సచిన్ ముందు లక్ష్యాలు

ముంబై: భారత్‌కు రెండో ప్రపంచ కప్ టైటిల్ సాధించి పెట్టాలనే సచిన్ టెండూల్కర్ కల ముంబై వాంఖడే స్టేడియంలో నెరవేరుతుందా అని లక్షలాది క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. శనివారంనాటి శ్రీలంక, భారత్ మధ్య ప్రపంచ కప్ పోటీ ఫైనల్ మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచుకు సంబంధించి సచిన్ టెండూల్కర్‌ ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి - భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టడం, రెండోది - తన సెంచరీల సెంచరీని పూర్తి చేయడం. తన సొంత నగరంలో స్థానిక ప్రేక్షకుల ముందు ఈ రెండు లక్ష్యాలు సాధించాలనే పట్టుదలతో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. వచ్చే నెలలో 38 ఏళ్ల పడిలో పడుతున్న సచిన్ టెండూల్కర్ బ్యాటింగులో దాదాపు అన్ని ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. టెండూల్కర్ ఇప్పటి వరకు ఐదు ప్రపంచ కప్ పోటీల్లో ఆడాడు. ఆరో ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతున్న సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ రికార్డును సమం చేశాడు. ఈ ఆరో ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఫైనల్ చేరుకోవడానికి సచిన్ కీలక పాత్ర పోషించాడు. మరో ప్రపంచ కప్ పోటీలో అతను ఆడే అవకాశాలు లేవు. అద్భుతమైన విశ్వాసంతో ఉన్న శ్రీలంక జట్టును ఫైనల్ మ్యాచులో ఓడించడం అంత సులభమేమీ కాదు. సచిన్ టెండూల్కర్‌ను వందో సెంచరీ సాధించడానికి శ్రీలంక అనుమతిస్తుందా అనేది అనుమానమే. టెండూల్కర్‌ను లక్ష్యంగా చేసుకుని శ్రీలంక బౌలర్లు విజృంభిచవచ్చు. భారత్ లాగే శ్రీలంక కూడా రెండో ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

టీఆర్ఎస్ విలీనం: టీజీ

కర్నూలు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే సమస్యే లేదని చిన్ననీటి పారుదల శాఖమంత్రి టిజి వెంకటేష్ గురువారం కర్నూలు జిల్లాలో వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించదన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆరవ సూత్రం మేరకే కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కాంగ్రెసు పార్టీలో జూలైలో విలీనం చేస్తారని అన్నారు. కాగా కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ స్థానాలు గతంలో కాంగ్రెసు పార్టీవేనని 12 సూత్రాల చైర్మన్ తులసీరెడ్డి మెదక్ జిల్లాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఆ రెండు స్థానాల్లో కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన అన్నారు.

మద్దతుపై తేల్చుకోలేని సీపీఎం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలా లేక మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకాలా అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు గురువారం అన్నారు. త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు జరిగే ఎన్నికల్లో జగన్‌కు లేదా చంద్రబాబుకు మద్దతు తెలిపే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకులమని చెప్పారు. కాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి  ఛార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం, శనివారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని ఆయన సిపిఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సామాన్యులపై భారాన్ని వేస్తుందని అన్నారు.

వారిని సస్పెండ్ చేస్తేనే ప్రచారానికి

కడప: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని కడప జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి గురువారం ధ్వజమెత్తారు. జగన్‌ వెంట నడుస్తున్న వారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కాంగ్రెసు పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన విధంగా జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులు కూడా రాజీనామా చేసి పోటీకి సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభలకు కాంగ్రెసు అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు. జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి గట్టిగా చెప్పామని ఆయన అన్నారు. ఆయన వెంట వెళుతున్న శాసనసభ్యులు పార్టీలోనే ఉంటే మేం జగన్‌ను ఎదుర్కోవడం కష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారిని పార్టీనుండి సస్పెండ్ చేయకుంటే జగన్‌ను ఎదుర్కొనే శక్తి మాకు ఉండదన్నారు. వారిని సస్పెండ్ చేస్తేనే ప్రచారానికి వెళతామని, తద్వారా విజయాన్ని సాధిస్తామని చెప్పారు.

