కాంగ్రెస్, తెదేపా, తెరాస మరియు ఓ దళిత ముఖ్యమంత్రి
posted on Mar 11, 2014 @ 11:19AM
ఇంతవరకు తెలంగాణా అంశంతో దూసుకుపోతున్న కేసీఆర్, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి పదవీ రెండూ ఎగురేసుకుపోయెందుకు సిద్దం అవుతుండటంతో, ఇప్పుడు కాంగ్రెస్ అనధికార రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ లా వ్యవహరిస్తున్న జైరామ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే దళితుడుని తెలంగాణాకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించేశారు. తెలంగాణా అంశంతో తీవ్రంగా నష్టపోయిన తెదేపాను బ్రతికించుకోవడానికి చంద్రబాబు కూడా తెదేపా గెలిస్తే బీసీకి చెందిన వ్యక్తిని తెలంగాణాకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణా ఏర్పడితే దళితుడని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు తానే ముఖ్యమంత్రి కావాలని తన అనుచరులచేత డిమాండ్ చేయిస్తుండటంతో, ఆయనను ఇరుకున బెట్టేందుకు వారిరువురూ ఆవిధంగా ప్రకటించారు.
ఒకవేళ కేసీఆర్ వీరి దెబ్బకు వెనక్కి తగ్గినట్లయితే, ఆయనకే కాదు ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా మొట్ట మొదట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా పోతుంది. అదే జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ఓ డజను మంది ఏవిధంగా కీచులాడుకొంటున్నారో, అదేవిధంగా తెరాసలో ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాటలు మొదలవవచ్చును. ఇక తెలంగాణాలో అధిక శాతం వెనుకబడిన ప్రజలే ఉన్నందున, వారిని కాదని ఉన్నత వర్గానికి చెందిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అధికారం చెప్పట్టనీయకుండా వారిపై ఆయా వర్గాల నుండి ఒత్తిడి తెచ్చేందుకు కూడా కాంగ్రెస్, తెదేపాల ఈ వ్యూహం పనిచేస్తుంది. ఒకవేళ కేసీఆర్ మొండిగా తాను, తన కుటుంబసభ్యులే అధికారం చేపడదామని ప్రయత్నిస్తే, కాంగ్రెస్, తెదేపాలు యస్సీ, బీస్సీలకు పెద్దపీట వేస్తామని చెపుతున్నందున ఆయ వర్గాలు తమవైపే ఆకర్షితులవుతారని భావిస్తున్నాయి.
అయితే, టీ-కాంగ్రెస్ లో అనేకమంది ఇతర వర్గాలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకొని ఉన్నదున, వారందరూ కలిసి జైరామ్ రమేష్ చేతనే దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం ప్రకటన వెనక్కి తీసుకొనేలా చేసారు గనుక, అది తేదేపాకు సానుకూలంగా మారింది. తెదేపాలో అగ్ర కులాలతో బాటు బీసీలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ కాంగ్రెస్, తెరాసలు ఈసారి పదవులు, టికెట్స్ పంపిణీలో అగ్రకులాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే, తెలంగాణా జనాభాలో అధిక శాతం ఉన్నబీసీలకు తెదేపా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలంగాణాలో మళ్ళీ బలం పుంజుకోగలదని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ తెదేపా-బీజేపీల మధ్య పొత్తులు కూడా ఖరారయినట్లయితే, తెలంగాణాలో మంచి క్యాడర్ బలం ఉన్న ఆ రెండు పార్టీలు ఒక బలీయమయిన శక్తిగా అవతరించవచ్చును.
కానీ, అపర చాణుక్యుడుగా పేరొందిన కేసీఆర్, త్వరలోనే వీరి ఎత్తులకు పైఎత్తులు వేసి అవలీలగా ఈ సమస్య నుండి బయటపడటం తధ్యం. బహుశః ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకొని అటు కాంగ్రెస్, ఇటు తెదేపాలను ఒకేసారి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారేమో? కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు మొదటి నుండి తెదేపాతో పొత్తులను వ్యతిరేఖిస్తున్నారు గనుక ఒకవేళ తెరాస పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఎగిరిగెంతేసి దాని ఒళ్ళో వాలిపోవచ్చును. బీజేపీ కూడా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత శక్తి, ఆసక్తి లేనందున, తెరాస-బీజేపీల మధ్య పొత్తులు కుదరడం కూడా తేలికే. అప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపాలు బలహీనపడవచ్చును. కానీ కేసీఆర్ ముందు తన దళిత ముఖ్యమంత్రి వాగ్దానాన్ని తెలివిగా ఏవిధంగా గట్టున పెడతారో చూడాలి. బహుశః ఆ వర్గానికి చెందిన వారికి వరాలు, హామీలు గుప్పించి వారి చేతనే తనే ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండ్ చేయించుకొంటారేమో!