పవన్ కళ్యాణ్ కి అభిమానులే శ్రీరామ రక్ష
posted on Mar 27, 2014 9:05AM
జనసేన పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, ఈరోజు ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్స్, వైజాగ్ లో తన మొట్ట మొదటి రాజకీయ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి పదిరోజులయినా ఇంకా దాని నిర్మాణం జరుగనందున ఆయన అభిమానులే స్వచ్చందంగా ముందుకు వచ్చి సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలలాగ పనిచేసుకొనిపోవడం విశేషం. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపిస్తున్నపుడు, ఆయన తన అభిమానులను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి మొదటి అడుగే తప్పటడుగు వేయగా, ఆయనకు పూర్తి విరుద్దంగా పవన్ కేవలం తన అభిమానులనే నమ్ముకొని మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానానికి వారి అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి.
అభిమానులే స్వయంగా చొరవ తీసుకొని సభకు అవసరమయిన ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ చేస్తూ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. వారు ఈమెయిల్స్, ఫేస్ బుక్, ట్వీటర్, యస్.యం.యస్. వంటి అన్నిమార్గాల ద్వారా వారు చుట్టూ పక్కల జిల్లాలలో అభిమానులను ముఖ్యంగా యువతను కూడా తమ కార్యక్రామాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ఇది తమ ఇంట్లో శుభ కార్యక్రమన్నంతగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఈసభ ప్రచారం కోసం బైక్ ర్యాలీలు నిర్వహిస్తూన్నారు.
అభిమానులు చూపిస్తున్న అపారమయిన ఈ ప్రేమాభిమానాలను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకొంటూ, వారి యువశక్తిని, తెలివి తేటలను, జనసేన ద్వారా సమాజానికి సేవ చేయాలనే వారి తపనను గుర్తించి వారితో కలిసి అడుగు ముందుకు వేస్తే ఆయన చేస్తున్న ఈ రాజకీయ ప్రయోగం సఫలం అవుతుంది. కానీ, కేవలం అభిమానులతోనే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో నెగ్గుకు రావడం చాలా కష్టం గనుక, మంచి అనుభవం, నిజాయితీ గల కొందరు రాజకీయ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించడం తప్పనిసరి అవుతుంది. కానీ వారి రాకతో అభిమానుల ప్రాధాన్యం తగ్గకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేకుంటే జనసేన కూడా మరో ప్రజారాజ్యం ప్రయోగంలా విఫలమయితే, అప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా అభిమానులు దూరం అయ్యే ప్రమాదం ఉంది.
ఇక అన్నిటికంటే ముందుగా జనసేన పార్టీ అసలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా? అనే విషయం కూడా తేల్చుకొన్నట్లయితే, తదనుగుణంగా తదుపరి కార్యక్రమాలను, పార్టీ నిర్మాణం గురించి ఆలోచించవచ్చును. పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నించడానికే పార్టీని పెడుతున్నాని చెప్పుకొంటున్నారు గనుక, జనసేన పార్టీ పరిమిత సీట్లకు పోటీ చేయబోతోందని భావించవచ్చును. అటువంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని నిర్మించే ప్రయత్నం చేసే బదులు, కేవలం తమ అభ్యర్ధులను నిలబెడుతున్న చోటే ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేసినట్లయితే తద్వారా అనవసర శ్రమ, వృధా ఖర్చు తప్పడమే కాక విలువయిన సమయం కూడా సద్వినియోగం చేసుకోవచ్చును.
ఏది ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇకముందు తను వేసే ప్రతీ అడుగులో తన అభిమానులను తోడుగా చేసుకొని ముందుకు సాగినట్లయితే, అదే ఆయన పార్టీకి విజయాన్ని చేకూర్చి, ఇతర పార్టీల నుండి శ్రీరామ రక్షగా నిలిచి కాపాడుతుందని చెప్పవచ్చును.