పొత్తులపై పెదవి విప్పలేని కిరణ్, చంద్రబాబు
posted on Mar 14, 2014 8:13AM
మొన్న చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలలో ఇద్దరూ కూడా జాతీయ స్థాయిలో తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటారో లేదా ఎన్నికల తరువాత కేంద్రంలో ఏ కూటమికి మద్దతు ఇస్తారనే విషయం చెప్పకుండా దాటవేశారు.
బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు ఆ పార్టీ సీమాంధ్రకు ప్యాకేజీ సాధించడం గురించి రెండు పదాలు మాట్లాడి ముగించేసారు. తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన బీజేపీ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడితే సభలో ఉద్రిక్తతలు ఏర్పడి సభ రసాభాసగా మారే ప్రమాదం ఉంది. అందుకే బీజేపీతో పొత్తుల ప్రసక్తి తేకుండా దాటవేశారు. బీజేపీపై ఆగ్రహంగా ఉన్నసీమంద్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే బాధ్యత బీజేపీది, నరేంద్ర మోడీదే తప్ప చంద్రబాబుది కాదు. నరేంద్ర మోడీ తన తొలి పర్యటనలో సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకొని వారిని ప్రసన్నం చేసుకోగలిగితే, ఆ పార్టీతో పొత్తులకు చంద్రబాబు సిద్దపడతారు. అప్పుడే ఆయన ఆ పార్టీ గురించి ఇటువంటి బహిరంగ సభలలో మాట్లాడే అవకాశం ఉంటుంది. మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ తప్పకుండా సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకొంటారు గనుక, తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కూడా దాదాపు ఖాయమనే భావించవచ్చును. అందువల్ల తదుపరి సభలలో చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసి గర్జించినా ఆశ్చర్యం లేదు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలో నడిచే యూపీఏ కూటమితో చేతులు కలుపుతానని చెప్పే దుస్సాహసం చేయలేదు. చేస్తే ఆ పార్టీ ఆత్మహత్య చేసుకొన్నట్లే అవుతుంది. ఇక కిరణ్ సమైక్యవాదమనే పునాది మీద తన పార్టీని నిర్మించుకొన్నారు గనుక రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీతో కూడా ఆయన పొత్తులు పెట్టుకోలేరు, కనీసం మద్దతు ఇస్తానని కూడా హామీ ఇవ్వలేరు. వామపక్షాలు ఎంతో కష్టపడి థర్డ్ ఫ్రంట్ నిర్మిస్తే, అందులో అరడజనుకు పైగా ఉన్న ప్రధాని అభ్యర్ధులందరూ కలిసి దానినొక కప్పల తక్కెడగా మార్చేయడంతో, అది ఉన్నా లేనట్టే తయారయింది. అందువల్ల జాతీయ స్థాయిలో యూపీఏ, ఎన్డీయే కూటములకు సరయిన ప్రత్యామ్నాయం లేదు గనుక కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడలేని అసక్తతలో ఉన్నారు.
ప్రస్తుతానికి ఆయన స్వంత కుంపటి పెట్టుకొని వేరుగా వండుకొంటున్నపటికీ, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీతోనే పంక్తి భోజనానికి సిద్దమయిపోతారనే విషయంలో అనుమానం లేదు. ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన తన సమైక్య పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఐక్యం చేయడంలో ఆలస్యమయినట్లయితే, దాని నేతృత్వంలో నడుస్తున్న యూపీఏ కూటమికే ఆయన మద్దతు పలుకుతారు తప్ప బీజేపీ కాదు. అందుకు సోనియా గాంధీ అనుమతించదు కూడా! అందువల్ల ఈ పరిస్థితుల్లో ఆయన యూపీఏ, ఎన్డీయే కూటములతో పొత్తులు, మద్దతు గురించి పెదవి విప్పితే అది ఆయన పార్టీకే చేటు కనుక మాట్లాడలేరు. అయితే అంతవరకు కూడా ప్రజలను ఆకట్టుకొని ఓట్లు దండుకోనేందుకు జగన్మోహన్ రెడ్డి లాగే ఆయన కూడా కాంగ్రెస్, బీజేపీలను తీవ్రంగా విమర్శిస్తూనే ఉంటారు.