ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన పవన్ ప్రసంగం
posted on Mar 14, 2014 @ 11:57PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన ప్రసంగంలో కొంచెం నాటకీయత ఉన్నపటికీ, రాజకీయ మూస ప్రసంగాలకు పూర్తి భిన్నంగా, సగటు భారతీయ పౌరుడి ఆలోచనలకీ,ఆవేశానికీ,ఆవేదనకీ, ఆక్రోశానికి అద్దం పడుతున్నట్లు సాగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల ముందు తను తాను పూర్తిగా ఆవిష్కరించుకొన్నారని చెప్పవచ్చును. ఆయన మాటలు హృదయంలో నుండి వచ్చినవి. మనస్పూర్తిగా మాట్లాడినవి. కనుక అవి అభిమానులకు, ప్రజలకు సరిగ్గానే చేరాయని భావించవచ్చును. ఆంధ్ర, తెలంగాణా, రాష్ట్ర విభజన, హిందూ ముస్లిం, కులాలతో సహా ఏ రాజకీయ నాయకుడు దైర్యం చేసి మాట్లాడలేని అనేక సున్నితమైన అంశాల గురించి పవన్ కళ్యాణ్ మనసు తెరిచి మాట్లాడి నిజంగానే మంచి దమ్మున్న రాజకీయ పవర్ స్టార్ అనిపించుకొన్నారు.
తను రాజకీయ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసి కొందరు కాపు కుల సంఘ నేతలు తనకు మద్దతు ఈయమని చెప్పడాన్ని ఆయన చాలా గాటుగా ఎవరూ ఊహించని రీతిలో ప్రశ్నించారు. “నన్ను నేను ఏ కులానికో, మతానికో చెందిన వాడినని ఎన్నడూ భావించలేదు. అయినా నేను వారిని మద్దతు ఈయమని అడిగానా? కులాల పేరు చెప్పుకొని ఓట్లు అడుకోవలసి వస్తే నేను అసలు రాజకీయాలలోకి వచ్చే వాడినే కాను,” అని అన్నారు.
రాష్ట్ర విభజన చేయడంలో కాంగ్రెస్ కబరచిన నిర్లక్ష్య ధోరణిని, తెలుగు ప్రజల పట్ల ప్రదర్శించిన చులకన భావాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎండగట్టారు. గత పదేళ్ళుసాగుతున్నతెలంగాణా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసినందున అనేక వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర విభజన చేసిన తీరుని తీవ్రంగా విమర్శించారు. అటు తెలంగాణా ప్రజలకీ ఆనందం కలిగించక, ఇటు సీమాంధ్ర ప్రజలకు ఆనందం కలిగించని విధంగా విభజన చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకొందని విమర్శించారు.
కాంగ్రెస్ అధిష్టానంలో చిదంబరం, జైరామ్, షిండే, అహ్మద్ పటేల్, మోయిలీ తదితరులు తెలుగు ప్రజల పట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరిని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో మన రాష్ట్ర నాయకులందరూ వ్యవహరించిన తీరు చూసి తనకు చాలా అసహ్యం కలిగిందని, వారి మీద కోపంతోనే రాజకీయ ప్రవేశం చేయవలసి వచ్చిందని ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలుగా విడిపోతున్న తెలుగు ప్రజలను ఈ కపట రాజకీయ నాయకుల బారి నుండి కాపాడేందుకే పార్టీ పెట్టానని ఆయన అన్నారు.
తన పార్టీలో రాజకీయ బఫూన్లకు, జంప్ జిలానీలకు చోటు కల్పించనని స్పష్టం చేసారు. దేశ సమగ్రత, రాజకీయాలలో మంచి మార్పు తేవాలనే తపన ఉన్నవారేవరయినా జనసేనలోకి ఆహ్వానితులేనని తెలిపారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనుకొంటున్న రాహుల్ గాంధీ ముందుగా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో తన నాయనమ్మ ఇందిరా గాంధీ నుండి నేర్చుకోమని సలహా ఇచ్చారు. ప్రజల మధ్య కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ చిచ్చుపెడుతూ అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
ఒక్క కాంగ్రెస్ పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో అయినా తాను చేతులు కలిపేందుకు సిద్దమని ఆయన ప్రకటించారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ నిర్మాణం మొదలు పెడతానని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆయన ప్రజలు ఆశిస్తున్న మహిళకు భద్రత, మెరుగయిన వైద్య సేవలు, జవాబుదారీ గల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, స్వచ్చమయిన పాలన అందించడం తన పార్టీ లక్ష్యాలుగా చెప్పుకొన్నారు.