బాలకృష్ణ ఎక్కడి నుండి దేనికి పోటీ చేస్తే మంచిది?
posted on Mar 12, 2014 @ 11:48AM
ఇటీవల బాలకృష్ణ అభిమానులు ఆయనకి పార్టీలో తగిన హోదా కల్పించి ఆయనకు వెంటనే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అదునుగా మీడియాలో ఒక వర్గం బాలకృష్ణకు చంద్రబాబుకి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, అందుకే ఆయనని లిజండ్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించలేదని ప్రచారం చేయడంతో బాలకృష్ణ స్వయంగా కలుగజేసుకొని తమ మధ్య ఎటువంటి అభిప్రాయ బేధాలులేవని ప్రకటించవలసి వచ్చింది.
అయితే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళడంతో ఆయన కూడా స్పందిస్తూ “ఆయన (బాలకృష్ణ) కి టికెట్ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆయన యంపీ లేదా యం.యల్యే. స్థానాలలో దేనికి పోటీ చేస్తానన్నా టికెట్స్ ఇస్తాను. దేనికి పోటీ చేయాలో ఆయనే నిర్ణయించుకోవాలి. ఆయన సేవలు పార్టీకి అత్యవసరం. ఆయనకు పార్టీలో ఎప్పుడు కూడా సముచిత స్థానం గౌరవం ఉంటుంది,” అని అన్నారు.
ఇదివరకొకసారి బాలకృష్ణ తాను కృష్ణా జిల్లా నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. కానీ, ఆ తరువాత మళ్ళీ ఆ ప్రసక్తి తేకపోవడంతో, ఆయన అభిమానులు కలవరపడి ఉండవచ్చును. ఒకవైపు కాంగ్రెస్ నుండి గుంపులు గుంపులుగా పార్టీలోకి వచ్చిపడుతున్న నేతలు కొన్ని టికెట్స్ ఎగరేసుకొని పోతుంటే, ఒకవేళ బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నట్లయితే ఆ పార్టీకి మరికొన్నిటికెట్స్ పంచి ఇవ్వవలసి ఉంటుంది. ఇక పార్టీలో ఉన్ననేతలకీ, వారు రికమండ్ చేసే వారి బంధు మిత్ర, పుత్ర కోటికీ కూడా టికెట్స్ పంచుకుపోతే చివరికి తమ అభిమాన నటుడు బాలయ్య బాబుకి టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అనే ఆందోళన చేతనే వారు ఆవిధంగా డిమాండ్ చేసి ఉండవచ్చును.
అయితే బాలకృష్ణ స్వయంగా ఎన్నికలలో పోటీ చేస్తానని చెపితే అది తేదేపాకు లబ్ది చేకూరుస్తుందే తప్ప నష్టం కలిగించదు. ఆసంగతి చంద్రబాబుకే కాదు బాలయ్య అభిమానులకీ తెలుసు. అందువలన ఆయన వద్దనుకొంటే తప్ప ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అయితే, ఆయన శాసనసభకు పోటీ చేయడం మంచిదా లేక లోక్ సభకు చేయడం మంచిదా? అని ఆలోచిస్తే శాసనసభకు పోటీ చేయడమే ఆయనకు, పార్టీకి కూడా మంచిదని చెప్పవచ్చును. ఎందుకంటే, ఉత్తరాదివారితో నిండి ఉన్న లోక్ సభలో నెగ్గుకురావాలంటే అనర్గళంగా హిందీ, ఇంగ్లీషు బాషలలో ప్రసంగించే నేర్పు, రాష్ట్ర, దేశ రాజకీయలపై మంచి పట్టు చాలా అవసరం. లేకుంటే చాలా ఇబ్బంది పడక తప్పదు. ఇటీవల ఆయన సోదరుడు హరికృష్ణ రాజ్యసభలో తన అభిప్రాయాలను చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అదే ఆయన శాసనసభకు పోటీ చేసినట్లయితే దానివల్ల ఆయనకు, పార్టీకి కూడా చాల ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించే అవకాశము కలుగుతుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి తదితరులు ఈ సారి ఎన్నికలలో చక్రం తిప్పేందుకు సిద్దం అవుతున్నందున, బాలకృష్ణ కూడా తెదేపా తరపున శాసన సభకు పోటీ చేయడమే ఉత్తమం.
ఇక ఆయన ఎక్కడి నుండి పోటీ చేయాలని ఆలోచిస్తే ఎవరైనా కృష్ణా జిల్లా నుండో లేదా హిందూపూర్ నుండో చేయాలని చెప్తారు. కానీ ఆయన తెదేపా పటిష్టంగా ఆ రెండు ప్రాంతాల నుండి గాకుండా శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూల్ లేదా ప్రకాశం జిల్లాలో ఏదో ఒక చోట నుండి పోటీ చేయడం వలన అక్కడ పార్టీ బలపడటమే కాకుండా ఆయనకీ, పార్టీకి కూడా చాలా ప్రయోజనం కలుగుతుంది.
ఇక ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి గురించి అభిమానులు కోరేముందు పార్టీ పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది. త్వరలో తెదేపా ఆంధ్ర తెలంగాణా శాఖలను ఏర్పాటు చేసినప్పుడు, చంద్రబాబు రెంటికీ కలిపి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అప్పుడు ఆంద్ర, తెలంగాణా శాఖలకు తప్పనిసరిగా తన స్థానంలో కొత్త అధ్యక్షులను నియమించవలసి ఉంటుంది. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలలో బాగా ఆరితేరిన వ్యక్తి మాత్రమే పార్టీని ఒక్క త్రాటిపై నడిపిస్తూ ప్రతిపక్షాలను ఎదుర్కొని నిలవగలరు. పైగా నేటికీ బాలకృష్ణ తన సినిమాలపైనే ఇంకా దృష్టి లగ్నం చేసి ఉన్నందున, ఆయన అభిమానులు ఆయనకి పార్టీలో కీలకమయిన బాధ్యతలు ఆశించడం వలన ఆయన రెంటికీ న్యాయం చేయడం కష్టమవుతుంది.
ఇటువంటి కీలకమైన, క్లిష్ట పరిస్థితుల్లో బాలకృష్ణ అభిమానులు ఆయనకు పార్టీ అధ్యక్షపదవి గురించి వివాదం రేపితే అది ఆయనకీ, పార్టీకి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అదును కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ఒక చక్కటి ఆయుధం అందించినట్లవుతుంది. అందువల్ల వారు ప్రస్తుతం తమ అభిమాన సింహాన్ని ఎక్కడి నుండి ఏ స్థానానికి పోటీ చేస్తే మంచిదో అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఆయనకీ, పార్టీకి కూడా మేలు చేకూర్చినవారవుతారు.