లయ్యాక సౌమ్యకి పాత బాయ్ ఫ్రెండ్స్ కలిశారు. పాత స్నేహాలు, శారీరక సంబంధాలు మళ్లీ చిగురించాయి. మొగుడ్ని తేలిగ్గా వదిలించుకునేందుకు ప్లాన్ చేసిన సౌమ్య మాయ అనే మాయపేరుతో ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుంది. మెల్లమెల్లగా తన మత్తులోకి దింపి నితీష్ ని పిచ్చివాణ్ని చేసింది. అటు మాయగా , ఇటు సౌమ్యగా నటిస్తూ మొగుడి మెదడుని బండకేసి బాదేసి పనికిరాకుండా చేసేసింది. వన్ ఫైన్ డే విషమిచ్చి చంపేసి చక్కా పోయింది. మొగుడికి విషమిచ్చి చంపిన క్రిమినల్ బ్రెయిన్ సౌమ్య, చాలా చిన్న పొరపాటువల్ల పోలీసులకు చిక్కింది. నితీష్ వోడ్కా తాగాక తన మూతిని టిష్యూ పేపర్ తో తుడిచి అక్కడ పారేసి పోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు టిష్యూ పేపర్ తో తాపీగా మూతి తుడుచుకోరుకదా.. అన్న అనుమానం పోలీసులకొచ్చింది. గట్టిగా ఆరా తీసేసరికి విషయం బైటపడింది.    

దోస్త్ మేరా దోస్త్

  రాజకీయాల్లో శత్రుత్వం, మిత్రత్వం శాశ్వతం కాదనే సత్యాన్ని ములాయం, అమర్ సింగ్ మరో సారి నిరూపించారు. కొత్తగా పుట్టిన శత్రుత్వాన్ని మర్చిపోయి మళ్లీ పాత మిత్రులుగా మారిపోవాలని నిర్ణయించుకున్నారు. భాయీ భాయీ అంటూ ఇద్దరూ చేయిచేయి కలిపేసరికి మళ్లీ పాతరోజులు గుర్తొచ్చాయ్. కొత్త స్నేహానికి గుర్తుగా, అమర్ సింగ్ పై పెట్టిన మనీ ల్యాండరింగ్ కేసుల్ని ములాయం వెనక్కి తీసుకున్నారు.   ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి. ములాయం జారీ చేసిన ఆదేశాల్ని అఖిలేష్ తో పాటు మొత్తం మంత్రులంతా శిరసావహించక తప్పదుమరి. రెండేళ్లక్రితం ములాయంతో అమర్ సింగ్ స్నేహానికి మిరియాలు పుట్టాయి. జయప్రదతోపాటు చాలామంది నేతలు అమర్ సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టిపోయారు. తర్వాత అమర్ ఆరోగ్యంకూడా బాగా దెబ్బతిన్న నేపధ్యంలో పాత స్నేహాన్ని పునరుద్ధరించుకోవడంవల్లే లాభం ఉంటుందని అమర్ సింగ్ భావించారు.

క్షీణిస్తున్న బాల్ థాక్రే ఆరోగ్యం

  శివసేన అధినేత బాల్ థాకరే ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. 86 సంవత్సరాల వయసున్న శివసేన సేనాని కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు.   కిందటి నెల 24వ తేదీన లీలావతీ ఆసుపత్రిలోకూడా బాల్ థాక్రే చికిత్స చేయించుకున్నారు. ఇంటికెళ్లాక తిరిగి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అప్పట్నుంచీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న దాఖలాలు కనిపించనేలేదు. మూడురోజులుగా ఆసుపత్రిలో ఉన్న బాల్ థాక్రే ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోంది. ప్రజా జీవితంనుంచి తాను రిటైరవుతున్నానని, కొడుకు ఉద్ధవ్ థాక్రేకి, మనవడు ఆదిత్య థాక్రేకి మద్దతివ్వాలని కార్యకర్తల్ని కోరుతూ ఆయన ఇచ్చిన ఓ సందేశాన్ని రికార్డ్ చేసి ఉంచారు.   శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాక్రే.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉన్నపళంగా పార్టీనేతలు సమావేశం కావడంపై ముంబైవాసుల్లో అనుమానం పెరుగుతోంది. బాబా గురించి ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని ఆందోళన అభిమానుల్లో ఎక్కువైపోతోంది.

