వివేకాకు క్లాస్ పీకిన కిరణ్ కుమార్
posted on Mar 28, 2011 @ 10:19AM
హైదరాబాద్: శాసనసభలో సోమవారం జరిగిన తన్నులాటపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని చీవాట్లు పెట్టినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారు. సంఘటనపై ఆరా తీశారు. వైయస్ వర్గం దొంగల ముఠా అనే ప్లకార్డులను ప్రదర్శించిన తెలుగుదేశం సభ్యులపై వైయస్ వివేకానంద రెడ్డితో పాటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు దాడి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. కాగా, తాజా సంఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు సభలో లేరు. సంఘటన గురించి తెలుసుకున్న ఆయన తన పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. గత వారం రోజులకు పైగా వైయస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సంయక్త సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సభ్యులు శాసనసభను స్తంభింపజేస్తున్నారు. శనివారం నుంచి వారికి ప్రతిగా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ నినాదాలు చేయడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆందోళనకు ప్రతిగా జగన్ వర్గం శాసనసభ్యులు ఆందోళనకు దిగిన సందర్భంలోనే తన్నులాట చోటు చేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి సహనం కోల్పోయి చింతమనేని ప్రభాకర్‌పై చేయి చేసుకున్నారు. తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడిపై కూడా దాడికి ప్రయత్నించారు.