కార్యకర్త ను కొట్టిన విజయ్‌కాంత్?

చెన్నై: తమిళ హీరో, డిఎండికె అధినేత విజయ్‌కాంత్ ఓ పార్టీ కార్యకర్తను చితకబాదాడు. ఏప్రిల్ 13న ఎన్నికలు ఉన్నందున విజయ్‌కాంత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంలో విజయ్‌కాంత్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను చితకబాదినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తను చితకబాదుతున్న విజయ్‌కాంత్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయన ఆ కార్యకర్తకు క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇది తమిళనాట తీవ్ర దుమారం లేపుతోంది. అయితే ఇందులో నిజం లేదని విజయ్‌కాంత్ అంటున్నారు. తాను ఏ కార్యకర్తను కొట్టలేదని చెబుతున్నారు. తాను కార్యకర్తను కొడుతున్న దృశ్యాలు కేవలం కల్పితమే అన్నారు. వాటిని మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కలైంజ్ఞర్ టీవీ, సన్ టీవీలు కలిసి తాను కార్యకర్తను చితకబాదినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ డామేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఇమేజ్ డామేజ్ చేయ ప్రయత్నించాయంటూ ఆయా టీవీలకు విజయ్‌కాంత్ లీగల్ నోటీసులు పంపారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఉపఎన్నికలపై బాబు దృష్టి

హైదరాబాద్: పులివెందుల శాసనసభ స్థానానికి, కడప పార్లమెంటు సీటుకు జరిగే ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కసరత్తు మొదలు పెట్టారు. గురువారంనాడు ఆయన కడప జిల్లా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ రెండు సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైయస్ విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. మారిన పరిస్థితి నేపథ్యంలో రెండు సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను పోటీకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఆయన గురువారంనాటి సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

తమిళనాడులో ఎన్నికల ప్రచార హోరు

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి కరుణానిధి కథ ముగిసిందని ఏఐఏడిఎంకె అధినేత్రి, పురుచ్చి తలైవి జయలలిత అంటున్నారు. డిఎంకె ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో విసిగిపోయిన తమిళ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ సర్వేలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే వార్తలను ఆమె కొట్టి పారేశారు. ప్రజలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. తమ పార్టీ సొంతగా గెలవడం ఖాయమని ఆమె చెబుతున్నారు. కాగా ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రం సంకీర్ణ ప్రభుత్వం వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెసు ఆధ్వర్యంలో సంకీర్ణం ఉన్నట్టే తమిళనాడులో తమ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అయితే కుంభకోణాల నేపథ్యంలో గెలుపపై నమ్మకం కోల్పోయిన కరుణానిది సంకీర్ణంపై మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇప్పటికే దక్షిణాధిన కర్ణాటకలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఇక తమిళనాడుపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకున్నా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలనే తాపత్రయంలో ఉంది. ఇందులో భాగంగా 40 మంది జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన నేతలను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని ఆమె అంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోఢీ, అలనాటి నటి హేమమానిలి, టీవీ నటి స్మృతి ఇరానీలతో పాటు పలువురిని ప్రచారానికి ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.

శ్రీజ కేసు ఏప్రిల్ 16కు వాయిదా

హైదరాబాద్: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కుమార్తె శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల కేసు విచారణ ఏప్రిల్ 16కు వాయిదా పడింది. శ్రీజ ఈనెల 15న భర్త శిరీష్, భరద్వాజ్, అత్తపై సీసీఎస్ పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టింది. శిరీష్, అతని తల్లి ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేయగా కోర్టు తల్లికి మాత్రమే బెయిలు మంజూరు చేసి భరద్వాజ్ పెటిషన్ ను కొట్టివేసింది.  తన భార్యతో మాట్లాడడానికి ఒకసారి అవకాశం కల్పించాలని అతను కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేసింది. శ్రీజ తరపు న్యాయవాది వాయిదా కోరారు. దీంతో వచ్చే నెల 16కు కేసును వాయిదా వేశారు.

