తెదేపా-బీజేపీల పొత్తుల కధ కూడా ముగిసినట్లేనా?
posted on Mar 24, 2014 @ 11:37AM
కాంగ్రెస్-తెరాసల ఎన్నికల పొత్తులు అధ్యాయం అర్ధంతరంగా ముగిసినట్లే తెదేపా-బీజేపీల పొత్తుల కధ కూడా ముగిసేట్లుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణాలో తెదేపాతో ఎన్నికల పొత్తులు వద్దని అక్కడి బీజేపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. కానీ రెండు రాష్ట్రాలలో పొత్తులకు అంగీకరించేట్లయితేనే తాము పొత్తుల గురించి ఆలోచిస్తామని లేకుంటే అసలు పొత్తులే వద్దని తెదేపా ఖరాఖండిగా చెపుతోంది. ఒకవేళ తెలంగాణాలో కూడా పొత్తులు కుదుర్చుకోవాలంటే తప్పనిసరిగా బీజేపీకే ఎక్కువ సీట్లు కేటాయించాలని అక్కడి నేతలు గట్టిగా పట్టుబట్టడం కూడా అవరోధంగా మారుతోంది. అదేవిధంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి, ఒంగోలు మల్కాజ్ గిరీ వంటి కొన్ని ముఖ్యమయిన నియోజక వర్గాలు తమకే కావాలని రెండు పార్టీలు గట్టిగా పట్టుబట్టడం పొత్తులకు మారో ప్రధాన అవరోధంగా మారింది. అయినప్పటికీ తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీ అధిష్టానంతో డిల్లీలో చర్చిస్తున్నారు.
రెండు పార్టీల మధ్య పొత్తులు కుదుర్చుకోకపోయినట్లయితే తామే ఎక్కువగా నష్టపోతామని ఇరువురికీ తెలుసు. కానీ, సీట్ల విషయంలో, తెలంగాణాలో పొత్తుల విషయంలో రెండు పార్టీలు పంతాలకు పోతుండటంతో ఇక రెండు పార్టీల మధ్య పొత్తులు అనుమానంగానే ఉంది. బీజేపీ నేత మురళీధర రావు, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఇరువురూ కూడా పొత్తుల విషయంలో పెదవి విరుస్తున్నారు. బహుశః ఒకటి రెండు రోజుల్లోగానే పొత్తుల సంగతి తేలిపోవచ్చును.
ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరకపోతే, అది కాంగ్రెస్, వైకాపా, జైసాపలకు వరంగా మారవచ్చును. తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు పొత్తులు పెట్టుకోకపోవడం వలన అవి ఏవిధంగా బలహీనపడి, తెదేపా, బీజేపీలకు అవకాశం కల్పిస్తున్నాయో, అదేవిదంగా సీమాంధ్రలో తెదేపా-బీజేపీలు కూడా బలహీనపడి మిగిలిన అన్ని పార్టీలకు అవకాశం కలిగించడం తధ్యం.
కానీ, ఒకవేళ తెదేపా-బీజేపీలు పొత్తులు విఫలమయినట్లయితే వెంటనే వైకాపా చొరవ తీసుకొని బీజేపీతో పొత్తులకి ప్రయత్నించవచ్చును. బీజేపీకి సీమాంధ్రపై పెద్దగా ఆసక్తి లేదు. అదేవిధంగా వైకాపాకు తెలంగాణపై ఆసక్తి లేదు. ఒకవేళ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినట్లయితే, సీమాంద్రా కాంగ్రెస్ నేతల చేరికతో బలం పుంజుకొన్న తెదేపా ముందు డీలాపడిపోయిన వైకాపా కూడా మళ్ళీ బలం పుంజుకోవచ్చును. అదేవిదంగా ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి వైకాపా మద్దతు కూడా దొరుకుతుంది. గనుక ఆ రెండు పార్టీల మధ్య చాలా తేలికగా పొత్తులు కుదిరే అవకాశం ఉంది.
ఇక, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ, తెదేపాలకు తన జనసేన మద్దతు లేదా ఆ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకొంటున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం కాదని బీజేపీ నేత సోము వీర్ర్రాజుకి నిన్ననే ఒక లేఖ వ్రాసినట్లు సమాచారం. అదే నిజమయితే ఈ పొత్తుపొడుపులలో అన్నిటికంటే ఎక్కువ లాభపడేది వైకాపాయే అవుతుంది. ఇక వైకాపా, తెరాసలను నమ్ముకొని రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల చేతుల్లో ఘోరంగా మోసపోయి దక్షిణాదిన తనకున్న బలమయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నికూడా పోగొట్టుకోవడమే కాకుండా, ఆ పార్టీకి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేఅవకాశాలు కూడా మరింత కుచించుకుపోవచ్చును.