తెరాస ఒంటరి పోరాటానికి కేసీఆర్ లైన్ క్లియర్
posted on Mar 16, 2014 7:19AM
ఊహించినట్లే కాంగ్రెస్-తెరాసలు పొత్తుల బాధ నుండి కూడా విముక్తి చెందాయి. నిన్నటి ఆ ప్రేమలు, కౌగిలింతలను అప్పుడే మరిచిపోయి, ఆగర్భ శత్రువుల్లా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటున్నారు. కానీ, ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే దానికే మద్దతు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం విచిత్రం. అయితే, ఒకవేళ కేంద్రంలో బీజేపీ రాలేకపోతే కాంగ్రేసే అధికారంలోకి రావడం సహజం. గనుకనే కేసీఆర్ ఆవిధంగా హామీ ఇచ్చారుతప్ప కాంగ్రెస్ పై ప్రేమతో కాదు.
ఇక, కాంగ్రెస్ పార్టీతో అన్నిబంధాలు తెంచేసుకోవడం కూడా పూర్తయిపోయింది గనుక, ఇక తెలంగాణాలో తమ పార్టీయే అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ మూడు వేర్వేరు వ్యూహాలు అప్పుడే ప్రకటించేశారు కూడా. 1. తెలంగాణా సెంటిమెంటుని మళ్ళీ పతాక స్థాయికి తీసుకువెళ్ళడం. 2. కాంగ్రెస్, తెదేపాలను బలహీనపరచడానికి వలసలు ప్రోత్సహించడం. 3. ఎన్నికల పొత్తులు.
తనను ఇంతవాడిని చేసిన తెలంగాణా సెంటిమెంటుని ఆయన తన రాజకీయ ప్రత్యర్ధులపై మళ్ళీ బ్రహ్మాస్త్రంలా ప్రయోగించారు. తమ ఉద్యమాలు, బలిదానాల వలననే తెలంగాణాను సాధించుకొన్నపటికీ, పూర్తి స్థాయిలో, హోదాలో తెలంగాణా రాష్ట్రం ఏర్పరచకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను దగా, మోసం చేసిందని ఆరోపించారు. అందువల్ల తెలంగాణాకు పూర్తి న్యాయం జరగాలంటే దాని కోసం పోరాడి సాధించిన తెరాసకే ఆ బాధ్యత (?) కూడా అప్పగించాలని హితవు పలికారు. అదేవిధంగా ‘ఆంధ్రోళ్ళతో’ చాలా పేచీలున్నాయన్నారు. తెలంగాణా ప్రజల పక్షపాతి అయిన ఒక్క తెరాస మాత్రమే ఆ పనిని చక్కబెట్టగలదని ప్రజలకు సంజాయించారు. ఇక ఆంద్రోళ్ళ పార్టీ తెదేపాను నమ్మరాదని చెపుతూ తేదేపాకు ఒక ‘ఆంధ్ర ట్యాగ్’ తగిలించేసారు.
తెలంగాణాలోఉన్న సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణావారే అవుతారనే మొన్నటి తన స్టేట్ మెంటులో కూడా మళ్ళీ కొన్నిసవరణలు చేసారు. ‘అక్రమంగా తెలంగాణాలో ఉద్యోగాలు సంపాదించిన ఆంధ్రోళ్ళకు ఇక పెన్షన్లు కూడా ఇస్తూ మేనల్లుడిని మేపినట్లు మేపాలా?’ అని ప్రశ్నించారు. ఇటువంటివే మరికొన్ని ‘పాయింట్లు’ లేవనెత్తారు. ఆ మాత్రం క్లూ ఇస్తే అల్లుకుపోగల మంచి తెలివితేటలు, సత్తా ఉన్న తన పార్టీ నేతలకి తెలంగాణా సెంటిమెంటు రాజేసే బాధ్యతని అప్పగించేశారు. బహుశః ఇక నేటినుండి తెరాస నేతలు ఆ పని మీదనే ఉంటారు.
ఇక ఒకవైపు పొత్తులు పెట్టుకొందామని చెపుతూనే మరోపక్క తమ పార్టీ నేతలని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, జలగం వెంక్రటావు, టీడీపీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తదితరులు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా త్వరలోనే తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని చెప్పడం ద్వారా, ‘ఆలసిస్తే ఆశాభంగం’ అనే స్ట్రాంగ్ మెసేజ్ కాంగ్రెస్, తెదేపా నేతలకు పంపేరు కూడా. గనుక, ఆ రెండు పార్టీలలో నేతలు నేటి నుండి తెరాసలోకి క్యూ కట్టవచ్చును. వారికి టికెట్స్ ఎరగా వేసి ముందు బయటకి రప్పించగలిగితే ఆ తరువాత వారికి టికెట్స్ ఇవ్వడమా లేదా? అనే సంగతి కమిటీ మీదకు నెట్టేసి చేతులు దులుపుకొనే సౌలభ్యం కేసీఆర్ కిఉంది.
ఇక మజ్లిస్ ‘తెలంగానోళ్ళ’ పార్టీయే నని సర్టిఫికేట్ జారీ చేసి, ఆపార్టీతో ఎన్నికల పొత్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఎందుకంటే తెలంగాణాలో ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ కి తెరాస బాష అర్ధం కాదు. కనుక ఆ ఖాతాలను సమర్ధంగా నిర్వహిస్తున్న మజ్లిస్ తో దోస్తీ చేసుకొంటే, రేపు ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటుకి కావలసిన మద్దతు దొరుకుతుంది. పైగా మజిల్స్ మళ్ళీ కాంగ్రెస్ వైపు దిక్కులు చూడకుండా కట్టడి చేయవచ్చును కూడా. ఇక సీపీఐకి ‘ఫ్రెండ్లీ పార్టీ’ అని ఒక సర్టిఫికేట్ జారీ చేసేసినందున, ఆ పార్టీ కూడా ఎక్కడికీ పోకుండా తెరాస గుమ్మంలోనే పడిఉంటుంది.
ఈవిధంగా కేసీఆర్ ఎన్నికలకి అవసరమయిన ప్రాధమిక అవసరాలన్నీ ఏర్పాటు చేసుకొన్నారు. ఇక మిగిలిన పనిని ఆయన అనుచరులు దివ్యంగా చక్కబెట్టేయగలరని అందరికీ తెలుసు.