మంత్రి పదవికి వైఎస్ వివేకా రాజీనామా?
posted on Mar 28, 2011 9:24AM
హైదరాబాద్: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. శాసనసభ, శాసనమండలిలో సభ్యుడు కాకుండా మంత్రిగా ఉంటూ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది కాదన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికైన వివేకానందరెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఉప ఎన్నికల బరిలో దించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఆయన్ని శాసనమండలికి ఎంపిక చేయలేదు. దాంతో రేపటినుంచి శాసనసభలోగాని, మండలిలోగాని సభ్యుడు కాకుండానే మంత్రిగా కొనసాగాల్సి వస్తుంది. మంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లో ఆయన ఏదోక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వివేకానందరెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి తల్లి, దివంగత వైఎస్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేయనున్నారు. వివేకాను పులివెందుల అసెంబ్లీనుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే, తన వదిన మీదే ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా ఉంటూ పోటీ చేసినట్లయితే పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని వివేకా నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మంత్రిగా ఉంటూ పోటీ చేసి ఒకవేళ గెలిచినట్లయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారన్న అపవాదు వస్తుందని, ఒకవేళ ఓటమి చెందితే మంత్రిగా ఉంటూ కూడా గెలవలేకపోయారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివేకా భావిస్తున్నట్టు సమాచారం. అందువల్ల మంత్రి పదవికి రాజీనామా చేసి, ఒక సాధారణ నాయకునిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల ప్రజలకు మంచి సంకేతాలు పంపించినట్లు అవుతుందని, వివేకా మళ్ళీ మంత్రి కావాలంటే తప్పనిసరిగా గెలిపించాలని ప్రచారం చేసేందుకు కూడా వీలు పడుతుందని కడప జిల్లా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.