పవన్, నరేంద్ర మోడీకి మద్దతు పలకడం సమర్ధనీయమేనా?
posted on Mar 22, 2014 @ 9:51AM
వామపక్ష భావాలున్న పవన్ కళ్యాణ్ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ప్రకటించడం, పనిగట్టుకొని అహ్మదాబాద్ వెళ్లి గోద్రా అల్లర్లలో పేరేక్కిన నరేంద్ర మోడీని కలిసి ఆయనకు మద్దతు తెలపడం చాలా మంది హర్షించలేకపోతున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులలో ముస్లిం యువకులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మూస రాజకీయ ధోరణికి అలవాటు పడిపోయిన కొందరు రాజకీయ విశ్లేషకులు, పవన్ కళ్యాణ్ కి సరయిన రాజకీయ అవగాహన కానీ, పార్టీ కి అజెండా గానీ సరయిన దృక్పధం గానీ ఏవీ లేవని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ అకస్మాత్తుగా జనసేన పార్టీ పెట్టినపుడు స్వాగతించినవారే నేడు ఆయనను విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవిక దృక్పధం కనబరుస్తూ సరయిన నిర్ణయం తీసుకొన్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
పవన్ తన జనసేన పార్టీని ప్రకటిస్తున్న రోజునే తన ప్రధానోదేశ్యం అధికారం చెప్పటడం కాదని, కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని విస్పష్టంగా ప్రకటించారు. అదేవిధంగా తాను ఎన్నికలలో ఓట్లు చీల్చి రాష్ట్ర రాజకీయాలలో మరింత సంక్లిష్ట పరిస్థితి ఏర్పరిచేందుకు రావడం లేదని కూడా అప్పుడే ప్రకటించారు. ఆయన మొదటి నుండి పదేపదే చెపుతున్న ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూసిన్నట్లయితే, ఆయన సరయిన దిశలోనే అడుగులు వేస్తున్నారని అర్ధమవుతుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికలలో పోటీ చేసి ఉండి ఉంటే ఆయన కూడా ఓట్లను చీల్చి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చి ఉండేవారు. కానీ ఆయన ఆవిధంగా చేయకుండా, రాష్ట్రంలో తేదేపాకు, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్దపడ్డారు.
అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీని పారద్రోలేందుకే దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీకి మద్దతు పలికారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని అర్ధమవుతోంది. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు అధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ బలమయిన ప్రత్యామ్నాయంగా నిలిచి ఉంటే, బహుశః బీజేపీకి బదులు ఆయన థర్డ్ ఫ్రంట్ కే మద్దతు తెలిపేవారేమో! ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీస్తున్న సంగతినీ ఆయన పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే ఆయనకు మద్దతు ప్రకటించారని భావించవచ్చును.
అంతేగాక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే, అసమర్ధుడు, ఎటువంటి పాలనానుభావం లేనివాడు, అవినీతి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి అయిన రాహుల్ గాంధీ చేతిలోకి దేశం వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదాన్ని నివారించి సమర్ధుడు, మంచి పరిపాలనా దక్షుడు అని నిరూపించుకొన్న నరేంద్ర మోడీకే రాజ్యాధికారం కట్టబెట్టడం సముచితమని పవన్ కళ్యాణ్ భావించినందునే ఆయన తన (వామపక్ష) ఇజాన్ని, స్టార్ ఇమేజ్ ని అన్నిటినీ పక్కన పెట్టి బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజవకాశాలను దెబ్బతీయడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేజిక్కించుకోకుండా అడ్డుపడేందుకు నడుం బిగించారు.
పవన్ తెదేపాకు అనుకూలంగా మాట్లాడటానికి కూడా దాదాపు ఇవే కారణాలు వర్తింపజేసుకోవచ్చును. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే సరయిన నాయకత్వం, సరయిన పార్టీల కాంబినేషన్, వాటి మధ్య పూర్తి అవగాహన అత్యంత అవసరమని ఎవరికయినా తెలుసు. ఆంధ్రలో ఒక పార్టీ, తెలంగాణాలో మరొక పార్టీ, కేంద్రంలో ఈ రెంటికీ పూర్తి విభిన్నమయిన పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అదే విషయాన్ని పవన్ నిన్న తన మాటలలో వ్యక్తం చేసారు. బహుశః ఈ ఉద్దేశ్యంతోనే పవన్ రాష్ట్రంలో ఉన్నపార్టీలలో సమర్ధమయినదని భావిస్తున్న తెదేపావైపు మొగ్గు చూపుతున్నారు.
తనకి రాష్ట్రంలో ఎంతమంది వీరాభిమానులు ఉన్నపటికీ కేవలం వారి అండతోనే తన పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడం అసాధ్యమనే సంగతి పవన్ గ్రహించినందునే ఆయన చాలా వివేకం ప్రదర్శిస్తూ, తాను తెదేపాకు అనుకూలమని తెలిపారు. అందువల్ల పవన్ మరియు అతని పార్టీ సభ్యులు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి పెద్దగా ప్రాధాన్యతనీయకుండా, రాష్ట్రంలో నిలకడ తేగల పార్టీకే పూర్తి మెజార్టీ దక్కేలా చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఈయవచ్చును.
దీనిని బట్టి పవన్ కళ్యాణ్ చాలా లోతుగా ఆలోచించిన తరువాతనే, పూర్తి విజ్ఞతతో కూడిన నిర్ణయాలు తీసుకొంటున్నారని అర్ధమవుతోంది. ఒక రాజకీయ మూస ధోరణిలో ఆలోచనలు చేసేవారికి ఇటువంటివి జీర్ణించుకోవడం కష్టమే.