మొహాలీ మొనగాళ్లెవరో?
మొహాలీ: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం దాయాదుల సంగ్రామం జరుగనుంది. ఇందుకోసం మొహాలీ స్టేడియం సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. దీంతో ఇరు దేశాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా, యావత్ భారత జాతి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆటతో పాటు దౌత్యానికీ ఈ పోరు తెరతీయనుంది. ఇలాంటి సెమీ ఫైనల్ సమరం మరికొన్ని గంటల్లో జరుగనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సమరం దాయాదుల మధ్య హైప్రొఫైల్ సరిహద్దు యుద్ధాన్ని తలపిస్తోందన్నమాట. ఫైనల్‌కు ముందు ఫైనల్‌గా అభిమానులు అభివర్ణించుకుంటున్న ఈ మ్యాచ్ 120 కోట్ల భారతీయులు ఊపిరి సలపని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ధోనీ సేన విజయాన్ని కాంక్షిస్తూ దేవాలయాలు, మసీదులు, చర్చిలు కిక్కిరిసాయి. క్లబ్బులు, పబ్బులు, ఆఫీసులు, థియేటర్లు, ప్రధాన కూడళ్లలో అభిమానుల బిగ్‌స్క్రీన్లను వెతుక్కుంటున్నారు. కార్పొరేట్ సంస్థలు సెలవు ప్రకటిస్తే, సర్కారు ఉద్యోగులు డుమ్మా కొట్టేందుకు సిద్ధమయ్యారు. మొహాలీలో దాయాదుల సమరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు దిగారు. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ప్రత్యేక అతిథుల కోసం స్టేడియంలో 11 వేల సీట్లు సిద్ధం చేశారు. ఇక క్రికెట్ పోరు టెలివిజన్ చానళ్లు, బుకీలకు కాసుల పంట పండించింది. 10 సెకండ్ల టీవీ యాడ్ టారిఫ్ 18 లక్షల పలికితే, క్రికెట్ పేరు చెప్పి వ్యాపారం లక్ష కోట్లు దాటినట్టు అంచనా. మొహాలీ బ్యాటింగ్ పిచ్‌మీద ‘టాస్’ నుంచే ఉత్కంఠను ఎంజాయ్ చేయడమే తరువాయి. కాగా, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అతిథుల్లో భారత్, పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసుఫ్ రజా గిలానీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వ్యాపార దిగ్గజాలు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఇలా అందరి అడుగులు మొహాలీవైపే సాగుతున్నాయి.