పాపం కాంగ్రెస్ పార్టీ
posted on Mar 17, 2014 9:01AM
కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని, పార్టీ నేతల భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు కేసీఆర్ ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు కూడా అంగీకారించకపోవడంతో కాంగ్రెస్ పని కుడితిలో పడిన ఎలుకలా తయారయింది. సీమాంద్రాలో ఇప్పటికే దాదాపు తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్ర ప్రజల ఉసురే తగిలిందో లేక తన నేతల ఉసురు తగిలిందో గానీ ఇప్పుడు తెలంగాణాలో సైతం తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా పరవాలేదు కానీ ఆయన ఇప్పుడు బీజేపీతో పొత్తులకి సిద్దపడుతున్నరనే వార్తలు కాంగ్రెస్ అధిష్టానాన్ని చాలా కలవరపరుస్తోంది. తెలంగాణా ఏర్పాటు తరువాత తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కనీసం పొత్తులకు కూడా అంగీకరించకుండా, ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దానికే మద్దతు ఇస్తానని మరో కొత్త హామీ ఇస్తూనే, బీజేపీవైపు చూడటం గమనిస్తే ఆయన హామీ కేవలం కాంగ్రెస్ ని మభ్యపెట్టడానికేనని అర్ధం అవుతోంది. అంటే, కాంగ్రెస్ తెరాస మద్దతు పొందాలనుకొంటే, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తగినన్ని యంపీ సీట్లు మిగిలిన రాష్ట్రాల నుండి గెలుచుకోవలసి ఉంటుందన్నమాట! అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇకపై ఆంధ్ర, తెలంగాణాలలో యంపీ సీట్లు, తెరాస మద్దతు సంగతి పూర్తిగా పక్కనుబెట్టి తనకు ఇంకా పట్టు, బలం ఉన్నమిగిలిన రాష్ట్రాలోనయినా పరిస్థితులు చేయిదాటిపోకుండా జాగ్రత్త పడవలసి ఉంటుందన్న మాట.
ఒకవేళ బీజేపీ లోపాయికారిగా తెలంగాణాలో తెరాసతో, ఆంధ్రప్రదేశ్ లో తెదేపాతో ఎన్నికల పొత్తుల ఒప్పందాలు గానీ చేసుకొన్నట్లయితే ఇక కాంగ్రెస్ ఖాతా నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 52 యంపీ సీట్లు కూడా జారిపోయినట్లే భావించవచ్చును. అదే జరిగితే, కేంద్రంలో యూపీయే కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే కలలు పగటికలలుగానే మిగిలిపోవడం తధ్యం. ఒకవేళ బీజేపీ తెరాసతో కాక, తెలంగాణాలో కూడా తెదేపాతోనే పొత్తులు పెట్టుకొన్నా, అసలు ఎవరితో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా బీజేపీ, తెదేపా, తెలంగాణా సెంటిమెంటుతో విజయోత్సాహంతో దూసుకుపోతున్న తెరాసను ఎదుర్కొని నిలవడం కష్టం.
నిజానికి సాధారణ పరిస్థితుల్లో అయితే సిటింగ్ టీ-కాంగ్రెస్ యంపీలను ఇతర పార్టీలు ఓడించడం చాలా కష్టం, కానీ ఇప్పుడు కాదు. అయితే వారు నేటికీ తమ పార్టీయే తెలంగాణా ఇచ్చింది గనుక ప్రజలు తమకే ఓటేస్తారని అధిష్టానానికి నమ్మబలుకుతూ, ఆత్మవంచన కూడా చేసుకొంటున్నారు. అయితే కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది గనుక, గత పదేళ్ళలో అది తెలంగాణా ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుని, బయటపడిన కుంభకోణాలను, దాని అసమర్ధ పాలన, అవినీతిని తెలంగాణా ప్రజలు పట్టించుకోరని, మోడీ ప్రభావానికిలోనుకారని కాంగ్రెస్ అధిష్టానం, టీ-కాంగ్రెస్ నేతలు భావించడం తెలివితక్కువతనమే. అయితే ఇక ఇప్పుడు ‘కాంగ్రెస్ చేతులు’ కాలాక ఆకులు పట్టుకొన్నా ప్రయోజనమేమీ లేదు. గనుక, మొండిగా ఎన్నికల యుద్దరంగంలో దిగి తలపడాల్సిందే. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలనే తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం తన ఆంధ్ర, తెలంగాణా నేతల భవిష్యత్తును బుగ్గిపాలు చేసి తద్వారా చివరికి తనను బలిచేసుకోవడం చూస్తే పాపం జాలేస్తుంది.