తెరాస కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం
posted on Mar 28, 2011 9:11AM
కర్నూలు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమని రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖమంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణా ఇస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని వివరించారు. మొదట గులాబీలతో శ్రీకృష్ణ కమిటీని ఆహ్వానించిన టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం నివేదికపై పరుషంగా మాట్లాడుతున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శ్రీకృష్ణ కమిటీపై పరుష పదజాలంతో మాట్లాడిన వారి నాలుకలు కోసే చట్టాలు తీసుకురావాలని ఆయన అన్నారు. నివేదికలోని ఎనిమిదవ అంశంలో ఉద్రేకపూరిత సమాచారం ఉండడంతోనే కమిటీ బయటపెట్టలేదని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో పార్టీలో కేసీఆర్‌కు పట్టులేదని స్పష్టమైందన్నారు. తెలంగాణా ఉద్యమం కేసీఆర్ చేయి దాటి పోయిందన్నారు. మిలియన్ మార్చ్‌కు 10 లక్షల మంది లక్ష్యం కాగా కనీసం పదివేల మందిని కూడా సమీకరించలేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. రాయలసీమకు శ్రీకృష్ణ కమిటీ అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమ వెనుకబడిన ప్రాంతమని పేర్కొందే కానీ దానికి పరిష్కారం చూపలేదని ఆయన చెప్పారు. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణా ఇస్తే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.