కిరణ్ మాటల అంతర్యమిదేనా..,
posted on Mar 19, 2014 6:43AM
ఇటీవల జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల తరువాత తన పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని తన ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారాన్నిఖండిస్తూ, తమ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ లో కలిసే అవకాశమే లేదని, తమ పార్టీ అధికారం కోసం కాక కేవలం ప్రజల తరపున పోరాడేందుకే ఏర్పాటయిన పార్టీ అని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. అయితే ఆయన తమ పార్టీ కాంగ్రెస్ లో కలవదని చెప్పారు కానీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వదని చెప్పకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి వ్యవహారాల గురించి ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే ఆయన నోట కాంగ్రెస్ పార్టీ పేరు వినబడిన ప్రతీసారి ప్రజలలో ఆయన నిబద్దత పట్ల, పార్టీ స్థాపించడం వెనుక ఆయన ఉద్దేశ్యాల పట్ల ప్రజలలో మరిన్ని అనుమానాలు పెరగవచ్చును. కానీ, ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనని చెప్పుకోవవడం చూస్తే, ఆయనకీ తన పార్టీ పట్ల ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందో గ్రహించినట్లే ఉంది. ప్రస్తుతం సీమాంధ్రలో రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే, కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి అంత ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది.
ఆయన ముఖ్యంగా ఏపీయన్జీవోల మద్దతు, సమైక్యాంధ్ర సెంటిమెంటుపై ఆశలుపెట్టుకొని పార్టీని స్థాపించారు. కానీ, నేడు ఎన్నికలు, పొత్తులు, రాజకీయ సమీకరణాల హడావుడి మొదలవడంతో, సమైక్యాంధ్ర వేడి క్రమంగా తగ్గిపోయింది. ఇది కిరణ్ పార్టీకి ప్రాధాన్యతని తగ్గించిన మొదటి కారణం అయితే, ప్రజలలో ఆ వేడి తగ్గిపోయినందున, ఆయన నమ్ముకొన్న ఏపీ ఎన్జీవోలు కూడా ఆయన పార్టీకి దూరం అవుతున్నారు. ప్రజలలో, ఉద్యోగులలో ఆదరణ లేని పార్టీకి ఉద్యోగ సంఘనేతలు, రాజకీయ నేతలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన కనుసన్నలలో నడిచిన ఏపీ యన్జీవో సంఘాల నేత అశోక్ బాబు కొద్ది రోజుల క్రితమే, ఏదో మిషతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుని కలిసి వస్తే, కిరణ్ కుమార్ రెడ్డిని చివరివరకు వెన్నంటి నడిచిన మాజీ మంత్రి శైలజానాథ్ ని తన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినప్పటికీ, ఆయన కూడా తను తెదేపాలో చేరబోతున్నట్లు చూచాయగా ప్రకటించడం గమనిస్తే, కిరణ్ పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో అర్ధమవుతుంది. అందుకే ఆయన తను అధికారం దక్కించుకోవడం కోసం పార్టీని పెట్టలేదని పదేపదే చెపుతున్నారు. అధికారం కోసం కాకపోతే మరి దేనికోసం? అనే ప్రశ్నకు ఆయన చెపుతున్న సమాధానం చాలా పేలవంగా అర్ధ రహితంగా ఉంది.
కిరణ్ కుమార్ రెడ్డి నేటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా సోనియా గాంధీకి విధేయుడనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు. ఆయన పార్టీ పెట్టి ఇప్పటికి పదిరోజులవుతున్నా ఆయన మాటలలో నేటికీ అదే విధేయత ఉట్టిపడుతుండటం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. అందువలన, ఆయన కాంగ్రెస్ అధిష్టాన దేవత ఆదేశాల మేరకే ఎన్నికల ముందు హడావుడిగా పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి దిగిన ఆయన ప్రజల ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ ప్రత్యర్ధులను అధికారంలోకి రానీయకుండా అడ్డుకొనేందుకు సైంధవుడి పాత్ర పోషిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన తను అధికారం దక్కించుకోవడం కోసం పార్టీని పెట్టలేదని పదేపదే చెపుతున్నారు.
అశ్వత్థామ హతః...కుంజరః అంటే కురుక్షేత్రంలో కౌరవసేనకు నాయకత్వం వహిస్తున్న ద్రోణుడుని మానసికంగా దెబ్బ తీసేందుకు ఎన్నడూ అబద్దం చెప్పడనే గొప్ప పేరుగల ధర్మరాజు, ‘అశ్వత్థామ చనిపోయాడు...’అని ద్రోణుడికి వినపడేలా బిగ్గరగా అరిచి, తరువాత మెల్లగా కుంజరః అంటే (ఆ పేరుగల) ఏనుగు చనిపోయిందని ముగిస్తాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే విధంగా తను పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశ్యం గురించి, దాని లక్ష్యం గురించి పదేపదే చెపుతున్నారు. కానయితే ప్రజలే దానిని గమనించాల్సి ఉంటుంది.