దేశాన్ని కుదిపేస్తున్న 'క్రికెట్' ఫీవర్
మొహాలీ: చిరకాల ప్రత్యర్థుల మధ్య సూపర్ మ్యాచు కోసం సర్వం సిద్దమైంది. పాకిస్తాన్, భారత క్రికెట్ జట్లు మొహాలీ మైదానంలో మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయాలు, క్రీడలు కలగలిసి ఇరు దేశాల్లో క్రికెట్ అభిమానులు మ్యాచు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల ప్రజలు ఇరు వైపులా యుద్ధ క్షేత్రంలో మోహరించినట్లుగా ఉంది. బడా పారిశ్రామికవేత్తల నుంచి నిరుపేదల వరకు అందరి దృష్టి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోయే పాకిస్తాన్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచు మీదే ఉంది. లక్షలాది మంది మొహాలీలో మోహరించారు. నరాలు తెగిపోయే ఉత్కంఠతో అభిమానులు మ్యాచు చివరి వరకు ఎదురు చూస్తుంటారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ చేదు అనుభవాల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటీ ప్రభావం పతాక స్థాయికి చేరుకుంది. ఇరు జట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఓటమి చవి చూస్తే క్రికెట్ అభిమానుల నుంచి ఎదురయ్యే పరిణామాలు ఏమిటో ఇరు జట్లకూ తెలుసు. అందుకని, ఇరు జట్లు కూడా విజయానికి తీవ్రమైన పట్టుదలతో కృషి చేస్తాయని చెప్పవచ్చు. ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న తొలి మ్యాచు ఇదే. ఇప్పటి వరకు ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్, భారత్ జట్లు నాలుగు సార్లు పోటీ పడ్డాయి. ఈ నాలుగు విడతలు కూడా భారత్ విజయం సాధించింది. అయితే, మొత్తంగా తీసుకుంటే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచుల్లో పాకిస్తానే ఎక్కువ సార్లు గెలిచింది. అయితే, గత రికార్డులు ఏవీ ప్రస్తుత మ్యాచులో పని చేయవని చెప్పవచ్చు.
కాగా, పాక్‌తో భారత్ గెలవాలని ఆశిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. అయితే సామాన్యులతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా భారత్ గెలుపు కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు బుధవారం సెలవును ప్రకటిస్తే, మరికొన్ని ఒక్క పూటకే కార్యాలయ పనులను పరిమితం చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత కార్యాలయాలలోని పెద్ద స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగులు అక్కడే ఆటను చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. సామాన్యులతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు సన్నద్దమయ్యారు. ముఖేష్ అంబానీ ఆయన సతీమణి రీటా అంబానీతో, అనీల్ అంబానీ, కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా తదితరులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించనున్నారు. అంతేకాదు ఒబెరాయ్ హోటల్లో సిఐఐ పలు కంపెనీల సిఈవోలకు మ్యాచ్ సందర్భంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒబెరాయ్ హోటల్లో పెద్ద స్ర్కీన్ ఏర్పాటు చేసి వారు మ్యాచ్ చూడనున్నారు. ఇందులో రాకేష్ భారతీ మిట్టల్, బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్, ఆదేశ్ గుప్తా, అలోక్ సక్సేనా, మణీందర్ ఎస్.గ్రేవల్ తదితరులు ఉన్నారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలవాలని ఆశిద్దాం .