జగన్ వర్గం పై చర్యలకు రెడీనా?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులపై చర్యలకు కాంగ్రెసు నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కడప, అనంతపురం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమి పాలైన నేపథ్యంలో జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలకు నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లాలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోకపోతే వచ్చే పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది అవుతుందని కడప జిల్లా నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద వాదించినట్లు సమాచారం. కడప జిల్లా నాయకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, అమర్నాథ్ రెడ్డి, కె. శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కరుడు గట్టిన ఈ ఐదుగురు జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే మిగతా వారు సర్దుకుంటారని, సర్దుకోకపోతే తదుపరి చర్యలు తీసుకోవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీ వ్యతిరేకులకు డిఎస్ హెచ్చరిక

హైదరాబాద్: పార్టీలో ఉంటూ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవద్దని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను పార్టీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్ మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవడంతోనే సరిపోతుందని అన్నారు. పార్టీలో ఉంటూ విమర్శించుకోవడం సరికాదన్నారు. పార్టీలో 2004లో ఉన్న ఐక్యత 2009లో లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోవడం పెద్ద పని కాదన్నారు. అయితే అధిష్టానం సంయమనం పాటిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీ కోసం పాటుపడిన కార్యకర్తలను నామినేటేడ్ పదవులకు ఎంపిక చేస్తామన్నారు.

జగన్ కు కిరణ్ చురక

హైదరాబాద్: వ్యక్తుల వెంట పార్టీ నడవదని, పార్టీ వెంటే వ్యక్తులు నడవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను పార్టీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్టీలో కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అని అన్నారు. కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ ఉండదన్నారు.డిఎస్‌ పార్టీలో మరింత ఎదగాలని ఆయన అన్నారు. డిఎస్‌కు ఇంతకంటే పెద్ద పదవి రావాలని అన్నారు. పార్టీ వెంటే కార్యకర్తలు ఉంటారన్నారు. కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు ప్రతి మనిషికి సహజమన్నారు. పార్టీకి డిఎస్ చేసిన సేవలు మరువలేనివన్నారు.

సీఎం, డీఎస్ ను హెచ్చరించిన వీహెచ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హెచ్చరించారు. హైదరాబాదులో నేరాలు పెరిగి పోతున్నాయని, పెరుగుతున్న నేరాలను అరికట్టకుంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన వారిని హెచ్చరించారు. గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి సిఎం, విహెచ్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తదిదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు. ఎన్నాళ్లు అధ్యక్షులుగా పని చేశామన్నది ముఖ్యం కాదని పార్టీని ఎంత పటిష్టం చేశారని ప్రధానం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు అయ్యారనేది అవాస్తవమన్నారు. కొందరు సిఎం, డిఎస్‌లపై అవాకులు పేలుతున్నారన్నారు. ఎమ్మార్, రహైజాలపై సిబిఐ విచారణ జరిపిచాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేకులపై కార్యకర్తలు తిరగబడాలి ఆయన కోరారు.

పోలీసుల వేటలో హత్యకు వాడిన కారు

నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు సాంబశివుడు అలియాస్ ఐలయ్య హత్య కేసులో పోలీసులు ఆదివారం కొంత పురోగతి సాధించారు. సాంబశివుడు హత్యకు వాడిన కారును పోలీసులు చౌటుప్పల్‌‌ వద్ద హత్య జరిగిన చోటికి 20 కిలోమీటర్ల దూరంలో ఓ పాఠశాల వెనక కనుక్కున్నారు. ఈ మారుతి 800 కారుపై రక్తం మరకలు ఉండడం, దాన్ని పక్కకి నెట్టేసి కనిపించకుండా పెట్టడంతో ఇదే కారును సాంబశివుడి హత్యకు వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పైగా, కారులో ఓ కత్తి లభ్యమైంది. మద్యం సీసాలు కూడా కారులో ఉన్నాయి. సాంబశివుడి మృతదేహంపై 20 కత్తిపోట్లున్నాయి. కాగా, సాంబశివుడి హత్యకు మరో కారును పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. సాంబశివుడి హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నయీమ్ తో గొడవలే కారణమా?

హైదరాబాద్: మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడును హత్య చేసింది నయీమ్ గ్యాంగ్ పనేనని పలువురు భావిస్తున్నారు. సాంబశివుడు కుటుంబ సభ్యులు కూడా నయీమ్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పీపుల్సువార్‌లో ఉన్నప్పుడు నయీమ్, సాంబశివుడు మధ్యన ఉన్న గొడవలే ఇప్పుడు సాంబశివుడు హత్యకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు. నయీమ్ సోదరుడు అయిన అలీమ్‌ను సాంబశివుడు వర్గం చంపినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రతికారంగా సాంబశివుడు వర్గానికి చెందిన బెల్లి లలితను నయీమ్ వర్గం దారుణంగా హత్య చేసినట్లు అప్పుడు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలే ఇరువర్గాల హత్యలకు కారణంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే అనంతరం సాంబశివుడు నయీమ్‌ను, నయీమ్ సాంబశివుడును టార్గెట్ చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే నయీమ్‌కు ఓ కేసులో ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీ చేయడంతో ఆ తర్వాత నయీమ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆయన మంచాన పడ్డాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ సాంబశివుడు హత్య వలన మళ్లీ అందరు నయీమ్ వర్గంవైపు అనుమానంగా చూస్తున్నారు. సాంబశివుడు హత్యకు భూవివాదాలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది.