ఉపఎన్నికల వాయిదాను కోరిన ఎంసెట్ కమిటీ

హైదరాబాద్: ఎంసెట్ పరీక్షల నేపథ్యంలో కడప, పులివెందుల ఉప ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌ను ఎంసెట్ కమిటీ కోరింది. మే 8వ తేదీన ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. అదే రోజున కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నియోజవర్గాల నుంచి ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ఎంసెట్ కమిటీ భన్వర్‌లాల్ కోరింది. ఇందుకు ఆయన సుముఖంగా స్పందించి, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

జూ ఎన్టీఆర్ 'శక్తి' పై వివాదం

హైదరాబాద్: భారీ అంచనాలతో శుక్రవారం విడుదలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాపై వివాదం చెలరేగుతోంది. శక్తి సినిమాలోని కొన్ని దృశ్యాలపై మాజీ సైనికోద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జాతీయ జెండాలోని మూడు రంగులు వేసిన బూట్లను ధరించాడని, అది భారత త్రివర్ణ పతాకను అవమానించడమేనని వారంటున్నారు. ఆ దృశ్యాలను సినిమా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శక్తి సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్. తాజాగా సినిమాపై చెలరేగిన వివాదంపై మాట్లాడడానికి దర్శకుడు గానీ నిర్మాత గానీ అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వాడిన బూట్లను తెప్పించి పరిశీలించిన తర్వాతనే మాట్లాడాలనే ఉద్దేశంతో వారున్నట్లు చెబుతున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు.

ఎసిబి చేతికి మరో అవినీతి చేప

గుంటూరు: అవినీతి నిరోధక శాఖ చేతికి మరో అవినీతి చేప చిక్కింది. గుంటూరు జిల్లాలోని రేపల్లె ఆర్&బిలో డిఇగా పని చేస్తున్న మోహన్ రావు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం ఉండటంతో ఎసిబి అధికారులు గురువారం ఉదయం 5 గంటలకే ఆయన ఇంటిపై దాడులు ప్రారంభించారు. ఈ దాడులలో అధికారులు కీలక డాక్యుమెంట్లను కనుగొన్నట్లుగా తెలుస్తోంది. సుమారు రూ.10 కోట్ల విలువైన పత్రాలు వారు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం నుండే గుంటూరులోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు ప్రారంభించారు. మోహన్ రావు బంధువుల ఇళ్లపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాదు, గుంటూరు జిల్లాలో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న పత్రాలు వారు కనుగొన్నట్లుగా తెలుస్తోంది.

భారత జనాభా 121 కోట్లు

న్యూఢిల్లీ : 2011 జనాభా లెక్కల వివరాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి గురువారం ఇక్కడ అధికారికంగా విడుదల చేశారు. తాజా గణాంకాల ప్రకారం 2011 నాటికి భారత జనాభా 121 కోట్లుకు చేరింది. గత పదేళ్లలో దేశ జనాభా 18 కోట్లుకు పెరిగింది. పురుషులు 62 కోట్లు, మహిళలు 58కోట్లు. 2001 తర్వాత మళ్లీ పదేళ్లకు ఈ ఏడాది పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను సేకరించిన విషయం తెలిసిందే. కాగా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా, నాగాలాండ్‌లో జనాభా శాతం తగ్గింది. అలాగే పురుషులు 17 శాతం, స్ర్తీలు 18 శాతం పెరిగారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జనాభా (8,46,65,533) 8 కోట్ల 46 లక్షలకు చేరుకుంది.

