రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి?
ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కనుక పత్రికలలో ‘అస్త్రశ్రస్తాలు సిద్దం చేసుకొంటున్న ప్రతిపక్షాలు’, ‘ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాల వ్యూహరచన’, ‘ప్రతిపక్షాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అధికారపార్టీ సమాలోచనలు’ వంటి హెడ్డింగులతో వార్తలు కనబడుతుంటాయి. ఇటువంటి వార్తలు చూసి అసలు అసెంబ్లీ సమావేశాలు దేనికి నిర్వహిస్తారు? అనే ధర్మ సందేహం చాలా మందికి కలుగుతుంది.
చట్టసభలలో చట్టాలు చేస్తారని, ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొంటారని ప్రజలు అపోహ చెందుతుంటారు. కానీ వివిధ పార్టీలకి చెందిన ప్రజాప్రతినిధులు వారి అపోహలు దూరం చేస్తారు. లక్షలు ఖర్చు చేసి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలలో ఒక పార్టీపై మరొకటి పైచేయి సాధించడమే ప్రధానమని, అందుకోసం ఒకరినొకరు దూషించుకోవడం, నినాదాలు చేయడం, అలిసిపోతే వాకవుట్ చేయడం వంటివి తప్పనిసరి అని చాటిచెపుతారు. అధికార పార్టీ చేసిన నిర్ణయాలను విమర్శించడం, మీడియా ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడమే నిర్మాణాత్మకమయిన ప్రతిపక్ష పాత్ర పోషించడం అని ప్రతిపక్షాలు భావిస్తే, వారి విమర్శలను త్రిప్పికొడుతూ, వారిని సభ నుండి సస్పెండ్ చేసో లేక వారు వాకవుట్ చేసినపుడో కీలకమయిన నిర్ణయాలు, బిల్లులపై ఎటువంటి చర్చ లేకుండా సభ చేత ‘మమ’ అనిపించేయడమే మంచి పద్ధతి అని అధికారపార్టీ భావిస్తుంది. ఈరోజు నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలో ఈ అద్భుత సన్నివేశాలన్నీ మరొకమారు ప్రజలందరూ తమ కళ్ళారా తిలకించే అవకాశం దక్కబోతోంది.
వ్యవసాయ ఋణాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, శనివారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత నుండి తాము ఆ పని మీదనే ఉంటామని ఇప్పటికే స్పష్టం చేసారు. తెదేపా చేసిన ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేసేవరకు తమ పోరాటం సాగిస్తామని యుద్ద ప్రకటన చేసేసారు.కానీ ఇప్పుడు ప్రజలు కోరుకొంతున్నది యుద్ధం కాదు. సహకారం, తద్వారా సత్వర అభివృద్ధి అని గ్రహిస్తే మేలు.
రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని గాలికొదిలేసి చట్టసభలలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరనే సంగతి వారు గుర్తుంచుకొని మెలగాలి.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ, “గతం తాలూకు మన చేదు, తీపి జ్ఞాపకాలను ఇక వదిలి పెడదాము. మనందరం వివిధ పార్టీల ప్రతినిధులుగా కాక కేవలం ప్రజాప్రతినిధులుగా మాత్రమే ఇక్కడ కూర్చోన్నమనే విషయం సదా గుర్తుంచుకొని, మన పార్టీలను, భేషజాలను అన్నిటినీ పక్కన బెట్టి దేశాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలూ హర్షిస్తారు,” అని అన్నారు. ఇది అక్షరాల మన అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకి కూడా వర్తిస్తుంది.
ప్రస్తుతం మన రాష్ట్రం అత్యంత దయనీయ స్థితిలో చిక్కుకొని విలవిలలాడుతోంది. కనుక అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. ఆర్ధిక లోటును ఏవిధంగా అధిగమించవచ్చు? పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, విద్యా, వైద్య సంస్థలు వంటివాటిని ఏ ఏ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి? వాటిని రాష్ట్రానికి రప్పించడంలో తాము ఏవిధంగా కృషి చేయగలము? అని సానుకూల దృక్పధంతో ఆలోచనలు చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణం, కొత్త రాజధాని ఏర్పాటుపై శాసనసభలో అర్ధవంతమయిన చర్చలు చేసి, తద్వారా ప్రజాప్రతినిధులు అందరూ తమతమ నియోజక వర్గాల అభివృద్ధికి గట్టిగా కృషిచేసినట్లయితే ప్రజలు హర్షిస్తారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర పునర్నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, కొత్త రాజధాని కోసం తపిస్తున్నారు. తమవంతు పాత్ర పోషించేదుకు సిద్దంగా ఉన్నారు. అటువంటప్పుడు ప్రజా ప్రతినిధులు కూడా అంతే బాధ్యతగా, నిబద్దతగా కృషిచేయాలి. ఎంతసేపు ప్రజలను త్యాగాలను చేయమని కోరే ప్రజాప్రతినిధులు తాము ఎటువంటి గొప్ప త్యాగాలు చేయకపోయినా కనీసం బాధ్యతగా వ్యవహరిస్తే చాలని ప్రజలు కోరుకొంటున్నారు. కానీ అలాకాక ప్రజాధనంతో సకల రాజభోగాలు అనుభవిస్తూ షరా మామూలుగా నికృష్ట రాజకీయాలకే పరిమితమయినట్లయితే, చైతన్యవంతులయిన ఆంద్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్లే వారికి కూడా తప్పకుండా బుద్ధి చెపుతారు.