రాహుల్ కంటే ప్రియాంకే బెటర్

న్యూఢిల్లీ: భవిష్యత్ ప్రధానిగా నీరాజనాలు అందుకుంటున్న రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని అయ్యే అవకాశాలు లేవా. ఒకవేళ ప్రధాని కాకపోయినా కనీసం కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయా. ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా అవుననే సమాధానం చెపుతారు ప్రతి ఒక్కరూ. అయితే, యూఎస్ కేబుల్ వీకీలీక్స్ మాత్రం మరో సంచలనాన్ని బహిర్గతం చేసింది. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ కంటే.. ప్రియాంకా గాంధీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు వికీలీక్స్ తెలిపింది. రాహుల్ కంటే ప్రియాంక గాంధీకే దేశంలో ఎక్కువ ప్రచారం, ఆదరణ ఉందని అందుకే ఆమె వైపు ఆ పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతోందని వికీలీక్స్ పేర్కొంటోంది. అయితే, ప్రియాంక మాత్రం తన రాజకీయ భవిష్యత్‌పై ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎన్నికల సమయాల్లో మాత్రం ఆమె తన తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు.

ఉద్యమ అణిచివేతకే హత్య: గద్దర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికే ప్రభుత్వం సాంబశివుడ్ని హత్య చేయించిదని తెలంగాణ ప్రజాఫ్రంట్ గద్దర్ అన్నారు. మావోయిస్టు మాజీ నేత, టీఆర్‌ఎస్ పాలిట్‌బ్యూరో సభ్యుడు సాంబశివుడి హత్యలో పాలుపంచుకున్న దోషుల్ని వెంటనే బహిర్గత పరచాలని గద్దర్ డిమాండ్ చేశారు. మరో ప్రకటనలో మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... ఉద్యమాన్ని అణిచివేయడానికే సాంబశివుడి హత్య జరిపించారని ఆరోపించారు. కాగా, సాంబశివుడు మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ పూర్తిచేశారు. అంగతకుల దాడిలో గాయపడి, అతిగా రక్తస్రావం కావడంతో సాంబశివుడు మృతి చెందినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలింది. దాడి జరిగిన గంట తర్వాత ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. సాంబశివుడు దేహంపై 20 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్టులో వెల్లడైంది.

ధర్మభిక్షం ఆదర్శప్రాయుడన్న కేసీఆర్

హైదరాబాద్: మాజీ ఎంపీ ధర్మబిక్షం పార్థీవ శరీరానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే. చంద్రశేఖరరావు నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్ధం సీపీఐ రాష్ర్ట కార్యాలయం మఖ్ధూం భవన్‌లో ఉంచిన ధర్మభిక్షం భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించారు. ధర్మానికి ధర్మభిక్షం ప్రతీక అని, ప్రజసామ్య విలువలు పాటించే వారికి ఆదర్శపాయుడని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం కుటుంబానికి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. కాగా, మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ నేత ధర్మభిక్షం పార్థీవ శరీరానికి పలువురు ప్రముఖులు మఖ్ధూం భవన్‌లో నివాళులర్పించారు. ధర్మబిక్షం భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేసీఆర్, పోచారం, ఈటెల రాజేందర్, దత్తాత్రేయ, జానారె డ్డి, ఉప్పునూతుల, మోత్కుపల్లి, దేవేందర్‌గౌడ్, మంత్రి పితాని సత్యనారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్యలున్నారు.