డిప్యూటీ సీఎం పై లోక్ సత్తా పోటీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలోని లోక్‌సత్తా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 235 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి 40 స్థానాల నుండి లోక్‌సత్తా పోటీ చేస్తోంది. అయితే ఆ నలభై స్థానాలలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న స్టాలిన్ నియోజకవర్గం కూడా ఉంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కొళత్తూరు నియోజక వర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఇదే నియోజకవర్గం నుండి లోక్‌సత్తా పార్టీకి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, జాతీయ అవార్డు గెలుచుకున్న అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే తమిళనాడులో లోక్‌సత్తా మక్కల్ శక్తి కట్చి పేరుతో బరిలోకి దిగుతోంది. అంతేకాదు ఇప్పటికే ప్రచారం రంగంలోకి దిగిన అశోక్ కుమార్ ఇటు అన్నాడిఎంకె, అటు అధికార డిఎంకె పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడంట. ఇటీవలే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెన్నైలో పర్యటించి వారికి ఈల గుర్తును అందజేశారు.

రఘువీరాకు జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్

అనంతపురం: మంత్రి రఘువీరారెడ్డిపై అనంతపురం జిల్లా కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రఘువీరారెడ్డిపై పోటీకి తాము అనంతపురం జిల్లాలో ఎక్కడైనా సిద్ధమని ప్రకటించారు. ఆయనపై పోటీ చేయడానికి తామే అవసరం లేదన్నారు. మా డ్రైవర్‌ను బరిలోకి దింపి గెలిపించుకుంటామని ప్రభాకర్ సవాల్ విసిరారు. గెలుపుపై మా సత్తా మాకు తెలుసన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేతలు తాము ఇప్పుడున్న కాంగ్రెసు పార్టీలోనే ఉంటామని ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. తన అన్న దివాకర్ రెడ్డి, తాను తప్పితే అనంతపురం జిల్లాలో ముందు ముందు ఎవరూ కాంగ్రెసు పార్టీలో ఉండరని అన్నారు. రఘువీరారెడ్డి, మోహన్ రెడ్డి వంటి పలువురు నేతలు మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళతారని అన్నారు. చివరకు అనంతపురం జిల్లా కాంగ్రెసులో మిగిలే నేతలం తామే అన్నారు.

జగన్‌ను ఓడించడమే ప్రధాన లక్ష్యం

హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కాంగ్రెసు వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు నాయకత్వం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహం మారినట్లు తెలుస్తోంది. కడప లోక్ సభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్‌ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మపై పోటీకి దిగకూడదని కాంగ్రెసు నాయకత్వం అనుకుంటున్నట్లు సమాచారం. కడప లోక్ సభ స్థానంలో వైయస్ జగన్‌పై ఆయన బాబాయ్, వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించాలని, జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్‌పై గౌరవంతోనే తాము వైయస్ విజయమ్మపై పోటీ పెట్టడం లేదని ప్రచారం చేసుకుని జగన్‌ను లోకసభ స్థానంలో దెబ్బ తీయాలని ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను బట్టి ఈ వ్యూహం అర్థమవుతోంది. పులివెందులలో వైయస్ విజయమ్మపై అభ్యర్థిని పోటీకి దించకూడదని కోరుతూ ఆయన సోనియాకు లేఖ రాశారు. ఇలా తమ పార్టీ నాయకుల ద్వారా విజ్ఞప్తులు చేయించి వైయస్ విజయమ్మపై పోటీని విరమించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మూతపడనున్న ఫుకుషిమా రియాకర్లు

