కామన్వెల్త్ క్రీడల దుర్వినియోగం 900 కోట్లు
posted on Mar 28, 2011 @ 9:34AM
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన అవకతవకల వల్ల సుమారుగా రూ.900 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఈ అవకతవకలపై దర్యాప్తు కోసం ప్రధాని నియమించిన షుంగ్లూ కమిటీ వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడలకు సమయం సమీపిస్తున్నా సంబంధిత నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా ఆలస్యం చేయడం, అనంతరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యల వల్ల ఈ మొత్తం నష్టం వచ్చిందని కమిటీ పేర్కొంది. కామన్వెల్త్ క్రీడా గ్రామం నిర్మాణంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డిడిఎ)కు రూ.300 కోట్ల నష్టమొచ్చిందని తెలిపింది. రూ.250 కోట్ల ప్రజాధనం నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిందని వివరించింది. క్రీడా గ్రామం నిర్మాణం, నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయాలపై కమిటీ సమర్పించిన నివేదికలు ఈ విషయాలను స్పష్టం చేశాయి. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన నిర్మాణ ప్రాజెక్టుల పర్యవేక్షణ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజిందర్ ఖన్నా, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఇతర అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని కూడా కమిటీ పేర్కొంది. క్రీడా గ్రామంలో అనేక సమస్యలున్నాయని కమిటీ తన రెండో నివేదికలో పేర్కొంది. అప్పగించిన పనులను సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో చేయడంలో కన్సల్టెంట్ సంస్థ విఫలమైందని 16 మందిని ప్రశ్నించడం ద్వారా కమిటీ కనుగొంది. బిల్డర్‌గా ఉన్న ఎమ్మార్ ఎంజిఎఫ్‌కు ఉద్దీపనలు అందించడాన్ని కూడా కమిటీ ప్రశ్నించింది. ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.