ఫలితాలు జగన్‌కే అనుకూలం

హైదరాబాద్: కడప ఉపఎన్నికల్లో గెలుపు అవకాశాలు పూర్తిగా యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు ఫలితాలు జగన్‌కే అనుకూలంగా ఉంటాయన్నారు. న్యాయంగా, సాంప్రదాయబద్ధంగా చూసినా ఆయనే గెలుస్తారన్నారు. ముఖ్యంగా, పులివెందుల, కడప స్థానాల్లో వైఎస్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేస్తారని తాను భావించడం లేదన్నారు. నామినేషన్లు పడకపోవడమేంటి, కాంగ్రెస్ తరపున కూడా వేయరా ఏమని ప్రశ్నిస్తే.. తాను అంత లోతుగా మాట్లాడటం లేదని, ఆపై మీరే ఆలోచన చేసుకోవాలన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గం అభ్యర్థులను ప్రత్యర్థులుగా భావించక పోవడం వల్లే ఆ పార్టీకి మూడు సీట్లు వచ్చాయన్నారు. ఓవైపు జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధమవుతుంటే, మా వాళ్లేమో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని చెపుతున్నారన్నారు. అందువల్ల జగన్‌ను ఎక్కడా.. ఎవరూ కూడా ప్రత్యర్థిగా చూడటం లేదన్నారు. విజయనగరం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు జనం బాగానే వస్తారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘ఏ నాయకుడొచ్చినా చూడటానికి అన్ని పార్టీల వాళ్లూ వెళ్లడం మా జిల్లాలో సంప్రదాయం. జగన్ పార్టీలోకి మా జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరు’’ అన్నారు.

తెరాస నేత హత్య

నల్లగొండ: మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత సాంబశివుడిని శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో ధూంధాం కార్యక్రమానికి వెళ్లి ఇన్నోవా వాహనంలో మరో పది మందితో కలిసి తిరిగొస్తున్న సాంబశివుడిపై గోకారం వద్ద రెండు కార్లలో వచ్చిన పదిమంది వేటకొడవళు, గొడ్డళ్లతో దాడి చేశారు. సాంబశివుడు నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఈ సంఘటనలో సాంబశివుడు, తెరాస మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వలిగొండ ఆస్పత్రికి తరలించారు.సాంబశివుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సాంబశివుడు పోలీసులకు లొంగిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వస్తున్నాడు. కాగా, ఈ హత్యను టీఆర్‌ఎస్ ఖండించింది. తెలంగాణ ప్రాంతం ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆపార్టీ ఎమ్యెల్యే, శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన సాంబశివుడు మృతదేహాన్ని తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసీఆర్ సందర్శించనున్నారు.

తెలంగాణ పోరాట యోధుడు కన్నుమూత

నల్లగొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్‌ నేత బొమ్మగాని ధర్మభిక్షం శనివారం కన్నుమూశారు. ఇటీవల ఇంట్లో జారి పడటంతో ఆయన తొంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయసు 89 ఏళ్లు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం వూకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట 15 ఫిబ్రవరి 1922న ధర్మభిక్షం జన్మించారు. వారి కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండల్లో పని చేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై భారీ మెజార్టీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం అనంతరం 1957, 1962లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991, 96లలో నల్గొండ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

మొహాలీ మ్యాచ్‌కు పాక్ ప్రధాని!

ఇస్లామాబాద్: భారత ప్రధాని మన్మోహన్ క్రికెట్ దౌత్యం ఫలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొహాలీలో ఈ నెల 30న జరిగే భారత్-పాక్ క్రికెట్ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని మన్మోహన్ పంపిన ఆహ్వానానికి ప్రధాని గిలానీ అంగీకరించవచ్చని సంకేతాలు వచ్చాయి. ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న గిలానీకి ఈ ఆహ్వానం గురించి అధికారులు తెలపగా ఆయన చిర్నవ్వు చిందించారని సమాచారం. మొహాలీకి వెళ్లే అంశంపై ఆయన తమ అధికారులతో చర్చించారని పాక్ మీడియా కథనం. మ్యాచ్ సమయంలో ఇద్దరు ప్రధానులు అనధికారికంగా కలుసుకుంటారని మ్యాచ్ అనంతరం ఇద్దరూ తిరిగి అధికారికంగా భేటీ అవుతారాని, ఇరు దెసల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని పాక్ మీడియా పేర్కొంది. కాగా, మొహాలీ మ్యాచ్‌కు మన్మోహన్ హాజరుకావద్దని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి సూచించారు. ప్రధాని రాక భారత ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుందని చెన్నైలో అన్నారు. ముంబై దాడులకు పాక్ కారణమని భావిస్తున్న నేపథ్యంలో అక్కడి నేతలను మ్యాచ్ వీక్షించేందుకు రావాలంటూ సందేశం పంపడం.. నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల ప్రాణత్యాగాన్ని అవమానించడమేనన్నారు.

