ఇది సమర్థనీయమా?
posted on Mar 28, 2011 @ 2:12PM
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తీరును బట్టి ఆ కుటుంబ సంస్కృతి ఏమిటో తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి మండిపడ్డారు. వైయస్ కుటుంబం ఎలా దాడులు చేస్తుందో, ఎలా దౌర్జన్యాలు చేస్తుందో ఈ సంఘనట మంచి నిదర్శనమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూపందేరాలపై జెఎల్పీ వేయాలని డిమాండ్ చేస్తున్న టిడిపి శాసనసభ్యులపై వివేకానంద తిడుతూ చొక్కా పట్టుకున్నారని చెప్పారు. ఇది సమర్థనీయమా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారన్నారు. మంత్రి వివేకానందరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలంగాణ టిడిపి ఫోరం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగుదేశం భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందిగా శాంతియుతంగా అసెంబ్లీలో పోరాడుతుందన్నారు. కానీ మంత్రి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరిస్తూ టిడిపి సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. మంత్రి వెంటనే రాష్ట్ర ప్రజలకు, సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నారు. తన భూకబ్జాలు బయటపడుతుందనే వివేకా దాడి చేశారని అన్నారు. రంగారెడ్డి జిల్లా భూములు అన్నింటిని వైయస్ హయాంలో దోచుకున్నారని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అన్నారు. బడ్జెట్ సెషన్స్‌ను నడిపించడంలో డిప్యూటీ స్పీకరు నాదెండ్ల విఫలమయ్యారన్నారు. భూకేటాయింపులపై చంద్రబాబు హయాంలో జరిగిన వాటికి కూడా జెఎల్పీ వేసుకోవచ్చునని డిమాండ్ చేశారు. కాంగ్రెసులో జగన్ వర్గం ఒకటి ఉందని వాళ్లు కూడా దాడి చేయడం శోచనీయమన్నారు.