'మంత్రి దాడి చేయడం అప్రజాస్వామికం'
posted on Mar 28, 2011 @ 10:56AM
హైదరాబాద్: మంత్రిగా ఉన్న వ్యక్తీ స్వయంగా దాడిచేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి అన్నారు. శాసనసభ గౌరవం, మర్యాదలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-టీడీపీలు పట్టించుకోవటం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఘర్షణ అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా అభివర్ణించారు. అధికార, విపక్షాలు సొంత ఎజెండాలతో సభా సమయాన్ని, విలువలను మంటగలుపుతున్నాయని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చి వీధి రౌడిల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి గత ముప్పయి రోజులుగా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యయుతంగా సభకు పంపిస్తే ఇక్కడ వారు మాత్రం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ మీసాలు దువ్వుకుంటూ, జబ్బలు చరుచుకుంటున్నారన్నారు. ఇలా రౌడీల్లా ప్రవర్తించే వారని ప్రజలు సభకు పంపించవద్దని కోరారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభా మర్యాదలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని ఆయన కోరారు.