వైఎస్ వివేకా తీరు.. ఆత్మరక్షణలో ప్రభుత్వం
posted on Mar 28, 2011 @ 2:01PM
హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ప్రవర్తించిన తీరు వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని వారంటున్నారు. మంత్రిగా ఉంటూ వివేకానంద రెడ్డి ఆ విధంగా వ్యవహరించడం సరి కాదని సహచర మంత్రులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేయనప్పటికీ మంత్రులు దాదాపు అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ఈ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇలాంటి సభలో ఉన్నందుకు బాధపడుతున్నానని ఆయన అన్నారు. కాగా, మరో మంత్రి వట్టి వసంతకుమార్ వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులతో వాగ్వివాదానికి దిగారు. వైయస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ, వట్టి వసంత కుమార్ మాటలను బట్టి చూస్తే మంత్రులు ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నప్పుడు మంత్రులు చాలా సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని, వారు అలా వ్యవహరించకపోతే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని వారంటున్నారు.