టోక్యో: జపాన్‌కు అణు విపత్తు తెచ్చిపెట్టిన ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రంలోని 1,2,3,4 నంబర్ రియాక్టర్లు మూతపడనున్నాయి. రేడియోధార్మికతకు కారణవుతున్న వీటిని మూసివేయాలని నిర్ణయించామని ప్లాంటును నిర్వహిస్తున్న టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ(టెప్కో) చైర్మన్ సునెహిస కట్సుమట తెలిపారు. ఇటీవలి భూకంపం, సునామీల కారణంగా ఈ రియాక్టర్లలో హెడ్రోజన్ పేలుళ్లు సంభవించడం, ఫలితంగా రేడియోధార్మిక పదార్థాలు వ్యాపిస్తుండడం తెలిసిందే. రేడియోధార్మికత విస్తరించకుండా రియాక్టర్ భవనాలపై ఫ్యాబ్రిక్ షీట్లను క ప్పాలని సిబ్బంది యోచిస్తున్నారు. పేలుళ్ల శకలాలనుంచి రేడియేషన్ వ్యాపించకుండా వాటిపై నీటిలో కరిగే రెజిన్‌ను స్ప్రే చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బుధవారం ప్లాంటు సమీపంలోని సముద్ర జలంలో రేడియోధార్మిక పదార్థమైన అయోడిన్-131 మోతాదు ప్రామాణిక స్థాయి కంటే 3,355 రెట్లు ఎక్కువగా నమోదైంది. ప్లాంటులోని మట్టిలో అత్యంత ప్రమాదకర రేడియోపదార్థం ప్లుటోనియాన్ని సోమవారం గుర్తించారు. రియాక్టర్లను చల్లబరిచేందుకు సిబ్బంది వాటిలో నీటిని నింపుతున్నారు. దెబ్బతినని 5,6 నంబర్ రియాక్టర్లను ఇప్పటికే పూర్తిగా శీతలీకరించారు. ప్లాంటులోని అన్ని రియాక్టర్లను మూసివేయాల్సిన అవసరముందని చీఫ్ కేబి నెట్ కార్యదర్శి యూకియో ఎడనో పేర్కొన్నారు. ఫుకుషిమా ఉదంతం నేపథ్యంలో దేశంలోని అన్ని అణు రియాక్టర్ల పనితీరును తనిఖీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా ప్లాంటు నిర్వహణ కంపెనీ టెప్కో అధ్యక్షుడు షిమిజూ మంగళవారం బీపీ, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.

జగన్ పార్టీ కామన్ సింబల్ కు ఈసీ నో

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయనందున కామన్ సింబల్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది. పార్టీ సింబల్ లేకుండానే వైయస్ జగన్ పులివెందుల, కడప శాసనసభ, పార్లమెంటు సీట్లకు పోటీ చేయాల్సి ఉంటుంది. పులివెందుల శాసనసభ సీటుకు పోటీ చేసే వైయస్ విజయమ్మకు, కడప పార్లమెంటు సీటుకు పోటీ చేసే వైయస్ జగన్‌కు వేర్వేరు చిహ్నాలు లభించే అవకాశాలున్నాయి. దేశంలోని మరో ఎనిమిది పార్టీలకు కూడా కామన్ సింబల్స్ ఇవ్వడానికి ఈసి నిరాకరించింది. కాగా, వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు పార్టీ ప్రయోగిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులే అంటున్నారు. అన్న కుమారుడు అని కూడా మర్చిపోయి వైయస్ వివేకానంద రెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు అంబటి రాంబాబు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ ప్రత్యర్థిగా మారి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు వాయిస్ వినిపిస్తున్నారని ఆయన అన్నారు. పథకం ప్రకారం కాంగ్రెసు పార్టీ వైయస్ వివేకా ద్వారా వైయస్సార్‌ను దూషింపజేస్తోందని ఆయన అన్నారు. కడప, పులివెందుల ఎన్నికలు తమ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు.

ఓదార్పు యాత్ర వాయిదా

విజయనగరం: ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 వరకు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించాల్సి ఉంది. అయితే బుధవారం ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దాంతో ఓదార్పు యాత్రను ప్రస్తుతానికి వాయిదావేసి, వైఎస్సార్ జిల్లాలో ఉప ఎన్నికల వ్యవహారాలు చూడాల్సిందిగా పార్టీ నేతలు, అభిమానులు జగన్‌ను కోరారు. మొదట ఈ యాత్రను పూర్తి చేయడానికే జగన్ నిర్ణయించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై యువనేత ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రను పార్టీ నేతలు జగన్ వద్ద ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలు, తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు పార్టీల కుట్ర, కుతంత్రాలు బహిర్గతమైన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. వెంటనే ఉప ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆయనకు సూచించారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి, మళ్లీ ఇక్కడ ఓదార్పు యాత్రను కొనసాగించాలని విజయనగరం జిల్లా నేతలు కూడా ఆయనను కోరారు. పార్టీ నేతలు పదే పదే కోరడంతో.. ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయడానికి జగన్ అంగీకరించారు.