తెలుగుదేశం సిద్ధాంత పార్టీ: బాబు
posted on Mar 27, 2011 @ 4:41PM
హైదరాబాద్: తెలుగుదేశం సిద్ధాంత పార్టీనే తప్ప అధికారం కోసం ఏర్పడిన పార్టీ కాదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సిద్ధాంతాలలో ఎలాంటి మార్పు ఉండదని మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అయితే మార్పులకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నముక అన్నారు. నగదు బదిలీ పథకం చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఇప్పటివరకు పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై ఈ నెల 29వ తేది నుంచి సమీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గతంలో పార్టీ వల్ల ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బందులేదురైన పరిస్థితులు ఏమైనా ఉంటె వాటిపై సమీక్ష జరిపి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పుట్టినా మనుగడ సాగించలేకపోయాయన్న చంద్రబాబు కాంగ్రెస్ లో పీఆర్పీవిలీనాన్ని ఉదాహరించారు. కాంగ్రెస్ ఓ ప్రాంతీయ పార్టీగా మారే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం తీసుకున్న చొరవేనని అన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకత్రాటిపైకి తెచ్చిన ఘనత కేవలం టిడిపిదే అన్నారు. చదువుకునే వారు రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలని ఎన్టీఆర్ ఆశించారని అందుకు అనుగుణంగానే పార్టీ వెళుతుందన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్వనస్థను రద్దు చేసిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు.