రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య చిచ్చు
posted on Mar 20, 2014 @ 8:08PM
తెలంగాణా సెంటిమెంటుని ఎప్పుడు ఏవిధంగా వాడుకోవాలో కేసీఆర్ కి తెలిసినంత బాగా బహుశః మరెవరికీ కూడా తెలియదేమో. కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు ప్రక్రియ కూడా పూర్తయిపోయి ఎన్నికలలో ఒంటరిపోరుకి సిద్దమవుతున్నందున, కేసీఆర్ మళ్ళీ బ్రహ్మాస్త్రం వంటి తెలంగాణా సెంటిమెంటుని బయటకు తీసి ప్రయోగించారు. తెలంగాణా ప్రజల భావోద్వేగాలను మళ్ళీ రెచ్చగొట్టేందుకు ఉద్యోగులు, నదీ జలాల పంపకాలు వంటి సున్నితమయిన అంశాలను కెలికి వదిలిపెట్టారు. ఊహించినట్లుగానే దానికి ఆంధ్ర ప్రాంత నేతల నుండి ధీటుగా స్పందన వచ్చింది. ఎన్నికల గంట మ్రోగక ముందు కేవలం తెలంగాణా పునర్నిర్మాణం గురించి మాత్రమే మాట్లాడిన కేసీఆర్, ఇప్పుడు ఆంధ్ర-తెలంగాణాలకు సంబందించిన సున్నితమయిన అంశాల గురించి మాట్లాడటం ఎందుకంటే ప్రజలలో నిద్రాణమయున్న తెలంగాణా సెంటిమెంటుని తట్టిలేపి, తన తెరాసకు అనుకూలంగా మలుచుకోవడానికే. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించాలనే తాపత్రయంలో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్నఇటువంటి సున్నితమయిన అంశాలను లేవనెత్తుతూ, ప్రజల మధ్య విషబీజాలు నాటుతూ వారి మధ్య మరింత దూరం పెరిగేలా చేస్తున్నారు.
అదేవిధంగా సమైక్యవాదం సెంటిమెంటుతో రాజకీయ లబ్దిపొందాలని జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, అటు నేతలను కానీ, ఇటు ప్రజలను గానీ తన పార్టీ వైపు ఆకర్షించలేక తిప్పలు పడుతున్న ఈ సమయంలో కేసీఆర్ అందించిన ఈ అద్భుతావవకాశాన్నిఅందిపుచ్చుకొంటూ అతనిపై ఎదురుదాడి చేసి సీమాంధ్ర ప్రజల, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నమే చేసారని చెప్పవచ్చును.
తెరాస, జైసమైక్యంధ్ర రెండు పార్టీలకు కూడా ప్రత్యేకంగా ఒక సిద్దాంతం,అజెండా, పార్టీ నిర్మాణం గానీ లేనందున ఎన్నికల వైతరిణిని దాటేందుకు ఈ ఆంధ్ర, తెలంగాణా సెంటిమెంటులనే నావగా చేసుకొంటున్నాయి. కేసీఆర్, కిరణ్ ఇరువురూ కూడా కేవలం తాము మాత్రమే ప్రజాభిప్రాయానికి అద్దం పడుతూ తమ తమ ప్రాంతాల ప్రజల హక్కులకోసం పోరాడుతున్నట్లు, అవతలి వైపు ప్రజలు, మిగిలిన పార్టీల నేతలు అందరూ కూడా దొంగలు, దోపిడీ దారులన్నట్లుగా మాట్లాడుతూ ప్రజలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు.
తప్పని పరిస్థితిలో అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలు, నేతలూ కూడా ఈ విద్వేష ప్రచార యుద్దంలో పాలు పంచుకోక పరిస్థితి ఏర్పడితే, ఇప్పుడిపుడే ఇరు ప్రాంతాల ప్రజలలో కుదుటపడుతున్న ఉద్వేగాలు, ఉద్రిక్తతలు మళ్ళీ తలెత్తే ప్రమాదం ఉంది. రాజకీయ నేతలు ప్రజల కోసమే పోరాడుతున్నామని చెప్పుకొంటూనే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా దారుణం. ప్రజల మధ్య సఖ్యత పెంచి వారికి సరయిన మార్గదర్శనం చేస్తూ దేశ సౌభ్యాగం కోసం పాటు పడవలసిన నేతలు, పార్టీలు ఆ పని చేయలేకపోయినా, ప్రజల మధ్య చిచ్చు పెట్టగలరని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకొన్నారు.
ఇటువంటి దుష్ట రాజకీయ వ్యవస్థను డ్డీకొని ప్రాంతాలుగా విడిపోతున్న తెలుగు ప్రజలందరి మధ్య సఖ్యత పెంచి ఇరు ప్రాంతాలు పోటాపోటీగా అభివృద్ధి సాధించాలనే ఒక సత్సంకల్పంతో, తపనతో పవన్ కళ్యాణ్ వంటి వారు రాజకీయాలలోకి వస్తుంటారు. అయితే ఆశయాలను ఆచరణలో పెట్టలేక అటువంటి వారు విఫలమయిన ప్రతీసారి సదరు రాజకీయ పార్టీలు మరింత బలపడుతుంటాయి. అందువలన ప్రజలే తమ మధ్య చిచ్చుపెడుతున్న నేతలకు, పార్టీలకు ఎన్నికలలో తగిన గుణపాటం చెప్పవలసి ఉంటుంది.