జెసి మాటలు ఎవరూ నమ్మట్లే
posted on Mar 28, 2011 9:12AM
హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి తాను కారణం కాదంటూ ఆ పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఎంతగా చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెసులో జెసి దివాకర్ రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. తనకు మంత్రి పదవి రాకపోవడం వల్లనే జెసి దివాకర్ రెడ్డి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని ఓడించి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డిని గెలిపించారనే అభిప్రాయాన్ని జెసి దివాకర్ రెడ్డి కాదని అనిపించలేకపోతున్నారు. మెట్టు గోవింద రెడ్డిని గెలిపించడంలో జెసి ప్రధాన పాత్ర పోషించారనే విషయం బహిరంగంగానే బయట పడిందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి పని చేశారని ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చేందుకే జేసీ ఇలా వ్యవహరిస్తున్నారన్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కార్యకర్తల ముందు ఇప్పటికైనా జేసీ తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను వీడి జేసీ దివాకర రెడ్డి పోటీ చేస్తే ఆయనపై తాము పోటీకి సిద్ధమని సవాలు విసిరారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో మంత్రి శైలజానాథ్‌ను పక్కన కూర్చోబెట్టుకుని మంత్రి రఘువీరా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జెసిని విషపు పురుగుగా అభివర్ణించారు. దానికి జెసి దీటైన సమాధానం ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో రఘువీరా రెడ్డిపై ఆగ్రహంతో కాంగ్రెసు అభ్యర్థిని జెసి ఓడించారని అంటున్నారు. రఘువీరా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి మధ్య పోరుతో అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. భవిష్యత్తులో కూడా అనంతపురం జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. జెసి దివాకర్ రెడ్డి వైయస్ జగన్‌ను సాకుగా చూపి రఘువీరా రెడ్డిని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. రఘువీరా రెడ్డిని జగన్ మనిషిగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు.