చిరంజీవి శల్యసారధ్యంతో కాంగ్రెస్ ఖతం?
posted on Mar 22, 2014 @ 2:38PM
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రధసారధిగా కీలక భాద్యతలు భుజానికెత్తుకొన్న చిరంజీవి గురించి మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి ఒక చక్కటి మాట అన్నారు. చిరంజీవి మంచి నటుడే కానీ, ఇప్పుడు ప్రచారంలో ఒక హాస్యనటుడిగా మారిపోయాడని, సరయిన రాజకీయ అవగాహనా లేకుండా అసందర్భంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రాలో బస్సు యాత్ర చేస్తున్న చిరంజీవి మాట్లాడిన మాటలు విన్నట్లయితే ఆయన గురించి కిరణ్ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమేనని ఎవరయినా అంగీకరిస్తారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్నాయి. రాష్ట్రాన్ని విభజించి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్ పార్టీయే...అని కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కేవలం కాంగ్రెస్ ఒక్కటే ఈ తప్పు చేయలేదు. అన్ని పార్టీలు తప్పు చేసాయి,” అని అన్నారు.
స్క్రిప్ట్ ప్రకారం చిలకలా డైలాగ్స్ చెప్పడం అలవాటయిన చిరంజీవికి, ఇప్పుడు చేతిలో సరయిన స్క్రిప్ట్ లేకపోవడంతో ఆ తడబాటులో ఆయనే స్వయంగా తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని విభజించి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిందని చెప్పుకొన్నారు. ఆ తరువాత నాలుక కరుచుకొని అలాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని సర్ది చెప్పుకోవడం చూస్తే జాలేస్తుంది.
తమ సోనియమ్మే తెలంగాణా ‘వరం’ ప్రసాదించిన దేవత అని అక్కడ టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొని ప్రజలను తమ వైపు త్రిప్పుకోనేందుకు ముప్పు తిప్పలు పడుతుంటే, ఇక్కడ చిరంజీవి బండి మీదకి ఎక్కి మైకు పట్టుకొని మరీ ‘తెలంగాణా ఏర్పాటు చేయడం ఒక పెద్ద తప్పు’ అని గొంతు చించుకొంటున్నారు. టీ-కాంగ్రెస్ నేతలతో కత్తులు దూస్తున్న తెరాస నేతలు రేపు ఇవే మాటలు పట్టుకొని వారిపై ఎదురు దాడి చేస్తే ఎలా ఉంటుందో పాపం చిరంజీవికి తెలియదు.
“రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని అందరూ అంటున్నారు. కానీ అది నిజం కాదు. కిరణ్ కుమార్ రెడ్డే దానిని హత్య చేసారు. (అంటే కాంగ్రెస్ చచ్చిపోయిందని ఆయనే అంగీకరిస్తున్నారాన్నమాట!) ఆయనే విభజనకు అన్నివిధాల మా అధిష్టానానికి సహకరించారు. కానీ ఆయన మా అందరినీ ఈ వ్యవహారంలో చివరివరకు మోసపుచ్చుతూనే ఉన్నారు. (అంతకు ముందు ‘విభజన పాపం అందరిదీ’ అని బల్ల గుద్ది మరీ చెప్పిన చిరంజీవి, ఆ మరుక్షణమే తమ అధిష్టానమే విభజన చేసిందని దానికి కిరణ్ కుమార్ రెడ్డి సహకరించారని చెప్పడం చూస్తే ఆయనకు ఇంకా సరయిన రాజకీయ అవగాహన, పరిణతి లేదని స్పష్టమవుతోంది.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీని చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిపుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం పార్టీలో పదవులు, గౌరవం పొందిన కొందరు నేతలు ఇతర పార్టీల నేతల మోచేతి నీళ్ళు త్రాగేందుకు సిద్దపడి వెళ్ళిపోతున్నారు. వారందరూ ద్రోహులు. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి” అని అన్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది గనుకనే దానిని రక్షించమని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఆ బాధ్యత కట్టబెట్టి పంపింది. కానీ, ఆయన ఊరూరు తిరుగుతూ పదేపదే తమ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పనిగట్టుకొని టాంటాం చేయడం చూస్తే ఆయన పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నారా? అనే అనుమానం కలుగక మానదు. రాజకీయ పరిణతి కలిగిన ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఈవిధంగా మాట్లాడడు.
కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో రాహుల్ గాంధీ శల్యసారధ్యం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి శల్యసారధ్యం చేస్తున్నారు. మరిక కాంగ్రెస్ పార్టీకి వెనక్కి తిరిగి చూసుకొనే పనే ఉండదు.