వైఎస్ వివేకాను బుజ్జగించే పనిలో...
posted on Mar 28, 2011 @ 2:14PM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, ప్రభాకర్‌లపై దాడి చేసిన వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందను రాజీనామా చేయవద్దని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రి వట్టి వసంత్ కుమార్ బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి సభ్యులపై వివేకా దాడిని పార్టీలకతీతంగా అందరూ ఖండించారు. వివేకా వెంటనే సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు వివేకాతో క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అందుకు వివేకా ససేమీరా అన్నట్టుగా తెలుస్తోంది. తాను మంత్రి పదవికి రాజీనామానైనా చేస్తాను కానీ క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన తన రాజీనామాను కూడా సమర్పించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడు అయిన ఉండవల్లి, వట్టి వసంత్ కుమార్‌లు వివేకాను రాజీనామా చేయవద్దని బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, అసెంబ్లీలో జరిగిన సంఘటనపై తాను సభలోనే మాట్లాడతానని మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.