సభలో చూడకూడనివి చూస్తున్నాం
హైదరాబాద్: శాసనసభలో దాడులు పునరావృతం అవుతుంటే మిగిలిన వారు సైలెంట్‌గా ఉంటే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. ఈ శాసనసభలో చూడకూడని సంఘటనలు చూస్తున్నామన్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి ప్రతిపక్ష సభ్యులపై దూషణలు చేయడం, దాడి చేయడం విచారకరమన్నారు. సభలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన మంత్రి బేషరతుగా సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అనుచిత చర్యలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరి తీసుకోవాలన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఈ సంఘటన పునరావృతం అయ్యేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలన్నారు. పత్రికల్లోగానీ, ప్రజల్లోగానీ సభపై గౌరవం పోయిందన్నారు. సభా గౌరవాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, స్పీకరు నాదెండ్ల మనోహర్ పాటుపడాలన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కాకుండా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. అందరూ మౌనంగా ఉండి కొంతమంది దుశ్చర్యలను చూస్తూ ఊరుకుంటే బలయ్యేది 294 మంది శాసనసభ్యులు మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలన్నారు. నాయకత్వం అనేది దూరదృష్టి, విజ్ఞతతో, ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉండాలన్నారు. ఈ సంఘటనను తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయంగా పైచేయి సాధించుకోవడానికే పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. ఆయనకు ఇంత కోపం రావడానికి గల కారణాలు ఏమిటో అర్థం కావటం లేదని సిపిఎం శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దోషి కాకుంటే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చించి వేయడం, ప్రతిపక్ష సభ్యులను పట్టి నెట్టివేయడం, దుర్భాషలాడటం మంత్రి రౌడీయుజం చేసినట్టుగా వ్యవహరించారన్నారు.