యెడ్డీకి అగ్రనేతల బుజ్జగింపులు

  సొంతపార్టీమీద అలిగి వేరు కుంపటి పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పని బుజ్జగించేందుకు బిజెపి అధిష్ఠానం గట్టిగా ప్రయత్నిస్తోంది. యడ్యూరప్పకి ఎలా నచ్చజెప్పాలో ఆలోచించేందుకు కర్నాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, ఉపముఖ్యమంత్రి అశోక్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప ఢిల్లీలో ప్రథాన నేతలతో మంతనాలు జరిపారు. గడ్కరీ , రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడుకూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తను కొత్తపార్టీ పెట్టుకుంటానన్నాను తప్ప.. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పలేదంటూ యడ్యూరప్ప అధిష్ఠానానికి సున్నితంగా చురకలేస్తున్నారు. పార్టీ ప్రకటన నిర్ణయాన్ని కూడా ప్రస్తుతానికి యెడ్డీ పక్కన పెట్టారు కాబట్టి, ఆయనతో మాట్లాడేందుకు ఇదే మంచి సమయమని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మొత్తానికి యడ్యూరప్ప వేరు కుంపటి బిజెపి అగ్రనేతల్లో కదలికని తీసుకొచ్చిందని కర్నాటక బిజెపి నేతలు అనుకుంటున్నారు.

చైర్మన్ కీ, ఈవోకీ మధ్య కంకణం జగడం!

టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకీ ఈఓ ఎల్.వి.సుబ్రహ్మణ్యానికీ మధ్య పొరపొచ్చాలొచ్చాయని ఆలయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయ్. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేవేళ బంగారు వాకిలిదగ్గర ఈఓ కంకణధారణ చేయడం చాలాకాలంగా ఆనవాయితీ. కంకణ ధారణ చేసిననాటినుంచీ ఉత్సవాలు పూర్తయ్యేవరకూ ఊరి పొలిమేర దాటకూడదని నిమయంకూడా. ఈ నియమానికి కట్టుబడి ఉండలేమేమో అన్న అనుమానంతో గతంలో కొందరు ఈఓలు ఈ బాధ్యతను చైర్మన్ కి అప్పగించిన సందర్భాలుకూడా ఉన్నాయ్. కానీ.. ఈ సారి మాత్రం ఈఓ అలాంటి అప్పగింతలేవీ పెట్టకుండానే చైర్మన్ కనుమూరి బాపిరాజు బంగారు వాకిలి దగ్గరికొచ్చి కంకంణం కట్టించుకున్నారు. ఈఓ సుబ్రహ్మణ్యం మాత్రం అక్కడికి రాకపోవడం విశేషం. తనకు దక్కాల్సిన గౌరవాన్ని బాపిరాజు తన్నుకుపోతున్నరన్న ఉక్రోషంతో సుబ్రహ్మణ్యం కలిసిరాలేదన్నది కొందరు ఉద్యోగులు చెబుతున్న మాట. డాలర్ శేషాద్రితోపాటు ఇతర అధికారుల కోరిక మేరకే తాను కంకణ ధారణం చేశానని కనుమూరి బాపిరాజు చెబుతున్నారు. తిరుమలలో చైర్మన్.. ఫలఫుష్ప ప్రదర్శన శాలను, మీడియా సెంటర్ ని ప్రారంభించినప్పుడు ఈఓ సుబ్రహ్మణ్యం దరిదాపుల్లోకూడా కనిపించకపోవడం, ఇరువురికీ మధ్య విభేధాలు పెరుగుతున్నాయనడానికి సూచనని స్థానికులు అనుకుంటున్నారు.