వాపును చూసి బలుపని బ్రమిస్తున్న బీజేపీ
posted on Mar 26, 2014 @ 10:25AM
రాష్ట్ర విభజన బిల్లుకి బీజేపీ మద్దతు ప్రకటించిన తరువాత సీమాంద్రాలో ఆ పార్టీ పట్ల కూడా తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే అది తమను మోసం చేసిందని, మోడీని చూసి బీజేపీని ఆదరిస్తే చివరికి అది కూడా మోసం చేసిందని సీమాంధ్ర ప్రజలు చాలా బాధ పడ్డారు. రాజ్యసభలో సీమాంద్రాకు అనుకూలంగా వాదించిన వెంకయ్య నాయుడు విభజన బిల్లు ఆమోదం పొందగానే సీమాంద్రాలో పర్యటించి, ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేసారు. దానికి మోడీ ప్రభావం కూడా తోడవడంతో సీమాంద్రాలో ప్రజలు క్రమంగా మళ్ళీ బీజేపీ వైపే ఆకర్షితులవుతున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో ప్రవీణులైన పురందేశ్వరి వంటి రాజకీయ నాయకులు అందుకే బీజేపీలోకి జంపైపోతున్నారు. అనేకమంది తెలుగు సినిమా హీరోలు ‘నమో నమో’ అంటూ మోడీ జపం చేస్తూ, ఎవరూ అడగకుండానే బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇక రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా గట్టిగా పోరాడిన ఆంధ్రా యూనివర్సిటి విద్యార్ధి జేఏసీ నేతలు సైతం ఇటీవల బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి, ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం గమనిస్తే సీమాంద్రాలో క్రమంగా బీజేపీకి కొంతమేర సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అర్ధం అవుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సీమాంద్రాలో ఎక్కడా పెద్దగా కనబడని బీజేపీ ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంతగా బలం పుంజుకోవడం విశేషమే.
సీమాంద్రాలో క్రమంగా తనకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులను చూసి సీమాంధ్ర బీజేపీ నేతలు కూడా తెలంగాణా బీజేపీ నేతల్లాగే తమకు ఇక తెదేపాతో ఎన్నికల పొత్తులు అవసరంలేదన్నట్లు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంకయ్యనాయుడు కూడా ఇంచుమించు అదేవిధంగా స్పందిస్తూ తమతో తెదేపా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదని అన్నారు. మమ్మల్ని మేం ఎక్కువ లేదా తక్కువగా అంచనా వేసుకోవడంలేదు. అదేవిధంగా ఇతరులను కూడా మేము తక్కువగా అంచనా వేయడం లేదు. అందువల్ల మాలాగే ఇతర పార్టీలు (తెదేపా) కూడా తమని తాము ఎక్కువగా అంచనా వేసుకొంటూ బీజేపీని తక్కువగా అంచనా వేయడం మంచిది కాదని ఆయన అన్నారు. బీజేపీ శ్రేణులు ఎటువంటి పరిస్థితులనయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు కూడా. బీజేపీ నేతల ఈ మాటలు గమనిస్తే సీమాంద్రాలో తమకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులను చూసి వారి ఆత్మవిశ్వాసం ఇప్పుడు అతివిశ్వాసంగా, అతిశయంగా మారుతున్నట్లుంది.
తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన కారణంగా తెలంగాణాలో తమకే ఓట్లు రాలుతాయని బీజేపీ ఆశలు పెట్టుకోవడం సహజమే. కానీ, సీమాంద్రాలో కూడా తమకు పరిస్థితి అనుకూలంగా మారిపోయిందని బీజేపీ నేతలు అనుకోవడం వారు వాపును చూసి బలుపు అని భ్రమిస్తున్నట్లుంది. బహుశః ఆ భ్రమ వల్లనే వారు తెదేపాతో ఏదోవిధంగా సీట్ల సర్దుబాటు చేసుకొని ఎన్నికల పొత్తులకు ప్రయత్నించకుండా బిగుసుకొని కూర్చొన్నట్లున్నారు. త్వరలోనే నరేంద్ర మోడీ సీమాంద్రాలో పర్యటిస్తే తాము మరింత బలపడటం ఖాయమని అప్పుడు ఇక తెదేపాతోనే కాదు ఇక ఏ పార్టీతోను పొత్తులు అవసరం లేదని వారు అనుకొంటున్న మాట నిజమయితే, ఈసారి ఎన్నికలలో కూడా బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకొనవసరం లేదు.
నేటికీ సీమాంద్రా-బీజేపీలో పురందేశ్వరి, సినీనటుడు కృష్ణంరాజు వంటి ఒకరిద్దరు తెలిసిన మొహాలు తప్ప ఆ పార్టీకి చెప్పుకోదగ్గ గొప్ప నాయకులెవరూ లేరు. అయినప్పటికీ వాపును చూసి బలుపని భ్రమలో బలమయిన, విస్తృతమయిన క్యాడర్, నాయకులు గల తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలను డ్డీకొని నిలవగలమని బీజేపీ నేతలు భావిస్తే అందుకు వారే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. తెదేపా లేదా వైకాపాలతో అంటుకట్టకపోతే బీజేపీ సీమాంద్రాలో బ్రతికి బట్ట కట్టడం అసంభవం.