పవన్ కళ్యాణ్ ఫ్లాప్ షో
posted on Mar 28, 2014 @ 9:55AM
పవన్ కళ్యాణ్ పదిరోజుల క్రితం తన జనసేన పార్టీ స్థాపిస్తున్నపుడు చేసిన ఉపన్యాసం రాజకీయ మూస ఫార్ములాకి కట్టుబడకుండా సాగినప్పటికీ, అది ఆయన ఆలోచనలకి అద్దం పడుతూ అభిమానులకి, ప్రజలకీ, మీడియాకీ, చివరికి రాజకీయ పార్టీలకీ కూడా చాలా ఆసక్తి రేకెత్తించి, మళ్ళీ ఆయన రెండో ప్రసంగం కోసం వారిని ఎదురు చూసేలా చేసింది. కానీ, ఆయన నిన్న వైజాగ్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం అభిమానులను కూడా చాలా నిరుత్సాహపరిచింది. ఆయన సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయాలలోకి ప్రవేశించినందున, జనసేన పార్టీ తప్పకుండా ఎన్నికలలో పోటీ చేస్తుందని అందరూ ఆశించారు.
కానీ ఆయన అందరినీ నిరాశపరుస్తూ “ఎన్నికలలో పోటీ చేయను. ఎవరికీ మద్దతు ఈయను. ఎవరికీ వ్యతిరేఖంగా ప్రచారం చేయను. ఎవరి అవకాశాలు పాడుచేయడం నాకిష్టం లేదు. మీకిష్టం వచ్చిన వారికే ఓట్లువేసుకోండి. ఎన్నికలయిపోయిన తరువాత గెలిచిన వారిని నేను నిలదీస్తాను” అని చెప్పారు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడిగా పార్టీ పెట్టి ఇంత హడావుడి చేయడం అవసరమా? అనేదే ప్రశ్న.
ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించి బుద్ధి చెప్పగల యువత కోసం తను వెతుకుతున్నానని, అటువంటివారు దొరికినప్పుడే జనసేన ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పారు. అయితే ఇన్నికోట్ల మంది తెలుగు ప్రజలలో, అభిమానులలో ఆయనకు అటువంటి వ్యక్తి ఒక్కరూ కనబడకపోవడం విచిత్రమే. ఆయన ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొంటే అందుకు ఇటువంటి కుంటిసాకులు చెప్పనవసరం లేదు. నిజానికి ఆయన పార్టీ ఎన్నికలలో పోటీ చేసేమాటయితే ఆయన వెంట నడిచేందుకు, ఆయన ‘ఊ’ అంటే ఆయన కోసం నిప్పుల్లో కూడా దూకేందుకు వేలాది అభిమానులు సిద్దంగా ఉన్నారు. కానీ ఆయన ఎందుకో వెనుకంజవేసారు.
కనీసం ఆయన తను ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా విస్పష్టంగా ప్రకటించకుండా ప్రజలను వారికిష్టమయిన అభ్యర్ధులకే ఓట్లు వేసుకోమని ఒక ఉచిత సలహా ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన ‘మోడీకి నా సెల్యూట్’ అన్నారు తప్ప, తమ పార్టీ రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తుందో లేదో కూడా స్పష్టంగా చెప్పకుండా అభిమానులను అయోమయ స్థితిలో వదిలివేసారు. కాంగ్రెస్ పార్టీలో బొత్స, కావూరి, రాయపాటి వంటి నేతల పేరు పెట్టి మరీ నిర్భయంగా విమర్శించిన ఆయన జగన్ పేరు ఎత్తేందుకు కూడా సాహసించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా తేదేపాకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ నేరుగా ఆ పార్టీ పేరు చెప్పి దానికే తను మద్దతు ఇస్తున్నానని చెప్పలేకపోవడం కూడా ఎందుకో అర్ధం కాదు.
ఇక కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన ఆయన ఆ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయిన వారిని మాత్రం క్షమిస్తున్నట్లు మాట్లాడటం మరో విశేషం. “మీరు పార్టీలు కండువాలు మార్చడం నేను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాను. మారండి. నేనేమి అభ్యంతరం చెప్పబోను. కానీ ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను” అని చెప్పడం చాలా అసంబద్దంగా ఉంది.
కేవలం వారం పది రోజులలో కొమరం పులి వంటి పవన్ కళ్యాణ్ ఇంత పిరికిగా ఎందుకు మారిపోయారు? అని ప్రశ్నించుకొంటే ఆయనపై ఏవో కొన్ని అదృశ్య శక్తుల ఒత్తిళ్ళు చాలానే ఉన్నట్లు అనిపిస్తోంది. అందువల్లే క్రిందటిసారి ఆయన ప్రసంగంలో కనిపించిన వాడి వేడి, ఈసారి కనిపించలేదు. ఈ సభలో తనను, తన పార్టీని ప్రజల ముందు పూర్తిగా అవిష్కరించుకొని, తన అభిమానులకు దిశానిర్దేశం చేస్తారని అందరూ ఆశించారు. ఆయన రాజకీయ వైఖరి ఏమిటో విస్పష్టంగా ప్రకటిస్తారని అన్ని పార్టీలు ఎదురుచూసాయి. కానీ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను తుఫానులా.. సునామీలా...ప్రవేశిస్తారనుకొంటే, చప్పగా చల్లారిపోయి ప్రజలను తమకు నచ్చిన వారికే ఓటేసుకోమని ఒక ఉచిత సలహా ఇచ్చి ‘జై హింద్’ చెప్పేశారు పవన్ కళ్యాణ్.