ఆంధ్రాలో చిరంజీవి, తెలంగాణాలో కేసీఆర్...
posted on Mar 25, 2014 9:20AM
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుతో అక్కడ పరిస్థితులు పూర్తిగా తనకు అనుకూలంగా మారిపోతాయని భావిస్తే, కేసీఆర్ హ్యాండివడంతో ఇప్పుడు అక్కడ కూడా ఎదురీదక తప్పడం లేదు. తెలంగాణా కోసం సీమాంద్రాను బలిచేసుకొన్నందుకు బాగానే శాస్తి జరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు లోలోన కుమిలిపోతోంది. ఇక చేసేదేమీ లేక అంతోఇంతో తనకు అనుకూలంగా ఉన్న తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి పెట్టి మొదట అక్కడ అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో పడింది. అధిష్టానం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టడంతో, టీ-కాంగ్రెస్ నేతలందరూ పార్టీని గాలికొదిలేసి, తమకి, తమ కుటుంబ సభ్యులకి టికెట్స్ ఖరారు చేసుకొనేందుకు పైరవీలు చేసుకోవడంలో తలమునకలయ్యున్నారు.
ఇదే అదునుగా, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మరియు అతని పార్టీ నేతలు ప్రజలను ఆకట్టుకొనేందుకు తెలంగాణా సెంటిమెంట్ రెచ్చగొడుతూ దూసుకుపోతున్నారు. ‘బంగారి తెలంగాణా’ను నిర్మించుకోవాలంటే మొత్తం శాసనసభ, లోక్ సభ స్థానాలలో తెరాసకే ఇవ్వాలని ప్రచారం మొదలుపెట్టేసారు. ‘మన రాష్ట్రం, మన పార్టీ’ అంటూ ఒక సరి కొత్త నినాదం అందుకొని ఒక్క తెరాస తప్ప మిగిలిన అన్ని పార్టీలు పరాయి పార్టీలేననే భావన ప్రజలలో వ్యాపింపజేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా టికెట్స్ కోసం పైరవీలతో తీరిక లేకుండా ఉన్నారు. బహుశః వారు టికెట్స్ ఖరారు చేసుకొని యుద్దరంగంలో అడుగు పెట్టే సమయానికి కేసీఆర్ సగం విజయం సాధించేసినా ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినా కూడా ఆ విషయాన్ని బలంగా ప్రచారం చేసుకొని లబ్ది పొందవలసిన టీ-కాంగ్రెస్ నేతల అలసత్వం వలన, వారికీ, పార్టీకి కూడా తీరని నష్టం కలిగేలా ఉంది. అందువలన కాంగ్రెస్ అధిష్టానం తెరాసను నిందించడం కంటే తమ పార్టీ నేతలనే ముందు నిందించుకోవలసి ఉంటుంది.
ఇక సీమాంధ్రలో మిగిలిన గుప్పెడు మంది కాంగ్రెస్ నేతలు చిరంజీవి (శల్య)సారద్యంలో చేస్తున్న ప్రచారం ఒక డ్రామా కంపెనీ ఫ్లాప్ షోలాగ ఎవరినీ ఆకట్టుకోలేక భారంగా ముందుకు సాగుతోంది. గమ్మతయిన విషయం ఏమిటంటే దానికి నేతృత్వం వహిస్తున చిరంజీవి అసందర్భ ప్రసంగం వలననే కాంగ్రెస్ పార్టీ ఉన్న పరువు కూడా పోగొట్టుకొంటోంది. పార్టీని ఎలాగయినా బ్రతికించమని ఆయనకి బాధ్యత అప్పజేపితే “మా పార్టీ అవసాన దశలో ఉందని, ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఒక గ్రద్ద వంటిదని, చాలా నిరాశతో ప్రచారం చేస్తున్నానంటూ ” ఏవేవో అసందర్భ ప్రసంగాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆయనే స్వయంగా ఓడించేలా ఉన్నారు.
రాష్ట్ర విభజన వల్ల పార్టీకి జరిగిన నష్టం కంటే ఆయన చేస్తున్న ప్రచారం వలననే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం కలిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ బొంద పెడుతుంటే, సీమాంద్రాలో ఆపని చిరంజీవి చేస్తున్నట్లుంది. అయినప్పటికీ అతను తప్ప ప్రజలను ఆ మాత్రం ఆకట్టుకోగల నేత పార్టీలో ఒక్కరూ లేనందున చిరంజీవే ఈ ఎన్నికల వైతరిణిని దాటిస్తాడని కాంగ్రెస్ అధిష్టానం ఆశపెట్టుకొంది పాపం! అయితే ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. ఆయనకి ఒక మంచి సినిమా డైలాగ్ రైటర్ తో స్క్రిప్ట్ తయారు చేయించి అందివ్వగలిగితే, అందులో అక్షరం పొల్లుపోకుండా ఆయన చాలా చక్కగా ప్రజలను ఆకట్టుకొనేలా పలుకుతూ పార్టీని ఒడ్డున పడేయగలరు. లేకుంటే బస్సు యాత్ర పూర్తయ్యే సరికి ఆయన దెబ్బకి పార్టీలో మిగిలినవారు కూడా పారిపొయినా ఆశ్చర్యం లేదు.