బీజేపీని ఇరుకునపెట్టిన వికీలీక్స్

న్యూఢిల్లీ: సంచలనాత్మక 'వికీలీక్స్' వెబ్‌సైట్ తాజాగా బీజేపీని, ముఖ్యంగా ఆ పార్టీ రాజ్యసభాపక్ష నేత అరుణ్ జైట్లీని ఇరుకునపెట్టే అంశాలను వెల్లడించింది. 'హిందూత్వ జాతీయవాదం మాకు ఓ అవకాశవాద అస్త్రం' అని 2005 మే 6న తనను కలిసినప్పుడు జైట్లీ అన్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ఇన్‌చార్జి రాబర్ట్ బ్లేక్ తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్‌లో పేర్కొన్నారు. 'బీజేపీకి ఇది నిరంతర చర్చనీయాంశమే. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఈ అస్త్రాన్ని వెలికితీస్తుంటాం' అని ఆయన చెప్పినట్లు బ్లేక్ తన సందేశంలో ఉటంకించారు. దీని ప్రకారం... 'భారత్-పాక్ సంబంధాలు అంతో ఇంతో మెరుగుపడుతున్నందువల్ల న్యూఢిల్లీ వంటి నగరాల్లో హిందూత్వ నినాదం అంతగా పనిచేయదు. అయితే, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి ముస్లిముల అక్రమ చొరబాటుపై ప్రజలు ఆందోళన చెందే ఈశాన్య రాష్ట్రాల్లో ఇదెంతో ప్రభావవంతం' అని జైట్లీ స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చిరంజీవి ధ్వజం

హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయించడం లేదని పీఆర్పీ అధినేత చిరంజీవి విమర్శించారు. వ్యవసాయ రంగంపై దేశంలో 65 నుంచి 70 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతున్నారని, దీనికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించే ఉద్దేశంతో ప్రారంభమైన ఏడో జాతీయ రైతుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్లు కరువవుతున్నారని ఆవేదన చెందారు. గత దశాబ్ద కాలంలో దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అందులో 10 వేల మందికి పైగా రైతులు రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. ప్రస్తుతం మన రైతాంగంలో 45 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని తెలిపారు. వ్యవసాయ భూములను సెజ్‌ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, వారిని సెజ్‌లలో భాగస్వాములను చేయాలని సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధి 8 నుంచి 9 శాతం నమోదు అవుతోందని, ఆ స్థాయిలో వ్యవసాయ రంగంలోనూ వృద్ధి కనపడాలని కోరారు. 2006 స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ‘సమైక్యాంధ్ర’

విశాఖపట్నం: తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు, మనోభావాలు తెలుసుకునేందుకు ఏప్రిల్ 10న సమైక్యాంధ్ర యూనివర్శిటీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్టు కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ఆరేటి మహేష్ తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదించిన రహస్య నివేదికను బహిర్గతపర్చాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై తెలంగాణ రాజకీయ నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తి, మీడియా మొత్తం సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉందన్న తెలంగాణవాదులు అభిప్రాయాల నేపథ్యంలో ఈ యాత్ర నిర్వహించదలచినట్టు పేర్కొన్నారు. వారి సంస్కృతిని గౌరవిస్తూ నిర్వహించే కార్యక్రమానికి మేధావులు, విద్యార్థులు, పరిశోధకులు హాజరవుతారన్నారు. తెలంగాణవాదం నిజంగా ప్రజల్లో ఉందా? లేదా అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేసే ఉద్యమంగా కొనసాగుతుందా? కలిసి ఉంటే, విడిపోతే వచ్చే లాభ నష్టాలు ఏమిటి? అనేది మీడియా సమక్షంలో బహిరంగ ప్రస్థావన ఉంటుందన్నారు. పర్యటనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్, కోదండరాం, గద్దర్‌లను కలుస్తామన్నారు. ఈ యాత్ర తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు. ఎటువంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. బస్సుయాత్రను అనుమతించాలంటూ గవర్నర్, రాష్ట్ర హోంమంత్రికి వినతిపత్రం సమర్పించామన్నారు. అయితే, అనుమతి ఇవ్వకున్నా బస్సుయాత్ర కొనసాగుతుందన్నారు.

ఆ ధైర్యం జగన్‌కు ఉందా?

హైదరాబాద్: రాష్ట్రంలో భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సభా సంఘాన్ని వేయాలని కోరే ధైర్యం జగన్‌కు ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'జగన్ వర్గం ఎమ్మెల్యేలు టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. మేం మా హయాంలో చేసిన కేటాయింపులపై కూడా సభా సంఘం విచారణకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై సభా సంఘం విచారణకు జగన్ సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఆయనతో లేఖ రాయించుకొని ఆ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం సభకు రావాలి. ఆయన ఆ మాట అనలేకపోతే నోరు మూసుకొని ఊరుకోవడం మంచిది' అని రేవంత్ ధ్వజమెత్తారు. జగన్ తరపున అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలకు కనీస పరిజ్ఞానం ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. 'సెజ్‌ల పాలసీని 2005లో కేంద్రం ప్రకటించింది. వైఎస్ హయాంలో వీటికి ఎడాపెడా అనుమతులిచ్చారు. టీడీపీ హయాంలో సెజ్‌లు వచ్చాయంటున్నారంటే.. వారికి ఏమన్నా తెలుసా అన్న అనుమానం వస్తోంది. వారికి, వారి నాయకునికి తెలియకపోతే ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధం' అని పేర్కొన్నారు.