కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన జగన్
విజయనగరం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ జిల్లాలోని శృంగవరపుకోటలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ప్రజల ముఖాన చిరునవ్వును చూసేందుకు ఆనాడు దివంగత మహానేత ప్రియతమ నేత వైఎస్సార్ తపిస్తుండేవాడని చెప్పుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజలు బాగు పట్టని ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రావన్నారు. సిగ్గులేని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కయి అత్యంత గొప్పవాడైన వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తిరిగి రాలేడని తెలిసి, చెప్పుకోలేడని తెలిసి, వైయస్ లేరనే విషయాన్ని మరిచిపోయినట్లు నటిస్తూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి బురద చల్లే కుట్ర చేస్తున్నాయని, అది చూస్తుంటే గుండె బరువెక్కుతోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఓ మాట చెబుతూ ఉండేవారని, మనం బతికి ఉండగా ఎంత మంది జైజైలు కొట్టారనేది ముఖ్యం కాదనీ మరణించిన తర్వాత ఎంత మంది గుండెల్లో నిలిచిపోయామనేది ముఖ్యమని చెబుతూ ఉండేవారని, ఆ మాటలే శ్రీరామరక్షగా తాను ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కూడదని చెప్పేవారమని, ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదనీ ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు వైయస్సార్ అని ఆయన అన్నారు. మహానేత వైఎస్సార్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని మండిపడ్డారు. ఆ తర్వాత జగన్ వర్గం నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ సబ్బం హరి మాట్లాడుతూ.. జిల్లాలో వైఎస్ జగన్ అడుగు పెట్టనంత వరకూ కొంతమంది ఆటలు సాగాయనీ, ఇక నుంచి సాగవన్నారు. జగన్ రాకతో ఆ నాయకులు తమ అడ్రెస్‌లు ఎక్కడున్నాయో వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు.