జగన్ వర్గం వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
posted on Mar 28, 2011 @ 10:19AM
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో ఉన్న జగన్ వర్గానికి చెందిన సభ్యులు ప్రజాప్రతినిధులు కారని వీధి రౌడీలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఆరోపించారు. ఇలాంటి వారిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ అవినీతి అక్రమాలపై ఎల్జీపీ వేయాలని కోరుతూ తెదేపా సభ్యులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. వైఎస్ దొంగల ముఠా అంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఆగ్రహించిన మంత్రి వైఎస్.వివేకా తెదేపా సభ్యులను అడ్డుకునేందుకు వెళ్లారు. ఇదేసమయంలో వివేకాకు మద్దతుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు వచ్చి తెదేపా సభ్యులపై దాడులకు పాల్పడినట్టు సమాచారం.
దీనిపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన తానెన్నడూ చూడలేదన్నారు. సాక్షాత్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, జగన్ వర్గానికి చెందిన సభ్యులు తెదేపా సభ్యులపై దాడులకు దిగడం దురదృష్టకరమన్నారు. అందువల్ల వీరిని వీధి రౌడీలతో పోల్చుతున్నట్టు చెప్పారు. సభలో దూకుడుగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తానే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే.. ఈ పాటికి సభా మర్యాదలను అప్రతిష్టపాలుజేసిన మంత్రిని బర్తరఫ్ చేసి ఉండేవాడినన్నారు. ముఖ్యమంత్రి వారిని సభ నుండి సస్పెండ్ చేయకుండే సరికాదన్నారు. అలా చేయకుంటే సభా హక్కుల ఉల్లంఘన పెడతామని అన్నారు.
జగన్ వర్గం ఎమ్మెల్యేలు కండబలం ఉపయోగించి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. టిడిపి కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వాటిపై జెఎల్పీ కోసం టిడిపి పట్టుబట్టిందన్నారు. వైయస్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు భారీగా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకున్నప్పుడు మాట్లాడని మంత్రి వివేకానందరెడ్డి వైయస్ పాలనలో జరిగిని అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానాలు చెప్పవలసిన మంత్రి దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.