రెండువైపులా జంపింగ్.. జపాంగ్
posted on Mar 18, 2014 @ 10:30AM
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించడంతో పాటు ఇకపై ఎవరు ఏ పార్టీలో చేరతారో చూద్దామంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విసిరిన సవాలు.. ఆ రెండు పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ పార్టీ నుంచి ఎదుటి పార్టీకి వెళతారనుకున్న వారిని బుజ్జగిస్తూనే.. తెలంగాణ జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నేతల మద్దతు కూడగట్టేందుకూ టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే.. ఈ ప్రాంతంలోని ఇతర పార్టీలతో పొత్తులపైనా దృష్టిపెట్టారు. దీంతో పార్టీ నుంచి ఇక ఎవరూ టీఆర్‌ఎస్‌లో చేరకుండా కాపాడుకోవడమే కాకుండా.. తెలంగాణ వాదులను పార్టీలో చేర్పించుకోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తలకుమించిన భారంగా మారింది. మరోవైపు సవాలు విసిరిన కేసీఆర్ సైతం తమ పార్టీలో చేరికలు ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళతారనుకునే నేతల జాబితాను రూపొందించి మరీ వారితో సంప్రదింపులు, బుజ్జగింపులు ప్రారంభించారు. మెదక్ జిల్లా పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రంగంలోకి దిగారు. సోమవారం నందీశ్వర్‌గౌడ్‌ను పిలిచి పార్టీని వీడొద్దని, కాంగ్రెస్‌లో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు.నందీశ్వర్ గౌడ్ రెండు రోజుల కిందట కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చించారు. ఈ విషయం తెలిసి పొన్నాల, డీఎస్ తదితరులు నందీశ్వర్‌గౌడ్‌ను పిలిచి బుజ్జగించడమే కాకుండా దామోదరతో పాటు నేరుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి నందీశ్వర్‌గౌడ్‌కు ఫోన్ చేయించారు. దాంతో నందీశ్వర్ మెత్తబడ్డారు.
మరోవైపు.. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన టీఆర్‌ఎస్ నేత ఇబ్రహీంతో కాంగ్రెస్ పెద్దలు పార్టీలో చేర్పించుకోవడానికి సంప్రదింపులు ప్రారంభించారు. ఇబ్రహీం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. టీఆర్‌ఎస్‌తో విభేదిస్తున్న తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాల నేతలను కూడా కాంగ్రెస్‌లోకి రప్పించే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతంను, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను తాజాగా పార్టీలో చేర్చుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ను పార్టీలోకి రాకుండా అడ్డుకోవడంతో టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌లో పేరున్న నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ పోటీచేయబోతున్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై ముందుగా దృష్టి సారించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ఒకరు మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో గట్టి ప్రాబల్యమున్న మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.